ఇది ఉద్వేగం కాదు.. మనిషిలో దాగిన క్రూరత్వం!

by Ravi |   (  Updated:2026-07-02 01:16:04  IST  )

చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, హత్యలు కేవలం చట్టపరమైన సమస్యలు మాత్రమే కావు. ఈ నేరాల వెనుక దాగి ఉన్న క్రూర మనస్తత్వం, సామాజిక వైఫల్యాలు, నైతిక సంక్షోభం గురించి విశ్లేషించే కథనం.

ఇది ఉద్వేగం కాదు.. మనిషిలో దాగిన క్రూరత్వం!
X

చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, వాటి తర్వాత వెలుగులోకి వస్తున్న అమానుష హింస, హత్యలు సమాజాన్ని కుదిపేస్తూనే ఉన్నాయి. ప్రతి సంఘటన తర్వాత ఒకే రకమైన ఆవేదన వ్యక్తమవుతోంది. కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతున్నాయి. న్యాయం కోసం నినాదాలు వినిపిస్తున్నాయి. కఠిన శిక్షల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ ఈ ఆగ్రహం, దుఃఖం , ఆందోళనలు, మానసిక సంఘర్షణలు అసలు మూలాన్ని వెతకడంలో అలసిపోతున్నాయి .

ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తుల మానసిక ప్రవృత్తి ఏమిటి? అది ఒక్క క్షణపు ఉద్వేగమా? లేక వారి వ్యక్తిత్వంలోనే దాగి ఉన్న ఏదైనా చీకటా? లేదా వారి జీవితం, వారి స్వతః సిద్ధ మానసిక కోణం ఇలాంటప్పుడే బయటపడుతోందా!? ఇన్నాళ్లు మనం దానిని ఇగ్నోర్ చేశామా? ఇవే ఆ మూలాలు..

అతను చేసిన గాయాన్ని మర్చిపోతున్నాం!

ఇలాంటి నేరాలు జరగగానే ఆ క్రూరుడిని ఒక గాటన కట్టేస్తాం "అదుపు తప్పిన కోరిక", "క్షణిక ఉద్వేగం", "ఆవేశం" వంటి అనేక పొరల మాటున అతను చేసిన గాయాన్ని మర్చిపోతున్నాం. కానీ వయసుతో సంబంధం లేకుండా, పరిస్థితుల అంశం లేస్యమాత్రమైనా లేకుండా చిన్నారులపై, మహిళలపై, జరిగే అత్యాచారాలను, వాటి తర్వాత జరిగే హత్యలను పరిశీలించినప్పుడు ఇవన్నీ అసంపూర్ణాలు కదా!?. అవును ఒకవేళ అది నిజంగానే ఒక్క క్షణపు ఉద్వేగమే అయితే, ఆ దారుణ కృత్యానికి ముందూ, వెనుకా కనిపించే పాశవిక హింస సంగతి ఏమిటి? చిన్నారి భయాన్ని చూస్తూ, చిన్నారి లేదా ఆమె అసహాయతను గమనిస్తూ, ఆ బాధను గ్రహిస్తూ కూడా తనను తాను మనిషిగా మరచిపోయి మృగత్వాన్ని కొనసాగించడం ఏ రకపు ఉద్వేగం? తన తనకాలమాన పరిస్థితులు, తన సోషల్ స్టేటస్, అందులో తాను అప్పటివరకూ పొందిన పేరు అన్నీ వదిలేసి కేవలం తన పశుత్వాన్ని మాత్రమే తాను నిరూపించుకోవడానికి సిద్ధపడటం ఏమిటి !?

చిన్నారి కన్నీళ్ల కంటే తన కోరిక పెద్దదైతే..

పోనీ నేరం జరిగిన తర్వాత అయినా తనను తాను గుర్తి స్తున్నారా? హత్యలకూ దిగుతున్నారు అదీ అత్యంత కర్కశంగా.. ఎవిడెన్స్‌ను చెరిపేయడానికి తొక్కకూడని దారులు తొక్కుతూ ఒక తప్పుకు వంద తప్పులు చేస్తూ పోతున్నారు? బయటపడతాననే భయంతో బాధితులకు ఇంకా ఇంకా నరకం చూపెడుతున్నారు. అసలిక్కడి వాస్తవం క్షణిక ఉద్వేగం కాదు. అతని లోపలి ఎన్నో రోజుల క్రూరత్వం. ఒక చిన్నారి కన్నీళ్ల కంటే తన కోరిక పెద్దదిగా కనిపిస్తోంది, ఒక చిన్నారి ప్రాణం కంటే తన రక్షణ ముఖ్యమైపోతోంది, ఎదుటివారి బాధను గుర్తించలేని నైతిక పతనం ఇది. ఒక మనిషి మరొక మనిషిని మనిషిగా చూడలేని స్థితి ఇది. సైకాలజీ దీనిని మానవత్వాన్ని హరించడంగా నిర్వచిస్తుంది. అంటే ఎదుటివారి వ్యక్తిత్వం, హక్కులు, బాధ అన్నీ అదృశ్యమై, అతను లేదా ఆమె కేవలం ఒక వస్తువుగా మారిపో‌వడం, తన ఆనందం, తన మానసిక వికారం తీర్చుకోవడానికి వారు ఒక ఆటబొమ్మగా వీరి దృష్టికి కనిపించడం.

