వరంగల్ కోటను కాపాడుకోలేమా!?

by Disha edit |
వరంగల్ కోటను కాపాడుకోలేమా!?
X

150 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో ఉండే మట్టికోట క్రమంగా కనిపించకుండా పోతోంది. వరంగల్ మహానగరంగా విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కోటను ప్లాట్లుగా చేస్తున్నారు. కళాతోరణాలకు సమీపంలో విక్రయశాలలు,ప్రైవేటు భవనాలు వెలిశాయి. కోట యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలను కలిగి ఉంది. అక్రమ నిర్మాణాలతో వారసత్వ హోదాకు దూరమవుతుంది. ఆక్రమణల మీద పురావస్తు శాఖ అధికారులు నోటీసులిచ్చి వదిలేయడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వారు నిర్మించిన కోటలు, రాజ ప్రసాదాలు, ప్రజా వినియోగ భవనాలు, దేవాలయాలు, బావులు, చెరువుల వంటి సాంస్కృతిక చిహ్నాలు గతకాలపు వైభవాలకు, వాస్తుకళ నైపుణ్యాలకు, రాచఠీవికి నిదర్శనాలుగా మన కండ్ల ముందు నిలిచే ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్ని రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ఉండి, ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఇందుకు ఉదాహరణ. ఈ ఆలయమే కాకతీయుల కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసింది. వారి హయంలో మరో అద్భుత నిర్మాణం వరంగల్ కోట. దీనినే ఖిలా వరంగల్ అని కూడా అంటారు. కోటకు దుర్గము, ఖిల్లా పర్యాయపదాలు. రాజులు స్వరక్షణ, రాజ్య రక్షణ కొరకు నిర్మించుకునే దానిని కోట అంటారు. ఎగుమతులు, దిగుమతులు, ఖజానాతో, అక్కడ నుంచే పాలనా వ్యవహారాలు చూసుకునేలా తమ నివాసాల చుట్టూ నిర్మించుకునే పటిష్ట కట్టడం కోట. రాజు తన పరివార జనంతో దుర్గములలో నివసిస్తూ ఉండేది. ప్రాచీన, మధ్య యుగాలలోనే కాదు, ఆధునిక కాలంలోను కోటలు కీలకంగా ఉండేవి.

ఏడు ప్రాకారాలుగా

కోటలను చేజిక్కించుకుంటేనే ఒక రాజ్యం ఆక్రమణ సంపూర్ణం అవుతుందనే భావన రాజులలో ఉండేది. అందుకే కోటల నిర్మాణంలోనే కాదు, రక్షణ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. రాతి గోడలతో నిర్మించేవారు. అనేక రహస్యాలు, యుద్ధ వ్యూహాల గుర్తులు. శాసనాలు, నాణాలతో పాటు వారి రాజ్యపాలన తీరుతెన్నులు తదితర విషయాలు ఈ కోటలలో కనబడతాయి. కోటలు నాలుగు రకాలు. అవి స్థల, జల, గిరి, వన దుర్గములు. వరంగల్ కోట స్థల దుర్గము. దక్షిణ భారత వాస్తు శిల్పకళకు గొప్ప తార్కాణం. దేశవ్యాప్తంగా సజీవంగా ఉన్నవాటిలో ఇది ఒకటి. సజీవం అంటే మానవ జీవనం నేటికీ కోట లోపల కొనసాగడమే.

ఇది తెలంగాణలో గోలకొండ తర్వాత అతి పెద్దది. ప్రసిద్ధమైనది. ముందు దీనిని ఓరుగల్లు కోటగా పిలిచేవారు. దీనికి ఏడు ప్రాకారాలు ఉన్నాయని చెబుతారు. అవే కోటలుగా పిలువబడుతున్నాయి. ఇప్పుడు మూడు ప్రాకారాలు మాత్రమే కనబడుతున్నాయి. మొదటి ప్రాకారం మట్టితో నిర్మించారు. దీనిని ధరణి కోట అంటారు. ఇది 20 అడుగుల ఎత్తుతో, దాదాపు ఎనిమిది కి.మీ. దూరం విస్తరించి ఉంది. రెండవ ప్రాకారములో ఉన్న రాతి కోట గ్రానైట్ రాళ్లతో నిర్మితమైనది. దీని విస్తీర్ణం నాలుగు కి.మీ. రాతి కోట లోపల రాజుల నివాస భవనాలు ఉండేవి. ఇవి పూర్తిగా ఇటుకల నిర్మాణం. రాతి కోటకు నాలుగు వైపులా పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు లేక కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు. ఇవి పూర్ణ కుంభ రూపంలో ఉన్నాయి. ఈ కళా తోరణాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారిక చిహ్నంగా ప్రకటించారు.

కొత్త బృందంతో వెలుగులోకి

మట్టి కోటకు నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను కలుపుతూ గణపతి దేవుడు చుట్టూ 15 మీటర్ల ఎత్తుతో రాతి గోడ నిర్మించారు. ఈ గోడ మీద ఉన్న బురుజులు సాయుధ దళాలు నిరంతరం పహారా కాయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఫిరంగులు అమర్చేంత విశాలంగా కూడా ఉన్నాయి. కోట చుట్టూ 18 అడుగుల లోతు గల కందకం తవ్వారు. దీనిలో ఎప్పుడు పది అడుగుల మేర నీటిని నింపి ఉంచేవారు. ఇందులో మొసళ్లను, విషసర్పాలను వదిలేవారు. వృత్తాకారంలో ఉన్న కోట 19 చ.కి.మీ. విస్తరించి ఉంది. లోపల అనేక రాజ వీధులు, సందులు ఉన్నాయి. లోపల మడి సంత, బయట మైలసంత నిర్వహించేవారు. రథ, అశ్వక దళాలతోపాటు ఏనుగుల మీద భటులు నిరంతరం గస్తీ తిరిగేవారు. కోటలో మామిడి, అరటి, పనస వంటి పండ్ల తోటలు. సంపెంగ, మొగలి, మల్లె వంటి పూల తోటలు ఉండేవని ముస్లిం రచనల ద్వారా తెలుస్తోంది. ఈ కోట నిర్మాణాన్ని గణపతిదేవుడు సా.శ. 1,199 లో ప్రారంభిస్తే, రాణి రుద్రమదేవి పూర్తి చేసిందని అంటారు. రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) కాలంలో కోట నిర్మాణం మొదలైనట్లు బెక్కల్లు శాసనం ద్వారా తెలిసిందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వివరించారు.

నోటీసులిచ్చి వదిలేసి

150 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో ఉండే మట్టికోట క్రమంగా కనిపించకుండా పోతోంది. వరంగల్ మహానగరంగా విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కోటను ప్లాట్లుగా చేస్తున్నారు. కళాతోరణాలకు సమీపంలో విక్రయశాలలు,ప్రైవేటు భవనాలు వెలిశాయి. కోట యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలను కలిగి ఉంది. అక్రమ నిర్మాణాలతో వారసత్వ హోదాకు దూరమవుతుంది. ఆక్రమణల మీద పురావస్తు శాఖ అధికారులు నోటీసులిచ్చి వదిలేయడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరంగల్ కోట లాంటి అపురూప, అద్భుత వాస్తు శిల్ప సంపదను, కనువిందు చేసే కళాకృతులను అలనాటి పాలకులు లక్షలు వెచ్చించి, సంవత్సరాల తరబడి తపించి, శ్రమించి నిర్మించారు. అలాంటి కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.

డా. సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

9849 618116


Next Story