ఛత్రపతి.. స్వరాజ్య ప్రజాపతి!

by Ravi |   (  Updated:2026-02-19 00:45:43  IST  )

భారత చరిత్రలో జయంతులు కేవలం స్మరణార్థక తేదీలు కావు.. అవి ఒక యుగాన్ని, ఒక ఆలోచనను, ఒక ఆదర్శాన్ని నేటి తరాలకు చేరవేసే అవకాశాలు. అటువంటి జయంతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.

ఛత్రపతి.. స్వరాజ్య ప్రజాపతి!
X

భారత చరిత్రలో జయంతులు కేవలం స్మరణార్థక తేదీలు కావు.. అవి ఒక యుగాన్ని, ఒక ఆలోచనను, ఒక ఆదర్శాన్ని నేటి తరాలకు చేరవేసే అవకాశాలు. అటువంటి జయంతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. శివాజీ రాజప్రాసాదాల్లో పెరిగిన రాజకుమారుడు కాదు. అప్పటి రాజకీయ అరాచకత, పరాధీనత, అణచివేతల మధ్య ఆయన బాల్యం గడిచింది. కానీ తల్లి జిజాబాయి ఇచ్చిన ధర్మబోధన, దేశచరిత్రపై ఉన్న అవగాహన ఆయనలో చిన్ననాటినుంచే “స్వరాజ్యం” అనే మహాస్వప్నాన్ని నాటాయి.

వీరత్వం అంటే కేవలం యుద్ధం కాదు..!

శివాజీ మహారాజ్ వీరత్వాన్ని చాలామంది ఖడ్గం, కోటలు, యుద్ధాలకే పరిమితం చేస్తారు. కానీ ఆయన అసలైన వీరత్వం ఆలోచనలో ఉంది. అపారమైన మొఘల్ శక్తిని ఎదుర్కొంటూ కూడా ధైర్యాన్ని కోల్పోకపోవడం, ఓటమిని అంగీకరించకుండా వ్యూహాన్ని మార్చుకోవడం వంటివి ఆయన నిజమైన బలాలు. నేటి యువత ఎదుర్కొంటున్న పోటీ ప్రపంచంలో ఇది అత్యంత అవసరమైన గుణం. ఓటమి వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడం అంటే ఏమిటో ఛత్రపతి జీవిత చరిత్ర మనకు బోధిస్తుంది. వ్యక్తిగత ఆనందం కన్నా ప్రజల భద్రత, స్వరాజ్య పరిరక్షణ ఆయనకు ముఖ్యమైనవి. నిరంతర యుద్ధాలు, కుట్రలు, ప్రమాదాలు. వీటన్నింటి మధ్య ఆయన జీవితం సాగింది. అయినా లక్ష్యం నుంచి కదలలేదు. నేటి యువతకు ఇది స్పష్టమైన సందేశం.. గొప్ప లక్ష్యాలకు త్యాగం తప్పదు.

శివాజీ ప్రత్యేకత ధర్మ పాలన..!

శివాజీ స్థాపించిన స్వరాజ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాదు. అది నైతిక విలువల రాజ్యం. స్త్రీల పట్ల గౌరవం, రైతుల రక్షణ, అధికారులపై నియంత్రణ, న్యాయపాలన – ఇవన్నీ ఆయన పాలనకు ప్రత్యేక గుర్తింపు. నేటి యువత నాయకత్వ స్థానాల్లోకి వచ్చినప్పుడు అనుసరించాల్సిన ఆదర్శం ఇదే. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయనను కేవలం చరిత్ర పుటల్లోని వీరుడిగా కాకుండా, నేటి యువత హృదయాల్లో నిలిపే ఆదర్శంగా భావించాలి. స్వరాజ్యం అంటే భూభాగం కాదు.. స్వాభిమానం. వీరత్వం అంటే హింస కాదు -ధైర్యం.. నాయకత్వం అంటే అధికారం కాదు – త్యాగం. అదే శివాజీ మనకు ఇచ్చిన అమూల్యమైన జీవన సందేశం.

గెరిల్లా యుద్ధనీతికి జన్మనిచ్చిన వీరుడు..

మొఘల్ సామ్రాజ్యపు అపార సైన్యాన్ని ఎదుర్కొనడంలో శివాజీ మహారాజ్ వినూత్న యుద్ధనీతిని అవలంబించారు. కొండలు, అడవులు, కోటలను ఆధారంగా చేసుకున్న గెరిల్లా యుద్ధ పద్ధతి శత్రువుకు నిద్ర లేకుండా చేసింది. ఇది కేవలం సైనిక నైపుణ్యం మాత్రమే కాదు – భారతీయ భూభాగానికి తగిన వ్యూహాత్మక మేధస్సు. స్త్రీల పట్ల ఆయన చూపిన గౌరవం. యుద్ధాల్లో విజయం సాధించిన తర్వాత కూడా శత్రు మహిళలను అపహాస్యం చేయకుండా, మర్యాదతో వ్యవహరించడం ఆయనను సాధారణ రాజులకంటే ఉన్నత స్థాయిలో నిలబెట్టింది.

స్వరాజ్యం.. ప్రజల రాజ్యం!

శివాజీ స్థాపించిన స్వరాజ్యం ప్రజల కోసం ఉన్న రాజ్యం. పన్నుల విషయంలో న్యాయం, రైతులకు రక్షణ, అధికారులపై కఠిన నియంత్రణ, ఇవన్నీ ఆయన పాలనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ‘రాజ్యం ప్రజల కోసం, ప్రజలే రాజ్యానికి మూలం’ అన్న భావనను ఆయన కార్యరూపంలో చూపించారు. ఛత్రపతి శివాజీ వీరత్వం కేవలం యుద్ధ విజయంలోనే కాదు.. ఆయన ఆలోచనల్లో, పాలనలో, ధర్మనిష్ఠలో ప్రతిఫలించింది. అందుకే ఆయన భారత జాతి గర్వించదగిన మహావీరుడు, యుగయుగాలకు స్ఫూర్తిదాయకుడు..

( నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి )

- పగుడాకుల బాలస్వామి

ధర్మాచార్య సంపర్క ప్రముఖ్,

వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం

99129 75753

Next Story