పెట్టుబడిదారీ విధానమే.. యుద్ధాల మూలం!

by Ravi |   (  Updated:2026-04-08 01:00:19  IST  )

కార్పొరేట్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సంపద అసమానతలు, సహజ వనరులపై ఆధిపత్య పోరు, యుద్ధ రాజకీయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యామ్నాయ మార్గాల అవసరం పెరుగుతోంది.

పెట్టుబడిదారీ విధానమే.. యుద్ధాల మూలం!
X

పాలకులు చాలా సందర్భాల్లో ప్రజలకన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన ఉంది. దీనివల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. సహజ వనరులు, ఉత్పత్తి వ్యవస్థలు పెద్ద కార్పొరేట్ల నియంత్రణలోకి వెళ్తున్నాయి. వివిధ దేశాల మధ్య యుద్ధాలు కూడా వనరులు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరుగుతున్నాయని విమర్శ ఉంది. ప్రభుత్వాలు పన్ను రాయితీలు, విధానాల ద్వారా కార్పొరేట్లకు మద్దతు ఇస్తున్నాయని అంటారు. ఫలితంగా ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలు తగ్గుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పెట్టుబడిదారుల ద్వారా దేశాలు అభివృద్ధి చెందిపోతాయనే మాట అటు ఉంచితే వారు పెట్టే పెట్టుబడితో సంపద పెరిగి మానవ శ్రేయస్సు పెరిగిపోతుందని నేటి పాలకుల మాట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పెట్టు బడిదారులు లాభార్జన కోసం పోటీ పడుతుంటారు.. దీనికొసం అన్ని ఉత్పత్తులతో పాటు ఆయుధాల ఉత్పత్తి చేస్తుంటారు. అయితే ఈ ఉత్పత్తి ద్వారా ఒక దేశం మరొక దేశాన్ని అదుపు ఆజ్ఞలలో పెట్టుకుని అక్కడి వనరులను దోపిడీ చేసేందుకు చేస్తుంటాయి. ఈ విధానాలను ప్రభుత్వాలు కూడా అమలు చేయడం విచారకరం.

యుద్ధాలను వారిస్తాను అంటూనే..

యుద్ధం పెట్టుబడిదారీ విధానం విభజించలేని కవల పిల్లలని మొదటి ప్రపంచ యుద్ధం నాడే లెనిన్ తెలియ జేశారు. పెట్టుబడిదారీ విధానం గుత్త పెట్టుబడిదారీ విధానం వైపు మళ్లేటప్పుడు సంపద కేంద్రీకరణ ఆదాయ అసమానతలు పెరిగి సామ్రాజ్యవాదంతో యుద్ధాలు తప్పని సరి. ప్రస్తుతం వివిధ దేశాలలో ఉన్న సహజ వనరులైన ఖనిజ సంపద, చమురు నిల్వలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఆయుధాలను మార్కెట్ చేసుకోవడం కోసం ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ మానవ శ్రేయస్సుకు ఏ మాత్రం కాదు. పెట్టుబడిదారుల పెద్దన్న అమెరికా అధ్యక్షులు యుద్ధాలు చేయబోను, యుద్ధాలను వారిస్తాను అంటూ మాదక ద్రవ్యాల సాకుతో అబద్ధపు ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిని అపహరించారు. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని సాకు చూపుతూ ఆ దేశ అధినేతను కుటుంబ సభ్యులతో సహా హత్య చేశారు.. నిజానికి ఇరాన్‌ను సామంత రాజ్యంగా మార్చి చమురు నిల్వలు కాజేయడం ట్రంప్ లక్ష్యం.

నాయకత్వం వహించేవారు ఇలా ఉంటారా?

రెండో ప్రపంచ యుద్ధం ద్వారా అనేక దేశాలను నియంత్రించగలిగే శక్తి అమెరికాకు యూరోప్ దేశాలకు లభించడం వలన తద్వారా దేశాల అభివృద్ధి పథంలో ఉన్నాయి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత 80 సంవత్సరాల్లో, అనేక దేశాలలో ప్రభుత్వాల మార్పునకు అమెరికా ప్రయత్నించింది. ఈ క్రమంలో సంభవించిన ఏ ఒక్క యుద్ధంలో కూడా అమెరికా గెలవలేదు.. ఊహకందనంత మారణహోమం తర్వాత కూడా అమెరికా తోక ముడుచుకుని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వియత్నాం, అఫ్ఘానిస్తా‌న్‌లో అమెరికాకు ఎదురైన పరాజయాలే అందుకు ఉదాహరణలు.. తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షిణ్యంగా అంతమొందిస్తామని అనేక చర్యల ద్వారా ప్రపంచ దేశాలను అమెరికా హెచ్చరించింది. విచిత్రంగా స్వేచ్ఛా ప్రపంచంగా భావించే మిగతా దేశాలు ఈ అంశంలో మౌనంగా ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికాది 25 శాతం. చైనా, ఇండియాది కలిపి ప్రపంచ జీడీపీలో 25 శాతం. అందుకే గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించాలని మన ప్రధాని కోరుకుంటున్నారు. అయితే ముధురో దంపతుల అపహరణం గాని, వెనిజులాపై దాడిని కానీ, ఇరాన్‌పై దాడిని కానీ, కమీనే హత్యను గాని కనీసం పరోక్షంగా నైనా ఖండించే సాహసం చేయలేదు. చైనా మాత్రం ఇరాన్ అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నావని చెబుతున్నది కానీ యుద్ధం ఆపే ప్రయత్నాలు చేయడం లేదు.

ప్రత్యామ్నాయ మార్గాలు రూపొందించుకోవాలి!

పాలకులు పెట్టుబడిదారుల కనుసన్నల్లో ఉన్నప్పుడు, లేదా ట్రంప్ లాగా పాలకులే పెట్టుబడిదారులైనప్పుడు ప్రపంచ ప్రజలకు యుద్దాల బెడద తప్పదు.. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడు లాభాల కోసం దోపిడీతో వివిధ కాలాలలో వివిధ దేశాలపై యుద్ధాలు చేస్తూనే ఉన్నది. ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు పెద్దన్న అమెరికా పరిస్థితి అదే. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి వ్యవస్థ పతాక స్థాయి అని అందుకే లెనిన్ అన్నారు. ఇది పడిపోయే పతాకస్థాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతకొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని కుదిపేస్తున్నాయి.. ఈ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ పరిస్థితుల ప్రభావం మరింత తీవ్రంగా పడే అవకాశముంది. క్యాపి టలిజం ప్రజా శ్రేయస్సును పెంపొందించలేదు. అందుకే పాలకులు ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించుకోవాలి. లేకపోతే మానవ మనుగడకే ముప్పు.

-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు

డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్(రిటైర్డ్)

98663 22172

Next Story