కొత్త కలర్‌లో పాత సీసా.. భగవంత్ కేసరి

by Disha edit |
కొత్త కలర్‌లో పాత సీసా.. భగవంత్ కేసరి
X

తెలుగు సినిమా హీరోలకు ఒక శారీరక భాష, భాష, కల్చర్, మీటర్లను ఎనిమిది సంవత్సరాల క్రిందటే నిర్ణయించేసారు దర్శక నిర్మాతలు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. సాగుతుంది కూడా... ప్రేక్షకులు కూడా ఈ వ్యవహారానికి అలవాటు పడిపోయారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా ఒక్కొక్క హీరోకు ఒక్కొక్క తరహా ‘చిత్రకథలు’ మాత్రమే సరిపోతాయని ‘ఫిక్స్’ అయిపోయారు జనం. ఆ వరసలోనే సినిమాలు తీస్తారు. దర్శకుడెవరైనా ‘చిత్రం’ మాత్రం ఆ హీరోకు తగిన వ్యాపార సూత్రాలకు అనుగుణంగా నడుస్తుంది. నచ్చితే హిట్, నచ్చకపోతే ఫట్. ఇక్కడ మాత్రం కథానాయకుని చరిష్మా పనిచేయదు. ప్రేక్షకుల అభిరుచి మాత్రమే కనిపిస్తుంది. ఈ కోవలోనే బాలకృష్ణ సినిమా ‘భగవంత్ కేసరి’ వస్తుంది.

సెంటిమెంట్‌తో పాటు మాస్ సీన్లు

ఊరమాస్, సెంటిమెంట్ కథలు మనకు (ముఖ్యంగా బాలకృష్ణకు) కొత్త కాదు. కాకుంటే గెటప్‌లు హీరో మారుతాయి. ఓ అరగంట క్రిస్పీగా సాగుతుంది. అనంతరం కథ పుంజాలు తెంపుకొని ‘కథానాయకుని కత్తి’ రాటుకు బలవుతుంది. భగవంత్ కేసరి కథ అసలు సిసలు బాలయ్యకు సరిపోయిన కథ. అనిల్ రావిపూడి దర్శకుడు అనగానే హాస్యం, కొత్త రకమైన కథనం వంటివి ప్రేక్షకులు ఆశిస్తున్నారు. నాటి ‘పటాస్’ నుంచి తీసిన నాలుగు చిత్రాలు ఆయన అదే పంధాలో తీసి విజయవంతమైన చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. బాలయ్య, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ వంటి వారితో అనిల్ రావిపూడి ఈ కొత్త కలర్ పాత సీసాను ప్రేక్షకులకు అందించి ఎంతవరకు విజయం సాధించారో రాబోయే రోజులు నిర్ణయిస్తాయి. ఈ చిత్రంతో పాటు విడుదలైన ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రాల హవా ఎంతవరకనేది కూడా చూడాలి.

కథానాయకునిగా బాలకృష్ణ అనుకున్న తర్వాత ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రేక్షకులు ఊహించుకుంటారు. కేసరిలో కూడా ఆయనది ఇదే లుక్. ఓ బిడ్డ కోసం తండ్రి పడే ఆవేదన, తపనలను ఆర్ద్రతతో బాలయ్య తన అనుభవంతో సునాయాసంగానే చేశాడు. శ్రీలీలతో ఆయన సన్నివేశాలలో ‘సెంటిమెంట్’ బాగానే పండింది. అలాగని బాలకృష్ణ మార్కు ఊర మాస్ సన్నివేశాలను వదల్లేదు. సీఎం అయినా పీఎం అయినా, ఎంతమంది జనం తన మీదకు వచ్చినా వారిని కండకో ముక్కగా నరికే (బి. గోపాల్) మార్కు సన్నివేశాలలో కూడా బాలకృష్ణను సైతం అనిల్ చూపించారు. అయితే, ఈ సన్నివేశాలు ఇటువంటి సినిమాలకవసరం. ఇంతవరకు చూసిన బాలకృష్ణ చిత్రాలు కన్నా, ఈ చిత్రంలో ఆయన కొత్తగా ప్రయత్నించారు. ఇది ఒక విధంగా బాగుంది కూడా. ఇక స్క్రీన్ ప్లే ఒక విధమైన అస్పష్టతతో ప్రారంభమై క్రమేపీ స్పష్టత దిశగా వెళుతుంది. ప్రారంభం నుంచి ఓ అరగంట వరకు సినిమాను బాగానే నడిపిస్తారు. తర్వాత నుంచి హీరో ఎలివేషన్స్ ప్రారంభమవుతాయి. ‘కేసరి’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘కథ’ పెద్దగా అనుకోవడం దర్శకుడు పంథా కాదు. హాస్యం, సెంటిమెంట్లతో చిత్రాన్ని ముగించడం, చక్కని సంగీతం, కొన్ని పాటలు ఇవే అనిల్ చిత్రానువాదం యొక్క గమన సూత్రాలు. ఈ చిత్రంలో ఇవన్నీ ఉన్నాయి. అలాగని ఇదో కొత్త తరహా చిత్రం కాదు. బాలకృష్ణతో అనిల్ చేసిన ఓ ప్రయత్నం మాత్రమే!

