రాజకీయాల కోసం దశల వారీ సంస్కరణలు రావాలి అంతే కానీ..

by Ravi |   (  Updated:2025-08-29 00:31:07  IST  )

మొన్నటి సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబడి, పరిశీలనకై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడ్డ రాజ్యాంగం

రాజకీయాల కోసం దశల వారీ సంస్కరణలు రావాలి అంతే కానీ..
X

మొన్నటి సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబడి, పరిశీలనకై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడ్డ రాజ్యాంగం 130వ సవరణ బిల్లు ప్రత్యేకమైనది. ఇది పాలనలో పై స్థాయిలో నైతికత ప్రోది చెయ్యడానికి ఉద్దేశించిన బిల్లు. దీని ప్రకారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఏదైనా క్రిమినల్ కేసులో, అదీ ఐదేళ్లకు పైగా శిక్షార్హమైన కేసులో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు జైలు లేదా కస్టడీ జీవితం గడిపితే వారిని వెంటనే తొలగించాలి. ఒకవేళ 31వ రోజుకీ రాజీనామా చేయకపోతే ఆటోమేటిక్‌గా పదవి కోల్పోయే విధంగా ఈ బిల్లును రూపొందించారు. తర్వాత బెయిల్ పొందితే మళ్లీ పదవి చేపట్టవచ్చు. ఈ చట్టం స్ఫూర్తి వినడానికి ఎంతో బాగుంది. ఆదర్శం కళ్లకు కట్టినట్లుగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఆదర్శాన్ని జీర్ణం చేసుకోడానికి కడుపు వరకూ పంపే పీక సన్నం. ప్రయత్నించినా ప్రమాదం. ఎందుకంటే మొదటిది ఆయా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సందేహాలకు అతీతంగా నైతికత కలిగి ఉండాలి. నిజమే కానీ పార్లమెంట్ సభ్యుల్లో నలభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారంతా నేరస్తులు కాకపోవచ్చు కానీ ఆరోపణలు, కేసులు ఆ స్థాయిలో ఉన్నాయి. శాసన సభల పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. రెండోది అరెస్టు అయినంత మాత్రాన ముద్దాయి కాదు. నిరూపించబడే వరకూ నిరపరాధి అన్నది సహజ న్యాయం. ఈ బిల్లు అలా కాకుండా అరెస్టు అయ్యావు కాబట్టి కుర్చీలో ఉండడానికి వీల్లేదు అని అనడం న్యాయం కాదు. పైగా ఒక వ్యక్తి నేరం నిరూపించబడి, జైలు శిక్ష పడిన మరు క్షణం చట్టసభలకు అనర్హుడవుతాడు. మూడోది రాజకీయ ప్రేరేపిత వాతావరణంతో కేసులు కేంద్రంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారిపైనే నమోదవుతుంటాయి. గానీ అధికార పార్టీలో మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో ఈ చట్టం నిష్పక్షపాతంగా తన పని తాను చేసుకుపోతుందంటే నమ్మడం కష్టం. అయితే ఆదర్శం అక్కరలేదా? అంటే కావాలి. ఆ చట్టం ప్రభావవంతమైన రీతికి ఎన్నికల విధానం ఎదగాలి. అవినీతి రహిత ఎన్నికలు, రాజకీయాల కోసం దశల వారీ సంస్కరణలు రావాలి. ఆ దిశగా ప్రయాణం ఇంకా మొదటి దశలోనే ఉంది. అది కూడా ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి.

-డా.డి.వి.జి. శంకరరావు

94408 36931

Next Story