ప్రణాళిక లేని బీజేపీ హామీలు

by Ravi |
ప్రణాళిక లేని బీజేపీ హామీలు
X

ధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ప్రతి సమావేశంలోనూ బీజేపీ పార్టీ ఇస్తున్న ప్రధాన హామీ. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన ఈ హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇవి ఉచితంగా అందితే నెలకు ఏ స్థాయిలో డబ్బులు మిగులుతాయో ప్రజలకు వివరించాలని తెలిపింది. మరి హామీ సరే.. మరి దీనిని ఎలా అమలు చేస్తారో విడమరిచి చెప్పేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే వాటి అమలుపై ఆ పార్టీ దగ్గరే సరైన ప్రణాళిక లేదు.

ఎలా అమలు చేస్తారు?

ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఉచిత విద్య అందుతుంది. కాస్తా ఆలస్యమైనా ఫీజ్ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లాంటి స్కీమ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల ఛాయిస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. సౌకర్యాల లేమి అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఉచిత విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించే వీలుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ఉచిత విద్యుత్ హామీ ఎలా అమలు చేస్తారోననే సందేహం అందరిలో ఉంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటారా, లేదా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తారా లేకుంటే తల్లిదండ్రులకే ఛాయిస్‌ను విడిచిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో చదివే తమ పిల్లల ఫీజును ప్రభుత్వమే కడుతుందా అనేది సమాధానం లేని ప్రశ్నలే. అలాగే ఉచిత వైద్యాన్ని ఎలా అందిస్తారోననేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందుతుంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో సమస్యలున్నా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందుతున్నది. అలాగే అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌ ద్వారా 50-70 శాతం బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ అందిస్తామన్న ఉచిత వైద్యం ఎలా అందిస్తుంది? ప్రైవేటు ఆసుపత్రులను తమ ఆధీనంలోకి తీసుకుని వాటిని ప్రభుత్వ ఆసుపత్రులుగా మార్చేస్తారా లేదా అందరికి ఆరోగ్య బీమా చేయించి వాటి బిల్లులు చెల్లిస్తారా లేదా సర్వ రోగాలకు సవాలక్ష నిబంధనలున్న ఆయుష్మాన్ భారత్‌ను నివారిణిగా చూపిస్తారా? జీహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగే కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. అప్పుడు బండి సంజయ్ బీజేపీ ఈ ఎన్నికలలో గెలిస్తే వరదల్లో కొట్టుకుపోయిన, దెబ్బతిన్న వాహనాలకు ఆ యజమానులకు కొత్త వాహనాలు కొనిస్తానని హామీ ఇచ్చారు. అయితే గెలిచాక ఈ హామీపై ఒక వార్త సంస్థ అడిగితే మేము వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని చెప్పి నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు బీజేపీ చెబుతున్న ఉచిత విద్య, వైద్యం హామీ కూడా అలాగే ఉంటుందా? గెలిచాక ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించుకోండి అంటారేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఊహజనిత అధికారం చూపించి..

అధికారం కోసం రాష్ట్రంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అలివిమాలిన హామీలు ఇస్తోంది. కానీ వాటి అమలుకు ప్రణాళిక ఏంటన్నది మాత్రం ప్రజలకు వివరించలేకపోతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలవుతున్న హామీలను కొనసాగిస్తామని చెబుతూనే వాటికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేకపోతోంది. ఇప్పటికే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. మరి అలాంటప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తుందా? రుణమాఫీ ఊసేత్తడంలేదు. ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిన అమలు కాలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, బీసీ లోన్లు హామీలను ఎలా నెరవేరుస్తామోననే భరోసాను ప్రజలకు ఇవ్వలేకపోతోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు సైతం కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తారే తప్పా తెలంగాణకు వారు ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పడం లేదు. కేంద్రం రాష్ట్రానికి ఏయే రంగాల్లో ఎంత ఖర్చు చేశారో భవిష్యత్తులో వేటికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెప్పలేకపోతున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని మభ్యపెడుతూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలతో పని చేయించుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదని కేంద్ర నాయకత్వానికి తెలిసినా.. ఇప్పటికి ఉన్న నాలుగు ఎంపీ సీట్ల సంఖ్య ఆరుకు పెరగొచ్చనే అంచనాతో రాష్ట్రంపై కాన్సెంట్రేషన్ పెంచింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా సెగ్మెంట్లలో బీజేపీకి అభ్యర్థులే లేరనే విషయం బహిరంగ రహస్యమే. బీజేపీకి ఎంపీలున్నా నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో పార్టీ ఎన్ని గెలవచ్చో కచ్చితంగా చెప్పే వారు కూడా లేరు. సరైన ప్రణాళిక లేకుండా ఎంతసేపు తెలంగాణలో అధికార పక్షంపై దూషణలతో కాలం గడుపుతున్న బీజేపీ వద్ద, బీఆర్ఎస్‌ను ఢీకొట్టేలా ఒక్క కొత్త హామీ కూడా లేదనడం కాదనలేని వాస్తవం.

ఫిరోజ్ ఖాన్

96404 66464

Also Read..

బీజేపీ వ్యూహాల వెనక అమిత్ షా


Next Story