హస్తినలో కమలం పాగా వేస్తుందా?

by Ravi |   (  Updated:2025-01-23 01:00:46  IST  )

ఫిబ్రవరి 5న జరగనున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి దేశ ప్రజలలో చర్చ ఇప్పటికే మొదలైంది.

హస్తినలో కమలం పాగా వేస్తుందా?
X

ఫిబ్రవరి 5న జరగనున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి దేశ ప్రజలలో చర్చ ఇప్పటికే మొదలైంది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నా, పోటీ మాత్రం ఆప్ , బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను శాసిస్తాయని, దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కొన్ని చానల్స్ ఊదరగొట్టడం బట్టి చూస్తే-ఈ చానల్స్‌లో మాట్లాడే వాళ్లకు కామన్ సెన్స్ లేదని తెలుస్తుంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. ఇది దేశ రాజధాని నగరం అయినందున పరిపాలన విషయంలో పూర్తి అధికారాలు కేంద్రం చేతిలో ఉంటాయి.

ఉచిత పథకాలే అధికార సోపానాలు..

2013 నుండి అధికారంలో ఉన్న ఆప్ మరోసారి అధికారంలోకి రావడానికి ఉవ్విళ్ళూరుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీలు ఓటర్ల మానసిక స్థితిపై బాగా పనిచేశాయని ప్రస్తుతం వాటిని కొనసాగిస్తూనే ఈ సారి అద్దె ఇంట్లో ఉన్న వారికి సైతం ఉచిత విద్యుత్, మంచి నీటి సరఫరా తమ ప్రభుత్వం అందిస్తుందని ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ఇక ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయ ఢంకా మోగించాలని ఎన్నికల సంకల్ప పత్రం విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ ప్రజలకు ఎన్నో ఉచిత హామీలను ఓటర్ల ముందు ఉంచడం దేశ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఉచిత పథకాలకు అలవాటు పడిన ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేయడానికి బీజేపీకి మరొక మార్గం లేదనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు గట్టిగా కృషి చేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లు సాధిం చడం, పది సంవత్సరాలు ప్రతిపక్ష హోదా లేకుండా ఉండి, మూడవసారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లభించడం, భారత్ జోడో యాత్రకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభించిండం వంటివి కారణాలని చెప్పవచ్చు.

స్వింగ్ ఓటర్లే కీలకం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంలో 30% స్వింగ్ ఓటర్లు ప్రధాన పాత్రను పోషిస్తారని గత ఎన్నికల సరళిని చూస్తే అర్థమవుతుంది. 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 53% ఓటర్లు మొగ్గు చూపారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు పార్లమెంట్ స్థానాల్లో 33% ఓటర్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేశారు. దీంతో వరుసగా మూడోసారి కూడా ఈ ఏడు పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీని, పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలను ఓటర్లు ఎన్నుకుంటారనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాలతో తప్పని తేలిపోయాయి. ఇక చివరగా దళిత, ముస్లిం ఓట్లను కాంగ్రెస్ పార్టీ తన వైపుకు తిప్పుకుంటే -ఆమ్ ఆద్మీ పార్టీ అంచనాలు తలకిందులు అవుతాయి. ఇక ఇదే జరిగితే, కమలం హస్తినలో పాగా వేయడం ఖాయం. ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మినట్లు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదనే వాదన కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఫిబ్రవరి 8వ తేదీన అందరి అంచనాలకు తెరపడనుంది.

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు,

94417 37877

Next Story