లేఖతో బట్టబయలైన బీఆర్ఎస్- బీజేపీ బంధం!

by Ravi |   (  Updated:2025-05-30 01:00:27  IST  )

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చాక చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లతో రాష్ట్రంలో తమకిక భవిష్యత్‌

లేఖతో బట్టబయలైన బీఆర్ఎస్- బీజేపీ బంధం!
X

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చాక చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లతో రాష్ట్రంలో తమకిక భవిష్యత్‌ లేదనే భయంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో పూర్తి గందరగోళం నెలకొంది. తమది ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. తమ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందనే ఆందోళనతో బీఆర్ఎస్ నేతలు ఎవరి దారి వారు చూసుకోవడానికి ప్రయత్నిస్తుండ డంతో పార్టీ ముక్కలయ్యే దశకు చేరుకుంది.

రాష్ట్రం ఆవిర్భవించి పదకొండేళ్లు అయినా సామాజిక తెలంగాణ ఏర్పడలేదని పదేళ్ల కేసీఆర్‌ నియంతృత్వ పాలనను ఆమె ఎత్తిచూపారు. అయితే కవిత సామాజిక అంశం మాట్లాడినట్లు బయటకు కనిపించినా పార్టీపై ఆమెకు ఉన్న అసంతృప్తి బయటపడింది. ఇప్పటికే ఆ పార్టీలో మూడు ముక్కలాట సాగుతున్న వేళ కేసీఆర్‌ కూతురు కవిత ధిక్కార స్వరం వినిపిస్తూ బీఆర్‌ఎస్‌ అసలు రంగును బహిర్గతం చేశారు.

బీఆర్ఎస్‌ను కుదిపేసిన లేఖ

కవిత ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, పార్టీలో నాకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఎవరో తెలుసని, వాటిని త్వరలో బహిర్గతం చేస్తానని ప్రకటించారు. ఆ వెంటనే హరీశ్‌ రావు కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందనే భావన బయటకొచ్చింది. తర్వాత కేటీఆర్‌ హరీశ్‌రావు ఇంటికెళ్లడం, అనం తరం హరీశ్‌రావు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి వెళ్ల డం జరిగాయి. మరోవైపు కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావు పార్టీలో అధిపత్యం కోసం ప్రెస్‌మీట్లు, సోషల్‌ మీడియా వేదికగా పోటీపడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసున్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి పార్టీలోని గ్రూపు రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. కవిత దూకుడుతో ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్‌ తనయ ఇటీవల అమెరికాకు వెళ్తూ కేసీఆర్‌కు రాసిన ఒక లేఖ ఆమె తిరిగొచ్చే సమయానికి లీకవడంతో బీఆర్‌ఎస్‌ను కుదిపేసింది. ఆ లేఖలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం బహిర్గతమైంది. ఇంతకాలం లోపాయికారి ఒప్పందంతో పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటున్న ఈ రెండు పార్టీలు ఇకపై భవిష్యత్‌లో పొత్తు పెట్టుకునే దిశగా సాగుతున్నట్టు కవిత లేఖతో స్పష్టమైంది.

అందుకే కవితకు బెయిల్

తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంతో కాంగ్రెస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్‌ బీజేపీతో చేతులు కలిపింది. లోక్‌‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీజేపీకి సహకరించింది. బీఆర్‌ఎస్‌ బీజేపీకి ‘బీ’ టీమ్‌గా వ్యవహరిస్తోందని ఎప్పటి నుండో కాంగ్రెస్‌ చెబుతున్న విషయమే ఇప్పుడు కవిత లేఖతో నిజమని తేలింది. కవిత లేఖలో ఎత్తి చూపిన అంశాలతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోబోతున్నాయా? అనే సందేహాలొస్తున్నాయని ఆమె అభిప్రాయ పడడంలో కొత్తేమీ లేదు.. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గతంలో నరేంద్ర మోడీకి విధేయుడిగా ఉంటూ పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఇక తమ అవినీతి కప్పిపుచ్చుకోవడానికే గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి మోడీ ప్రభుత్వానికి పూర్తిగా దాసోహమైంది. అందుకే విభ జన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హామీలను, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రాజెక్టులను, పథకాలను సాధించడంలో కేసీఆర్‌ విఫలమయ్యాడు. దీంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇక రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు జరిగింది. అనంతరం ఈ రెండు పార్టీలు మళ్లీ ఒక్కటవడంతో కవితకు బెయిల్‌ వచ్చింది.

లేఖతో బట్టబయలైన వాస్తవాలు..

‘డియర్‌ డాడీ’ అంటూ కవిత రాసిన లేఖలో ఆమె వాస్తవాలను బహిరంగపర్చడం సంతోషకరం. ఉద్యమకారులకు రజతోత్సవ సభలో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె కేసీఆర్‌కు చెప్పిన మాట కొత్తేమీ కాదు. పలువురు ఉద్యమకారులను తన స్వార్థానికి వాడుకున్న కేసీఆర్‌ గద్దెనెక్కాక వారిని విస్మరించి, తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక కేసీఆర్‌ కుమార్తె, సీనియర్‌ నేత అయిన కవితనే పార్టీ అధినేతకు నేరుగా అభిప్రాయాలు చెప్పలేక లేఖలు రాశారంటే నియంతృత్వ పోకడలున్న బీఆర్‌ఎస్‌లో ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీఆర్‌ఎస్‌ కుమ్ములాటల మూలంగా విడుదలైన కవిత లేఖతో అనేక వాస్తవాలు బట్టబయలైన నేపథ్యంలో ఆ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది. గతంలో పార్టీలో గొంత్తెత్తిన పలువురు సీనియర్‌ నేతలకు నోటీసులిచ్చి పార్టీని వీడేలా చేసిన కేసీఆర్‌ ఇప్పుడు కూతురు కవితపై ఏ చర్య తీసుకుంటారో వేచి చూడాలి..

-రాచమల్ల సిద్ధేశ్వర్‌,

చైర్మన్‌, రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌,

98481 74377

Next Story