రాక్షసుల ముఖాలపై క్రూరత్వం రాసి ఉండదు..

పోనీ ఇది క్షణకాలపు ఉద్వేగం కాదు, ఇది వారి వ్యక్తిత్వంలో భాగమే అనుకుంటే, అటువంటి వ్యక్తులను మనం ఎలా గుర్తించాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమా నించాలి? ఇలాంటి నేరాలు చేసే వారు మనకేం రాక్షసుల్లా కనిపించరు. వారి ముఖాలపై క్రూరత్వం రాసి ఉండదు. వారు కుటుంబ సభ్యులుగా, బంధువులుగా, పొరుగువారిగా, సహోద్యో‌గులుగా, కొన్నిసార్లు సమాజంలో అత్యంత గౌరవనీయులుగా కూడా ఉంటారు."అతను అలాంటి వాడని అనుకో‌లేదు." అనేంత మంచివాడిగా మన మధ్య తిరుగుతూ మనతోనే జీవిస్తుంటారు.

ప్రపంచం ఆమెకు భయంగా మారకూడదు..

ఇదే ఇప్పటి సమాజం ఎదుర్కొంటున్న అసలైన సవాలు, ఒకానొక చీకటిని గురించిన భయం. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. మనుషులను అర్థం చేసుకునే మన సామర్థ్యపు సమస్య, విలువల సమస్య. మనం చూసేది ఒక పబ్లిక్ ఇమేజ్‌ని మాత్రమే అయితే? మనకు కనిపించని అతని మరో ప్రపంచం!? ఆ చీకటిని ముందుగానే గుర్తించలేని మన నమ్మకం!? ఇవన్నీ ప్రశ్నలే. మనం చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీలతో మనతో నిలబడ్డ వ్యక్తుల అసలు రంగు మనం చూసేది ఎలా!? వారి అంతర్ముఖ చిత్రాలు చిత్రించేది ఎలా!? అందుకే చిన్నారులపై జరిగే లైంగిక హింసను కేవలం చట్ట పరమైన సమస్యగా చూడలేం. అది సామాజిక సమస్య. నైతిక సమస్య. మానసిక సమస్య. అంతకన్నా ముందు అది ఒక నాగరికత సంక్షోభం. ఎందుకంటే ఒక చిన్నారి ప్రపంచాన్ని మొదటిసారి విశ్వసించడం నేర్చుకుంటున్న సమయంలో, అదే ప్రపంచం ఆమెకు భయంగా మారకూడదు. ఒక మనిషిని నమ్మడం నేర్చుకుంటున్న సమయంలో, అదే మనిషి ద్వారా తను ప్రమాదంలో పడకూడదు.

లైంగిక నేరాలు శరీరాలనే గాయపర్చవు!

ఎందుకంటే ఈ నేరాలు కేవలం శరీరాలను గాయప ర చవు. అవి నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న ఏ ఒక్క మనిషినీ ఆ చిన్నారి నమ్మలేని స్థితికి తీసుకు వస్తాయి.. ఇది ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజపు సామూహిక అంతరాత్మను కూడా దెబ్బతీస్తుంది. కనీసం కొన్ని రోజుల పాటు అయినా మనిషి మనిషిని నమ్మలేని, ప్రేమించలేని స్థితిలోనికి సమాజాన్ని నెట్టివేస్తుంది. మనిషి స్వభావం గురించి, అధికారం గురించి, క్రూరత్వం గురించి, నాగరికత గురించి ప్రశ్నలుగా మారు తుంది. రాక్షసులు నిజంగా ఎక్కడ ఉంటారని? వెతుక్కుని ఉలిక్కిపడేలా మనల్ని మారుస్తుంది.

- సుధా మురళి

83096 22246

Next Story