పెట్టుబడి మోసాలతో జాగ్రత్త!

by Ravi |   (  Updated:2025-07-16 00:45:51  IST  )

నేటి డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. సమాచారం, వినోదం

పెట్టుబడి మోసాలతో జాగ్రత్త!
X

నేటి డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. సమాచారం, వినోదం, స్నేహాలు పెంచుకోవడం వంటి అనేక ప్రయోజనాలకు వేదికగా నిలిచిన సోషల్ మీడియా, సైబర్ నేరగాళ్లకు కూడా ఒక సాధనంగా మారి మోసపూరిత కార్య కలాపాలకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా, పెట్టుబడి చిట్కాలు, అధిక రాబడుల ఆశచూపి జరిగే సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తత, అవగాహన అత్యవసరం.

సైబరాబాద్, హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులలో ప్రతి పది కేసులలో రెండు నుండి మూడు పెట్టుబడి మోసాలకు సంబంధించినవేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తరిస్తోంది. భారతదేశంలో సైబర్ నేరాలు ఏటా 15% నుండి 20% వరకు పెరుగుతున్నాయని అంచనా. ఇందులో పెట్టుబడి సంబంధిత మోసాలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. కొన్ని నివేదికలు మొత్తం సైబర్ మోసాలలో 25-30% వరకు పెట్టుబడి మోసాలేనని సూచిస్తున్నాయి.

నకిలీ లాభాలను చూపిస్తూ..

ఈ మోసాల భారీన అమాయక ప్రజలు, ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశించేవారు, వేగంగా సంపాదించాలని చూసేవారు పడుతున్నారు. ప్రజల ఆర్థిక భద్రతకు ఇది ఒక పెనుసవాలుగా మారింది. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించడానికి వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. అందులో షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో అధిక లాభాలు అందిస్తామని నకిలీ పథకాలను ప్రకటిస్తారు.. ఈ పథకాలకు నమ్మదగిన ముద్ర వేయడానికి, సినిమా తారలు, రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణుల పేర్లను, ఫోటోలను అక్రమంగా ఉపయోగించి నకిలీ ఖాతాలను సృష్టిస్తారు. అంతేకాదు, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను సృష్టించి, పెట్టుబడిదారులకు నకిలీ లాభాలను చూపిస్తూ మరింత డబ్బు పెట్టుబడిగా పెట్టమని ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత పెట్టుబడిదారుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అనేక అడ్డంకులను సృష్టించి, చివరికి డబ్బుతో మాయమవుతారు. టెలిగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ ఫామ్‌లలో ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్ వంటి పేర్లతో గ్రూపులను సృష్టించి, అందులో నకిలీ విజయ గాథలను పంచుకుంటూ సభ్యులను ఆకట్టుకుంటారు. ఈ మోసగాళ్లు ప్రజలలో ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనను ఉపయోగించుకుని, వారి మానసిక స్థితిని అదుపులోకి తీసుకుని మోసాలకు పాల్పడతారు.

నకిలీ పథకాలను ఇలా గుర్తించండి..

ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ సమయంలో అధిక లాభాలు అందిస్తామని చెప్పే ఏ పథకాన్ని అనుమానించాలి. ఏదైనా పెట్టుబడి పథకంలో డబ్బు పెట్టే ముందు, ఆ సంస్థ గురించి, దాని ప్రామాణికత గురించి పూర్తిగా పరిశోధన చేయండి. సెబీ వంటి నియంత్రణ సంస్థల వెబ్‌సైట్లలో ఆ సంస్థ రిజిస్టర్ అయిందా లేదా అనేది తనిఖీ చేయాలి. పెట్టుబడికి సంబంధించిన సమాచారం కోసం, లావాదేవీల కోసం అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి. సామాజిక మాధ్యమాలలో వచ్చే లింకులను క్లిక్ చేయకూడదు. మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఏ సంస్థ కూడా ఫోన్ కాల్, ఈ-మెయిల్ లేదా మెసేజ్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను అడగదని గుర్తించుకోండి. నకిలీ పెట్టుబడి పథకాలు తరచుగా అక్షర దోషాలు, అస్పష్టమైన నిబంధనలు, అత్యవసర సందేశాలను కలిగి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించాలి. వీలైతే పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, ధృవీకరించబడిన ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోండి. సామాజిక మాధ్యమాలలో అపరిచిత వ్యక్తుల నుండి స్వీకరించిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఫాలో రిక్వెస్ట్‌లు లేదా మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయండి. లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

శిక్షా కాలం ఎక్కువే!

ఈ మోసాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలో శిక్షాకాలం ఐపీసీ కంటే పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (IT చట్టం) సైబర్ నేరాలను నియంత్రించడానికి ప్రాథమిక చట్టంగా పనిచేస్తుంది. అదే సమయంలో సైబర్ నేరాలకు శిక్షలను కూడా నిర్దేశిస్తుంది. ఐటీ చట్టంలోనూ కఠిన నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి, బాధితులకు న్యాయం అందించడానికి నేరాల గుర్తింపు, విచారణ, శిక్షల విషయంలో మరింత స్పష్టతను, కఠినత్వాన్ని తీసుకువచ్చాయి.

- డా.కట్కూరి

సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణులు.

94909 34520

Next Story