- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రాజకీయ ఆపరేషన్'తో ఆప్‌ను చీల్చిన బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీలో చీలిక, రాఘవ్ చద్దా బీజేపీలో చేరిక నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై విశ్లేషణ. ఫిరాయింపుల చట్టాల వైఫల్యం, ప్రతిపక్షాల బలహీనత, భారత ప్రజాస్వామ్యంపై ప్రభావం వంటి అంశాలపై సమగ్ర చర్చ.

అవినీతికర రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే బలమైన కోరికతో సామాన్యుడి గొంతుగా 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు నిలువునా చీలిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం. ఆప్ పార్లమెంటరీ గ్రూప్ నేతగా కొనసాగుతూ వస్తున్న ఎంపీ రాఘవ్ చద్దా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడాన్ని, వారి వెనుక దాగిన అధికార కాంక్షను విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
కొంత కాలంగా లోపాయికారిగా ఉంటూ..
రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా ఉన్న రాఘవ్ చద్దా.. పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రధాని మోడీ మీద అవసరమైన సందర్భాల్లో విమర్శలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఆప్ నేతలు ఇటీవల విమర్శించారు.. ఈ నేపథ్యంలోనే, ఆయనను డిప్యూటీ నేత పదవి నుంచి తొలగించారు. ఎంపీ అశోక్ మిట్టల్‌ను ఆ స్థానంలో నియమించారు. ఇక అశోక్ మిట్టల్ ఆప్ డిప్యూటి నేతగా బాధ్యత చేపట్టిన మరునాడే తన నివాసంఫై 'ఈడీ' దాడులు ప్రారంభమైనాయి. అంతకు ముందే కొంతమంది ఆప్ రాజ్యసభ సభ్యుల ఆస్తులపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి. దీంతో గత కొంత కాలంగా లోపాయికారంగా అధికార బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్న రాఘవ్ చద్దా రాజ్యసభలోని 10 మంది ఆప్ సభ్యులలో 7 గురితో గ్రూపుగా ఏర్పడి ఆ పార్టీకి రాజీనామా చేసి మూడింట రెండు వంతుల మెజార్టీతో బీజేపీలో విలీనమైనట్లు ప్రకటించారు..
ఆప్‌ను బలహీనపర్చటం బీజేపీ ప్యూహం!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌తో వీరి భేటీ చూస్తుంటే ' రాజకీయ ఆపరేషన్' స్పష్టంగా కనిపిస్తుంది. ఆప్‌పై వస్తున్న విమర్శలలో డబ్బులున్న ధనికులకు, వ్యాపార పారిశ్రామికులకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టడమే ఆప్ చేసిన తప్పిదమని ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నాయకులను ఇరికించి, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టులు, కోర్టుల విచారణలు ప్రజలలో ఆప్‌ను పలుచన చేశారు. అవినీతిని అంతం చేస్తామని వచ్చిన పార్టీ, ఆరోప ణల్లో చిక్కుకోవడం రాజకీయ విరోధాభాసంగా మారింది. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో బలమైన ఉనికి కలిగి జాతీయ రాజ కీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆప్‌ను లోపలి నుండే దెబ్బ తీయడం ద్వారా ప్రతిపక్ష గొంతును నిర్వీర్యం చేయడం ఇక్కడ బీజేపీ అనుసరించిన ప్రధాన ఎత్తుగడ.
ప్రభుత్వానికి గండం ఉండొచ్చు!
ఆప్ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకో వడంతో ఫిరాయింపుల చట్టం ప్రహసన ప్రాయమని మరోసారి తేలిపోయింది. విపక్షాలను బలహీనపరిచి తన శక్తిని పెంచుకోవాలని బీజేపీ వ్యూహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. పంజాబ్‌లో బీజేపీకి దక్కింది గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు మాత్రమే. పంజాబ్ నుండి ఆప్‌కు 6 గురు ఎంపీల ప్రాతినిధ్యం ఉన్నది. బహుశా తొందర్లోనే ఎన్నికల ముంగిట్లో ఉన్న పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వానికి గండం తప్పకపోవచ్చు..
నిరుపయోగంగా పార్టీ పిరాయింపుల చట్టాలు
ఒక పార్టీ నుండి అసెంబ్లీకైన, పార్లమెంట్‌కైనా ఎన్నికైన పార్టీ అభ్యర్థులు.. అవకాశవాద రాజకీయాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు దిగజారి పార్టీలు ఫిరాయిస్తే తక్షణమే వారి పదవి కోల్పోయే విధంగా సమగ్రమైన చట్టం రూపొందించాలి.. అప్పుడే పార్టీ ఫిరాయింపులను ఆపగలుగుతాం.
-ఉజ్జిని రత్నాకర్ రావు
సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకులు
94909 52646






