భరత మాత.. యావద్దేశ ప్రతీక

by Ravi |   (  Updated:2026-07-28 01:00:41  IST  )

భరతమాత భావనకు వేదాల నుంచి స్వాతంత్ర్యోద్యమం వరకు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలు.. పృథ్వీ సూక్తం, వందేమాతరం, భారతమాత చిత్రణ, జాతీయ చైతన్యంలో ఈ భావన పోషించిన పాత్ర..

భరత మాత.. యావద్దేశ ప్రతీక
X

భారతీయ సనాతన ధర్మంలోను, సాంస్కృతిక జీవన విధానంలోనూ దేశాన్ని కేవలం ఒక భౌగోళిక సరిహద్దులు కలిగిన నేలగా చూడటం లేదు.. భూమిని ఒక జీవశక్తిగా, సమస్త జీవకోటికి ఆశ్రయాన్ని ఇచ్చే 'తల్లి'గా ఆరాధించే అమూల్యమైన సంప్రదాయం అనాదిగా వస్తోంది.

ఈ 'భారత మాత' లేదా 'భారతాంబ' భావన వెనుక వేలాది సంవత్సరాల ఆధ్యాత్మిక వేర్లు, సనాతన మూలాలు, బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి కలగలిసి ఉన్నాయి. భారతీయ వేద సాహిత్యంలో మాతృభూమి పట్ల భక్తి, శ్రద్ధలు అత్యంత పవిత్రమైన రీతిలో వ్యక్తమయ్యాయి. పృథ్వీ సూక్తం (అధర్వణ వేదం).. ప్రపంచ సాహిత్యంలోనే మాతృభూమిని కీర్తిస్తూ రాసిన అత్యంత పురాతనమైన, లోతైన కవిత పృథ్వీ సూక్తం. ఇందులో భూమికి గల ప్రకృతి రూపాన్ని, దాతృ త్వాన్ని తల్లిగా వర్ణించారు. "మాతా భూమిః పుత్రోహం పృథవ్యాః". (భూమి నా తల్లి, నేను ఈ పృథివి యొక్క పుత్రుడిని). ఈ శ్లోకం కేవలం దైవ భక్తిని మాత్రమే కాదు, మానవునికి, ప్రకృతికి మధ్య ఉన్న విడదీయరాని అవినాభావ బంధాన్ని, బాధ్యతను స్పష్టం చేస్తుంది.

దేశరూపం దాల్చిన అమ్మవారు..

'భరత' అనే పదం రుగ్వేదంలోని భరత వంశం నుండి పుట్టింది. సంస్కృతంలో 'భ' అంటే కాంతి లేదా జ్ఞానం, 'రత' అంటే ఆసక్తి కలిగినది అని అర్థం. అంటే జ్ఞానాన్ని అన్వేషించే భూమి అని భావం. నిత్య జీవితంలో భారతీయులు నిర్వహించే శుభకార్యాల్లో పలికే సంకల్పంలో "జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే..." అని చదవడం ద్వారా తాము నివసిస్తున్న భౌగోళిక, సాంస్కృతిక ఉనికిని సమస్త విశ్వానికి అనుసంధానించి గుర్తు చేసుకుంటారు. చారిత్రకంగా భారతీయ రాజులు తమ రాజ్యాలను కాపాడుకోవడానికి యుద్ధ రంగానికి వెళ్లేముందు దుర్గ లేదా కాళి వంటి ఇలవేల్పులను (శక్తి స్వరూపిణి) పూజించేవారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఈ అమ్మవారి భావనే దేశ రూపం దాల్చి 'భారత మాత'గా రూపాంతరం చెందింది.

