ఏఐ దుష్ప్రయోగానికి కేంద్రం అడ్డుకట్ట!

by Ravi |   (  Updated:2026-02-13 01:00:32  IST  )

కృత్రిమ మేధని ఉపయోగించి తయారు చేసిన వీడియో, ఫోటో లేదా కంటెంట్‌పై స్పష్టంగా లేబిల్ ఉంచాలని సామాజిక మాధ్యమాలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఈనెల నుండి అమలు పరచబోతుంది. ఆ మేరకు ఐటీ చట్టాన్ని సవరిస్తోంది.

ఏఐ దుష్ప్రయోగానికి కేంద్రం అడ్డుకట్ట!
X

కృత్రిమ మేధని ఉపయోగించి తయారు చేసిన వీడియో, ఫోటో లేదా కంటెంట్‌పై స్పష్టంగా లేబిల్ ఉంచాలని సామాజిక మాధ్యమాలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఈనెల నుండి అమలు పరచబోతుంది. ఆ మేరకు ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. ఇది మంచి నిర్ణయం. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చింది మొదలు సామాజిక మాధ్యమాల నిండా ఏఐ జెనెరేటెడ్ కంటెంట్ వెల్లువెత్తుతుంది. ఏది వాస్తవమో, ఏది నకిలీదో తెలుసుకోవడం ఆలోచనా పరులకు కూడా కష్టమైపోతుంది. వివాదాస్పద, రాజకీయ పక్షపాత సందేశాలు ప్రముఖుల నోటి నుండి వచ్చినట్టు చూపించడం, అవి వైరల్ అవుతూ సామాజిక గందరగోళానికి దారితీయడం రొటీన్ వ్యవహారమై పోయింది. ఇక ఆర్ధిక మోసాలకు, అమాయకుల్ని వంచించడానికి కూడా పెద్ద ఎత్తున ఈ కృత్రిమ మేధ ఉపయోగపడడం, అందుకు సామాజిక మాధ్యమాలు వేదికలుగా అందిరావడం మామూలైంది. ఈ నేరాలకు అడ్డుకట్ట వెయ్యడంలో సమాజం వెనకబడే ఉంది. కనీసం ఏఐ ఆధారిత దృశ్య సందేశాలపై లేబుల్ బాగా కనబడినట్టు తగిలిస్తే కనీసం 'ఇది నిజం కాదు' అన్న స్పృహ వీక్షకులకు తడుతుంది. అలాగే చట్ట వ్యతిరేక, హానికర సందేశాల అంశంలోనూ నిబంధనలు కఠినతరం చేసింది. ఏదైనా కోర్టుగానీ, అధికారిక సంస్థ గానీ ఫలానా సందేశం హానికరం కావున తొలగించాలని ఆయా సామాజిక మాధ్యమం దృష్టికి తెస్తే మూడు గంటల్లో ఆ ఆదేశాన్ని అమలు చెయ్యాలి.. ఇంతవరకూ ఆ గడువు రెండు రోజులు ఉండేది. అంతర్జాల యుగంలో ఒక వార్త ప్రయాణించే స్పీడ్, పరిధి చాలా ఎక్కువ.. క్షణాల్లో ఖండాంతరాలు దాటి పోతుంది. అలా చూసినప్పుడు ఈ నిబంధన సమంజసం. అయితే హానికరం, చట్ట వ్యతిరేకం అన్నవాటిని స్పష్టంగా నిర్వచించాలి. పారదర్శకంగా వ్యవహరించాలి. లేదంటే ప్రభుత్వానికి నచ్చనివి, అసౌకర్యం కలిగించేవి అన్నీ ఈ లిస్టులో చేరే ప్రమాదం ఉంటుంది. రాజకీయ వ్యతిరేకుల అభిప్రాయాలు సెన్సార్‌కి గురవుతాయి.. అలా అధికార దుర్విని‌యోగం కాకుండా ఒక స్వతంత్ర పర్యవేక్షక సంస్థ ఉంటే మంచిది. కృత్రిమ మేధ సాయంతో వెల్లువెత్తుతున్న కృత్రిమ బురదని కడిగి పారేసే లేదా నియంత్రించే వ్యవస్థ సామాజిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.

- డా. డి.వి.జి.శంకరరావు,

94408 36931

Next Story