- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యాంగం మించిన రిజర్వేషన్ హామీలు – వాస్తవం ఎంత, మాయ ఎంత?
రాష్ట్రంలో మరోసారి బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ తామే నిజాయితీగా బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజకీయ

రాష్ట్రంలో మరోసారి బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ తామే నిజాయితీగా బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజకీయ పార్టీలు పోటీపడుతుండగా బీసీ సంఘాలు కూడా తామే చిత్తశుద్ధితో పోరాడుతున్నట్లు ఢంకా బజాయిస్తున్నాయి. మరి వాస్తవానికి ఈ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ సాధ్యమవుతుందా?
రాజ్యాంగంపై అవగాహన ఉన్న వారు ఇది సాధ్యం కాదని సమాధానమిస్తున్నారు అలాంటప్పుడు ఇంత తతంగం ఈ పార్టీలు ఎందుకు చేస్తున్నట్లు? రిజర్వేషన్ల పేరుతో ప్రజల మధ్య విభేదాలు ఎందుకు పెంచుతున్నట్లు?
రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా..
సామాజికంగా వివక్షకు గురవుతున్న, ఆర్థికంగా వెనుబాటుతనంలో ఉన్న ప్రజలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ల సౌకర్యం కల్పిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) తగినంత ప్రాతినిధ్యం లేని ఏ వెనుకబడిన తరగతి పౌరులకైనా రిజర్వేషన్లు అందించే అధికారం రాష్ట్రానికి ఉంది. వెనుకబాటుతనాన్ని నిర్ణయించే ప్రమాణాలు మతం ఆధారంగా కాకుండా సామాజిక, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉండాలని రాజ్యాంగం సూచిస్తుంది. అయితే రిజర్వేషన్ల సౌకర్యాన్ని రాజకీయ పార్టీలు తమ ఓట్ల రాజకీయాల కోసం స్వార్థంతో ఉపయోగించుకుంటుండడంతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. కోర్టు పలు సందర్భాలలో మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వకూడదని స్పష్టంగా చెబుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లు పెంచుతూ ప్రజలలో రిజర్వేషన్‌పై లేనిపోని ఆశలు రేకెత్తించడం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగ విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఆమోదించమని పార్టీలతో పాటు కుల సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం కరెక్టేనా?
రిజర్వేషన్ పెంచితే ఎవరికి లాభం?
ఈ పార్టీలకు బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని వాగ్దానం చేసినా ఏ ఒక్క బీసీ కులసంఘం కూడా తమ పార్టీకి ఎందుకు మద్దతివ్వలేదనే బీజేపీ నాయకుల ప్రశ్నకు సమాధానం ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచి అసలైన బీసీలకు న్యాయం చేస్తుందా.. బీసీలు సంబర పడవచ్చా? అనే విషయాన్ని పరిశీలిస్తే, సామాజికంగా వెనుకబడిన హిందూ బీసీలకు రిజర్వేషన్లు ఎంత శాతం పెరిగినట్లు? రాష్ట్ర జనాభాలో దాదాపు 60 శాతానికి పైగా ఉన్న వీరికి పెరిగిన 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం బీసీ కులాలకు కేటాయిస్తే, ఇక మిగిలింది 32 శాతం. బీసీ కులాలవారికి ఇప్పుడున్న 27 శాతంతో పోల్చితే ఎంత శాతం పెరిగినట్లు? కేవలం 5 శాతం మాత్రమేనా? మరి ఈ బీసీ కుల సంఘాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నట్లు? ఇప్పుడు బీసీలలో చేర్చిన ముస్లిం కులాల వారు మైనార్టీ సంక్షేమం పేరుతో కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 శాతం రిజర్వేషన్లలో ఇప్పటికే వీరంతా రిజర్వేషన్లు పొందే అవకాశం ఉండగా కొత్తగా బీసీ-ఈలో కూడా వీరు రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఈ కొత్త వివాదానికి ఎందుకు తెరతీసినట్లు?
కేవలం ఓట్ల కోసమే..
వాస్తవానికి ముస్లింలు కూడా తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఏ రోజూ బహిరంగంగా డిమాండ్ చేసిన సందర్భాలూ లేవు. ఇప్పుడు జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఉదాహరణలు కూడా అంతగా లేవు. ఈ విషయంలో వారిని తప్పు పట్టాల్సిన అవసరం కూడా అంతగా లేదు. ఎందుకంటే ప్రభుత్వమే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామంటుంటే వారెందుకు వ్యతిరేకిస్తారు? కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రతిపక్షాల కంటే తమకే చిత్తశుద్ధి ఎక్కువుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గంపగుత్తగా ఓట్లు వేయించుకోవాలని మాత్రమే దీనిపై రాజకీయాలు చేస్తుంది. ఇప్పటికైనా బీసీ కులాల ప్రజలు వాస్తవాలను గ్రహించాలని ఒక బీసీ వ్యక్తిగా అభిలషిస్తున్నాను. కుల సంఘాల నాయకులు సైతం రాజకీయ పార్టీలు ఆడుతున్న జగన్నాటకంలో పాత్రధారులు కాకుండా ఏ రాజకీయ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో గ్రహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లకపోతే రాబోయే తరాలు కూడా క్షమించవనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
-శ్యామ్ సుందర్ వరయోగి
98669 66904