ఒకే తల్లి పిల్లలం.. మనమంతా ఒకటే

1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా విభిన్న ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాల ప్రజలను ఏకం చేసే సమైక్య శక్తి అవసరమైంది. "మనమంతా వేర్వేరు కాము, ఒకే తల్లి పిల్లలము" అనే ఆత్మీయ భావన ప్రజలలో జాతీయతా స్ఫూర్తిని రగిల్చింది. 1873: కిరణ్ చంద్ర బెనర్జీ రాసిన 'భారత్ మాతా' నాటకంలో దేశాన్ని మాతృ దేవతగా మొదటిసారి ప్రదర్శించారు. 1882: బంకిం చంద్ర ఛటర్జీ రాసిన విప్లవాత్మక నవల 'ఆనంద్ మఠ్' భారత స్వాతంత్ర్య చరిత్రను మలుపు తిప్పింది. ఇందులో ఆయన పొందుపరిచిన "వందేమాతరం" గీతం మాతృభూమిని దుర్గ, లక్ష్మి, సరస్వతులతో పోలుస్తూ తల్లిగా ప్రణమిల్లింది. ఈ నినాదం బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోతున్న సింహాన్ని లేపినంత భయాన్ని కలిగించింది.

మాతృభూమిని దైవంగా పూజించడం

బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ భావజా‌లంతో ప్రభావితులైన అవనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాత తొలి ప్రసిద్ధ వర్ణచిత్రాన్ని వేశారు. ఇందులో భారతమాతను కేవలం విగ్రహంగా కాకుండా కాషాయ వస్త్రాలు ధరించి, నాలుగు చేతుల్లో అభయం, పుస్తకం (జ్ఞానం), ధాన్యపు కంకులు (ఆహారం), శ్వేత వస్త్రం (శాంతి), జపమాల (ఆధ్యాత్మికత) పట్టుకున్న సన్యాసిని రూపంలో సున్నితంగా చిత్రించారు. ఆ తర్వాత శతాబ్దం ఆరంభంలో రాజా రవివర్మ, అమృత షెర్గిల్, రూప్ కిషోర్ కపూర్ వంటి ప్రముఖ కళాకారులు భారతమాతను సింహ వాహనంతో, త్రివర్ణ పతాకాన్ని చేతబూనిన వీరనారిగా, రక్షకురాలిగా శక్తిమంతంగా చిత్రించారు. తమిళ విప్లవ కవి సుబ్రహ్మణ్య భారతి తన 'విజయ' పత్రిక ముఖచిత్రంపై భారతదేశ పటం నేపథ్యంతో భారతమాతను ప్రచురించి పండితులకే కాక సామాన్యులకు సైతం ఈ భావనను చేరువ చేశారు. 1936లో వారణాసి (కాశీ)లో మహాత్మా గాంధీ చేతుల మీదుగా మొట్టమొదటి "భారత మాత దేవాలయం" ప్రారంభమైంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ ఎలాంటి పూజా విగ్రహాలు లేదా మతపరమైన ప్రతీకలు ఉండవు. దేశ భౌగోళిక సమైక్యతను, మాతృభూమిని దైవంగా పూజించడమే దీని ముఖ్య ఉద్దేశం.

దేశమే భారతమాతగా..

"భారత్ మాతా కీ జై!" అనే నినాదం భారతదేశ వ్యాప్తంగా ఉన్న వందలాది భాషా, ప్రాంతీయ వ్యత్యా సాలను తుడిచిపెట్టి, సమరయోధులను ఉరికొయ్యల వైపు చిరునవ్వుతో నడిపించిన మహత్తర మంత్రం. ఈ మాతృత్వ ఆలోచన "వసుధైక కుటుంబకం" "అహింస" అనే మూల సూత్రాలకు అనుగుణంగా, సమస్త మానవాళిని తన బిడ్డలుగా చూసే దాతృత్వాన్ని సూచిస్తుంది. భారతీయ ధర్మంలో దేశాన్ని 'భరత మాత'గా భావించడం అనేది తాత్కాలికంగా పుట్టుకొచ్చిన ఒక రాజకీయ నినాదం కాదు.. అది వేలాది సంవత్సరాలుగా భారతీయుల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఉత్కృష్ట సాంస్కృతిక సత్యం. భూమిని తల్లిగా, ప్రకృతిని దైవంగా, దేశాన్ని సమైక్య శక్తిగా చూసే ఈ ఆరాధనా భావం తరతరాల భారతీయులలో దేశభక్తిని, త్యాగని రతిని, సమిష్టి బాధ్యతను పెంపొందిస్తూనే ఉంటుంది.

-త్రిలోక్

83175 31398

Next Story