కథేంటంటే..

కథగా చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు లేవు. భగవంత్ కేసరి (బాలకృష్ణ) ఒక పెద్ద నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. తన తల్లి చనిపోయే ముందు జైలర్ (శరత్ కుమార్) అవకాశం కల్పిస్తాడు. అందుకు కృతజ్ఞతగా అతను మరణించాక కూతురు విజ్జు (శ్రీ లీల) బాధ్యతను ‘కేసరి’ తీసుకుంటాడు. కానీ తండ్రి మరణం ‘విజ్జు’లో ఒక విధమైన ‘ఫోబియో’ను క్రియేట్ చేస్తుంది. పెద్దయ్యాక ఒక అబ్బాయి ప్రేమలో పడి ‘కేసరి’ని దూరం పెడుతుంది. ఈ సమయంలో ఆమె ఓ పెద్ద అపాయంలో చిక్కుకుంటుంది. ప్రాణానికి అపాయం కొని తెచ్చుకుంటుంది. భగవంత్ కేసరి ఆమెను ఎలా ఆదుకున్నాడు. అందుకు ఏమి చేశాడనేది చిత్రం. ఇటువంటి కథలు ఎన్నో... ఎన్నెన్నో తెలుగు ప్రేక్షకుడు చూసేసాడు. ‘అయినా కథలు ఎక్కడున్నాయి కనుక, ఉన్న వాటినే అటు ఇటు తిప్పి దుస్తులు మార్చి తీసుకోవడమే’ నని చక్రపాణి గారు ఆనాడేనాడో చెప్పినా ఇది వాస్తవం. ఈ చిత్ర కథ కూడా అంతే. కాకుంటే స్క్రీన్ ప్లే‌లో అనిల్ రావిపూడి తీసుకున్న జాగ్రత్తలు, బాలకృష్ణ అనుభవంతో చేసిన నటన, స్టైలిష్ విలన్‌గా రాంపాల్ పెర్ఫార్మెన్స్ వంటివి సినిమాను చూడగలిగేటట్టు చేశాయి.

నాటి నుంచి నేటి వరకు మన కథానాయకులకు సరైన ‘విలన్’ల నుంచి పోటీ తక్కువ. వారు ‘సవాల్’ విసరలేరు. బాలకృష్ణ వంటి మాస్ హీరోలకు విలన్ సమ ఉజ్జీ కావాలి. లేకుంటే పాత్రలు తేలిపోతాయి. బోయపాటి, బి. గోపాల్, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ వంటి వారు గతంలోనూ కూడా బాలకృష్ణతో తీస్తున్న సినిమాలలో ‘విలన్’ కాస్త గట్టిగానే సవాలు విసిరే పద్ధతులను అనుసరించారు. కానీ ‘కేసరి’లో ప్రతి నాయకుడు కథానాయకునికి ఏ స్థాయిలోని సరైన పోటీ లేకపోవడం చేత చాలా వరకు సన్నివేశాలు ‘లయ’ తెప్పినట్టుగా ఉంటాయి. ఈ చిత్రకథలో మలుపులున్నాయని ప్రేక్షకులకు ముందుగా కలిగించే విధంగా సన్నివేశాలకు అల్లుకున్నారు. ఇది బాగుంది కానీ.. క్రమేపీ సినిమా మీదున్న మంచి అభిప్రాయం మారుతుంది. ఇదో తండ్రి కూతుర్ల కథ. చక్కని డ్రామా, సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉన్న కథ. బాలకృష్ణ, శ్రీ లీలలు కూడా ఆ ఫ్లేవర్‌ను బాగానే అర్థం చేసుకునేలా దర్శకుడు జాగ్రత్తగానే ‘బాలయ్య’ను డీల్ చేశాడు. రచయితగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ శరీర భాషకు తగిన ‘పంచ్’ డైలాగులను బాగానే రాసుకున్నాడు. అవి పేలాయి కూడా. భగవంత్ కేసరి బాలకృష్ణను ఓ కొత్త తరహా ‘మాస్’ పాత్రలో చూపించిన చిత్రం. దర్శక రచయిత అనిల్ రావిపూడి చిత్రాన్ని ఫర్వాలేదనే స్థాయిలోనే తీశాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా ఎవరికి వారు తమ అవుట్ పుట్ నిచ్చారు. కాకుంటే కొత్త సీసాకు ‘కలర్’ వేసిన చిత్రంగా, దసరా పండుగకు ‘మాస్’కు కాలక్షేపంగా ‘భగవంత్ కేసరి’ ఉందనటం వాస్తవం.

- భమిడిపాటి గౌరీశంకర్

94928 58395


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed