- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమగ్ర కుటుంబ సర్వే తరహాలో.. ఒకే రోజు ఎస్‌ఐఆర్ సాధ్యం కాదా?
ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే తరహాలో ప్రత్యేక ‘ఎస్‌ఐఆర్ డే’ నిర్వహణపై చర్చ.

ప్రజాస్వామ్యానికి ఓటరు జాబితా ప్రాణాధారం. ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరిగినా, ఓటర్ల జాబితాలో లోపాలుంటే వాటి విశ్వసనీయత దెబ్బతింటుంది. ఈ జాబితా సవరణ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అయితే ఆ ప్రక్రియ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పూర్తి పారదర్శకంగా సాగాలి. మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం అమలు లోపాల వల్ల వివాదాస్పదం కాకూడదు. కాబట్టి తెలంగాణలో ఒక ప్రత్యేక ఎస్‌ఐఆర్ డే ఎందుకు నిర్వహించకూడదు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయన్న ఆరోపణలు, ఇంటింటి తనిఖీల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన పత్రాలపై ఉన్న సందిగ్ధత, రాజకీయ ఆరో పణలు.. ఈ మొత్తం ప్రక్రియను అనవసర వివాదాల కేంద్రంగా మార్చాయి. ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, ప్రజానుకూలంగా నిర్వహించే ప్రత్యామ్నాయం లేదా? అన్న ప్రశ్నకు ఇదే సమాధానం.
సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒకే రోజు..
ఇందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఓ వినూత్న కార్యక్రమం మనకు ఆదర్శంగా కనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలల్లోనే గత ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ దేశవ్యాప్తంగా ఓ చర్చనీయాంశమైంది. రాష్ట్రం మొత్తం ఒకే రోజును ఎంపిక చేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రంగంలోకి దించి, ప్రతి కుటుంబాన్ని చేరుకునేలా ఆ సర్వే నిర్వహించారు. లక్షలాది మంది ఉద్యోగులను సర్వేకు వినియోగించారు. ప్రజలు కూడా ముందుగానే సమాచారం అందుకుని ఇంటి వద్దే ఉండి వివరాలు నమోదు చేయించారు. ఆ సర్వేపై విమర్శలు లేకపోలేదు.. కానీ ఆ సర్వే ద్వారా ఒక విషయం మాత్రం నిరూపితమైంది. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని సంకల్పిస్తే, ఒకే రోజులో అసాధ్యమనుకున్న పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయవచ్చని నిరూపించింది. అదే నమూనాను ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కోసం ఎందుకు అనుసరించకూడదు?
ప్రస్తుతం తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం..
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నెలల తరబడి సాగిస్తూ బూత్ లెవల్ అధికారులను పలుమార్లు ఇంటికి పంపడం, ఇంట్లో ఎవరూ లేకపోవడం, మళ్లీ వెళ్లడం, పత్రాలు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లే కుటుంబాలు, వలస కార్మికులు, విద్యార్థులు ఇంట్లో దొరకడం కష్టమవుతోంది. ఫలితంగా నిజమైన ఓటర్ల పేర్లు కూడా సందేహాస్పదంగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కష్టాలను గట్టెక్కించడానికి ఇక్కడి ప్రభుత్వం ఒక రోజును “ఎస్‌ఐఆర్ డే” ప్రకటించి ఆ రోజును ప్రభుత్వ సెలవుగా ప్రకటించి, ప్రతి కుటుంబం అవసరమైన పత్రాలతో ఇంటి వద్ద ఉండేలా ముందుగానే ప్రచారం చేయిస్తే, బీఎల్‌ఓలు ఒకే రోజు ధృవీకరణ పూర్తి చేయగలరు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత పారదర్శకంగా సాగుతుం ది. ఇలాంటి విధానం వల్ల మొదటగా ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. ప్రజలు ఇంట్లో అందుబాటులో లేకపోవడమనే సమస్య తీరిపోతుంది. ఒకే రోజు కాబట్టి పేర్లు తొలగించారనే ఆరోపణలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.
రాజకీయ ఆరోపణలు తగ్గుతాయి!
దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే విధానంలో ఈ సర్వే నిర్వహిస్తే రాజకీయ పక్షపాతం ఆరోపణలకు అవకాశం తగ్గుతుంది. అన్ని రాజకీయ పార్టీలకూ ఒకే విధమైన పర్యవేక్షణ అవకాశం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగంపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం నెలల తరబడి సిబ్బందిని వినియోగించడం కంటే ఒకే రోజు సమన్వయంతో నిర్వహించడం ఖర్చు, సమయం ఆదా చేస్తుంది. దీనికి తోడు ఈసీ సిబ్బంది వద్ద ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం తోడవడంతో జీపీఎస్ ఆధారిత ధృవీకరణ, తక్షణ డిజిటల్ అప్‌లోడ్, డూప్లికేట్ నమోదులను గుర్తించే సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉండటంతో పది సంవత్సరాల క్రితం సాధ్యం కాని అనేక పనులు నేడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి. భారతదేశం వంటి విస్తారమైన దేశంలో ఓ రాష్ట్రంలో ఒకే రోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం కష్టమని కొందరు వాదించవచ్చు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను విజయ వంతంగా నిర్వహించే దేశానికి ఇది అసాధ్యమని చెప్పడం సమంజసం కాదు. సరైన ప్రణాళిక, విస్తృత ప్రచారం, అధికార యంత్రాంగం సమన్వయం ఉంటే ఈ కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది.
ప్రతి ఐదేళ్లకోసారి జరిగితే..
అయితే దీనర్థం ఏడాది పొడవునా జరిగే సాధారణ ఓటరు నమోదు ప్రక్రియను నిలిపివేయాలన్నది కాదు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు యథావిధిగా కొనసాగాలి. అయితే ఐదేళ్లకోసారి లేదా సాధారణ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఒక ఎస్‌ఐఆర్ డే నిర్వహిస్తే ఓటర్ల జాబితాల విశ్వసనీయత మరింత బలోపేతం అవుతుంది. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు. ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉందనే నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించాలి. భయాలు, వివాదాల మధ్య జరిగే ధృవీకరణ కంటే, ప్రజల భాగస్వామ్యంతో జరిగే ఒకే రోజు ఎస్‌ఐఆర్ డే ప్రజాస్వామ్యానికి మరింత బలమైన పునాది వేస్తుంది. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే తరహాలో ఈ విధానాన్ని అమలు చేస్తే, అది ఓటర్ల జాబితాల శుద్ధితో పాటు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కూడా మరింత పటిష్టం చేస్తుంది. ప్రతి ఓటు విలువైనదే అయితే, ప్రతి ఓటరిని ఒకే రోజు గౌరవంగా గుర్తించే వ్యవస్థను ఎందుకు ఆలోచించ కూడదు? ఇదే నేడు దేశం ముందున్న కీలక ప్రశ్న.
- పెండ్యాల కొండల్
75694 95833






