- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి బీసీలకు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి బీసీలకు న్యాయం జరిగేలా బీసీలకు రిజర్వేషన్లు పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న 20 శాతం బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే రాష్ట్రంలో కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద బీసీల లెక్కలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి, రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
తెలంగాణలో బీసీలు ఎంత మంది ఉన్నారు. వారికి ఏమి చేస్తే న్యాయం జరుగుతుందన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచితేనే బీసీలకు న్యాయం చేసి నట్లు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం శ్వేతపత్రం త్వరలోనే విడుదల చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా బీసీలు పల్లకీ మోసీ.. మోసీ విసిగిపోయారు. ఇకనైనా వారికి రాజకీయంగా న్యాయం జరగాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచినట్లయితే పంచా యతీ సభ్యులుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా బీసీలు పదవులను అలంకరిస్తారు. ఇందుకు సుప్రీం కోర్టు సిఫార్సు మేరకు డెడికేషన్ కమిషన్ రిపోర్టుతో సహా అసెంబ్లీలో చట్టం చేస్తే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు.
ఆ రిజర్వేషన్లనే అమలు చేస్తామంటే కుదరదు!
బీసీలకు మంచి రోజులు వస్తాయని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు భారీగా రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాలి. బీసీల జనాభా ఎంత ఉందో డేటా మొత్తం ప్రభుత్వం ముందు ఎలాగూ ఉంది. కాబట్టి, చెప్పిన శాతంతో ఎన్నికల్లోకి వెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వాటా బీసీలకు దక్కేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేస్తే ఇంకా బాగుంటుంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అని కాంగ్రెస్ బలంగా చెప్పుకుంది. ఆ మాటలన్నీ నిజం చేయాలి. ఇక కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం బీసీ సంఘాల సూచనలు, సలహాలు తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలి. కీలకమైన అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి బేష జాలకు వెళ్లకూడదు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీల రిజర్వేషన్లను పదేళ్లకోకసారి రొటేషన్ చేయాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో ఉన్న ఈ రిజర్వేషన్లే ఈ సారి అమలు చేస్తామంటే కుదరదు.
శాసించే స్థాయికి ఎదగాలి!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టింది. అందుకే కుల గణన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందే. అవసరమైతే బీసీ గణన పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. బీసీ గణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు కన్నెర్ర జేస్తారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే చేసి బీసీల హృద యాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాం. రిజర్వేషన్లపై బీసీ మేధావులతో చర్చించడానికి ప్రభుత్వంతో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఆశిస్తున్నాం. బీసీ నేతలు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో కలిసి పనిచేసి ప్రజల విశ్వాసం సొంతం చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి. అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. బీసీలకు రాజ్యాధికార చైతన్యం వచ్చిందని అందరికీ తెలిసేలా చేయాలి. పల్లెలో, టౌన్లలో బీసీలలో ఐకమత్యాన్ని తీసుకుని వచ్చి బీసీ అభ్యర్థులు గెలిచేలా కార్యక్రమాలు చేపట్టాలి. బీసీ నేతలను ఐక్యత చేసేందుకు కుల సంఘాల నేతలు కూడా కృషి చేయాలి. మనం పల్లకీ మోయడం కాదు.. శాసించే స్థాయికి మనమే ఎదగాలి.
దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు
99599 12341






