ఈ చట్టం మన గోప్యతకు రక్షణ ఇవ్వగలదా?

by Ravi |   (  Updated:2025-07-18 01:00:28  IST  )

డిజిటల్ యుగంలో, వ్యక్తిగత డేటా ఒక విలువైన సంపదగా మారింది. సోషల్ మీడియా, ఇ-కామర్స్, ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు

ఈ చట్టం మన గోప్యతకు రక్షణ ఇవ్వగలదా?
X

డిజిటల్ యుగంలో, వ్యక్తిగత డేటా ఒక విలువైన సంపదగా మారింది. సోషల్ మీడియా, ఇ-కామర్స్, ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు మన జీవితంలో అంతర్భాగమైన నేపథ్యంలో, వ్యక్తిగత డేటా రక్షణ అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉద్భవించింది.

ఈ సందర్భంగా, భారత పార్లమెంటు 2023 ఆగస్టు 11న ఆమోదించిన డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం భారతదేశంలో గోప్యతా చట్టం రూపంలో ఒక మైలు రాయి. డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారం మన ప్రాణానికి సమానమైంది. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. డేటా మనదైతే హక్కు కూడా మనదే!

డీఆర్‌డీపీ చట్టం బలాలు

ఈ చట్టం భారతదేశ మొట్టమొదటి సమగ్ర డేటా రక్షణ చట్టం. ఇది గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, దాని సెన్సిటివ్ పర్సనల్ డేటా రూల్స్, 2011లను భర్తీ చేస్తుంది. ఈ చట్టం డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌కు స్పష్టమైన నియమాలను నిర్దేశిస్తుంది. ఇది డేటా కంట్రోలర్లు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలను నిర్వ చిస్తుంది. డేటా ప్రిన్సిపల్‌లకు (వ్యక్తులు) వారి డేటాను రక్షించే హక్కులను కల్పిస్తుంది. డేటా ప్రాసెసింగ్‌కు సమ్మతి అవసరమని నొక్కి చెబుతుంది. డేటా ఉల్లంఘన జరిగినప్పుడు, డేటా ఫిడ్యూషియరీలు 72 గంటల్లో డేటా ప్రొటెక్షన్ బోర్డ్‌కు, బాధిత డేటా ప్రిన్సిపల్‌లకు తెలియ జేయాల్సి ఉంటుంది. ఇది గతంలో లేని ఒక ముఖ్యమైన రక్షణ. ఇక 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారి డేటాను ప్రాసెస్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేసింది. ఇది పిల్లల గోప్యతను రక్షిస్తుంది.

ఈ చట్టంలోని లోపాలు..

అయితే ఈ చట్టం అనేక లోపాలను కలిగి ఉంది. ఇవి వ్యక్తిగత గోప్యతను రక్షించడంలో దాని సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. సెన్సిటివ్ డేటా (ఆరోగ్యం, జాతి, మతం, రాజకీయ అభిప్రాయాలు వంటివి) కోసం ప్రత్యేక రక్షణలను నిర్దేశించదు. ఇది సెన్సిటివ్ డేటా దుర్విని యోగానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి విస్తృతమైన మినహాయింపులను అనుమ తిస్తుంది, ఇవి జాతీయ భద్రత లేదా పబ్లిక్ ఆర్డర్ పేరుతో దుర్వినియోగం కావచ్చు. జనరల్ డేటా రక్షణ నియంత్రణలో ఇటువంటి మినహాయింపులు కఠినమైన నియమాలకు లోబడి ఉంటాయి, కానీ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అయితే చట్టం ఆమోదించబడినప్పటికీ, దాని అమలు తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. వ్యక్తులపై కూడా కొన్ని బాధ్యతలు విధించడం ఈ చట్టంలోని విచిత్రమైన అంశం. ఉదాహరణకు, డేటా ప్రిన్సిపల్‌లు తప్పుడు సమాచారం ఇవ్వకూడదని లేదా తప్పుడు ఫిర్యాదులు చేయకూడదని చట్టం చెబుతుంది, ఇది వ్యక్తుల హక్కులను సంక్లిష్టం చేస్తుంది.

డేటా రక్షణ కోసం సూచనలు..

డిజిటల్ యుగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలు డేటా ప్రాసెసింగ్‌ను మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఈ సందర్భంలో, DPDP చట్టం ఒక పునాదిగా ఉపయోగపడుతుంది, కానీ ఇది భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలి. రెగ్యులర్ అప్‌డేట్‌లు, స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్‌లు, టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌కు అనుగుణంగా సవరణలు చేయాలి. ఈ చట్టం ఒక ముందడుగు అయినప్పటికీ, దాని లోపాలను పరిష్కరించడం ద్వారా దీనిని మరింత బలోపేతం చేయవచ్చు.

చట్టంతో పాటు చైతన్యం కూడా ముఖ్యం

దేశంలో డిజిటల్ గోప్యతా రక్షణకు చట్టం ముఖ్యమైన ముందడుగు. ఇది వ్యక్తుల హక్కులను గుర్తిస్తూ, డేటా ఫిడ్యూషియరీలపై బాధ్యతలను విధిస్తుంది. అయితే, సెన్సిటివ్ డేటా రక్షణ, ప్రభుత్వ మినహాయింపులు, అమలు ఆలస్యం వంటి లోపాలు దాని సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. ఈ చట్టం వినియోగదారుల హక్కులు అమలు యంత్రాంగంలో వెనుకబడి ఉంది. భవిష్యత్తులో, ఈ లోపాలను పరిష్కరించడం ద్వారా టెక్నాలజీ అభివృద్ధికి అనుగుణంగా చట్టాన్ని అప్‌డేట్ చేయడం ద్వారా, భారతదేశం గోప్యతా రక్షణలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించవచ్చు.

డా. గుర్రం అశోక్,

96768 96300

Next Story