- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పామ్ కాల్స్‌ను ఆపలేమా?
ట్రింగ్ ట్రింగ్.. అరె సీరియస్‌గా మీటింగ్‌లో ఉంటే ఇదేందిరా గోల.. హలో ఎవరూ? హలో.. సార్ మీరు సారంగపాణి కదా..

ట్రింగ్ ట్రింగ్.. అరె సీరియస్‌గా మీటింగ్‌లో ఉంటే ఇదేందిరా గోల.. హలో ఎవరూ? హలో.. సార్ మీరు సారంగపాణి కదా... ఆ అవును చెప్పండి ఎవరు? సార్, డాష్ డాష్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ నుండి నేను హరితను కాల్ చేస్తున్నానండి... ఓపెన్ ప్లాట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి..
ఏమ్మా.. మీకేమి పని పాట లేదమ్మా.. ఊరికే డిస్టర్బ్ చేస్తారు.. ఫోన్ పెట్టేయి...
ట్రింగ్ ట్రింగ్.. హలో సార్ ఫలానా ఫైనాన్స్ కంపెనీ నుండి గీతను మాట్లాడుతున్నా సార్.. మీకు ఏమైనా లోన్ కావాలా?
ట్రింగ్ ట్రింగ్.. సార్ ఇస్ ఇట్ పద్మనాభం.. ఐయాం ఫ్రం సో ఆండ్ సో బ్యాంక్ నుండి సార్...
నరకం చూపిస్తున్న వేస్ట్ కాల్స్
ఇలా రోజుకు పది ఫోన్లు మనం బిజీగా ఉన్నప్పుడో లేదా సీరియస్‌గా డిస్కషన్‌లో ఉన్నప్పుడో, లేదా క్లాస్ తీసుకుంటున్నప్పుడో... బైక్ మీద పోతున్నప్పుడో, ఇలా ఏదో ఒక సందర్భంలో ప్రతి రోజు ఈ అన్‌వాంటెడ్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న సందర్భాలు అందరికీ అను భవమే.. ఈ కాల్స్ జనానికి నరకం చూపిస్తున్నాయి.. కొన్నిసార్లు ఈ అనవసర కాల్స్ విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయి..
కాల్ చేసి విసిగిస్తే.. చర్యలు లేవా?
అనవసరమైన కాల్స్ జనాన్ని ప్రతి రోజూ ఇలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కాల్స్ DO NOT DISTURB యాక్టివేట్ చేసుకున్నా, ట్రూ కాలర్ కూడా లేట్‌గా రెస్పాండ్ కావడం వల్ల ప్రతిరోజూ ప్రతి ఒక్కరు విసుక్కుంటున్న సందర్భాలు కోకొల్లలు.. వీటికి ముగింపు లేదా? అనవ సరంగా కాల్ చేసి విసిగిస్తే ఎలాంటి చర్యలు లేవా? ఇలాంటి కాల్స్ వల్ల కొన్నిసార్లు ఆపత్కాలంలో ఫోన్ చేస్తే తెలియని నంబర్ అని ఫోన్ కట్ చేస్తే.. ఎంత నష్టం? ఇలా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే కాల్స్‌కి చెక్ పెట్టలేమా? బిజినెస్ పెంపు కోసం కాల్ సెంటర్‌ల ద్వారా అమ్మాయిలతో ఫోన్ చేయిస్తూ ఎందరినో మోసం చేస్తూ.. బోల్తా గొట్టిస్తూ సొమ్ము చేసుకునే వ్యవస్థను నిర్మూలించలేమా..?
ముఖ్యమైన కాల్ మిస్ అయ్యే ప్రమాదం
ఈ ఫోన్ కాల్స్ ఎత్తిన వారు చేసిన వారిని తిట్టే సందర్భాలు, అసహ్యంగా తిట్టే సందర్భాలూ లేకపోలేదు. ఎన్ని నంబర్లను బ్లాక్ చేస్తున్నా.. కొత్త కొత్త నెంబర్లతో ఫోన్లు వస్తూనే ఉన్నాయి.. వీటికి తోడు సైబర్ క్రైమ్ చేసే దొంగలతో మరో రకమైన మోసం. ఇలాంటి ఫేక్ కాల్స్, అనవసర కాల్స్ నుండి తప్పించుకోవడానికి జనం కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను ఎత్తడమే మానేశారు.. దీనివల్ల కొన్ని అనర్థాలు జరిగే ప్రమాదాలు లేకపోలేదు.. కొన్ని సార్లు రోగి చికిత్సకు దూరం కావచ్చు. కొన్నిసార్లు ఒక మంచి అవకాశాన్ని కోల్పోవచ్చు.. కొత్త నంబర్ నుండి ఫోన్ చేసిన మిత్రులు దూరం కావచ్చు. కొన్నిసార్లు ఆప్తులు ఆపదలో ఉన్నప్పుడు కొత్త నెంబర్ నుంచి వచ్చిన కాల్ మిస్ చేయవచ్చు.
ట్రాయ్ పట్టించుకోవాలి
ట్రాయ్ వీళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టదా..? టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఏమి చెయ్యలేదా? ఇలా ఫోన్ చేసి విసిగించే వారిపై చట్టరీత్యా ఏమి చర్యలు తీసుకోలేమా..? ఇలా అనవసరంగా కాల్ చేసి జనాన్ని విసిగించే వారిని నివారించడానికి, మోసం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక నెంబర్ ట్రాయ్ కేటాయించి ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
-శిరందాస్ శ్రీనివాస్
94416 73339






