- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసాధారణ ప్రగతిశీల నటుడు..బలరాజ్ సాహ్నీ
బలరాజ్ సహ్నీ అసాధారణ నటుడు, అత్యంత సామాన్యుడు. అర్థవంతమైన వ్యక్తిత్వం కలవాడు, పైగా గొప్ప కళాకారుడు

బలరాజ్ సహ్నీ అసాధారణ నటుడు, అత్యంత సామాన్యుడు. అర్థవంతమైన వ్యక్తిత్వం కలవాడు, పైగా గొప్ప కళాకారుడు, తన కెరీర్‌లో సామాన్యుడి పాత్రను ఎంతో నైపుణ్యంగా పోషించిన నటుడు. తనకిచ్చిన పాత్ర రైతు, కూలీ, ఉద్యోగి, రిటైర్డ్ తండ్రి, కాలచక్రంలో చిక్కుకున్న ఓ అసహాయ వృద్ధుని పాత్ర ఏదైనా కావచ్చు.. ఆయన ఆ ప్రతి పాత్రలో జీవించి, ప్రపంచానికి గుర్తుండిపోయారు..
బలరాజ్ సహ్నీ అనగానే ధర్తీ కే లాల్ (1946), దో బీఘా జమీన్ (1953), చిన్న చెల్లి (1959), కాబూలీవాలా (1961), వక్త్ (1965), గరం హవా (1973) గుర్తొస్తాయి.. బెంగాల్ కరువు విషాదాన్ని చిత్రీకరించిన తొలి సినిమా ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో 1946లో వచ్చిన ధర్తీ కె లాల్ (భూమి పిల్లలు) ఈ సినిమాను ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (IPTA) నిర్మించింది. IPTA ఒక వామపక్ష సంస్థగా, సమాజంలో సాంస్కృతిక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పడింది. అందులో ప్రధాన భూమికను పోషించిన వాడు బలరాజ్ సహ్నీ.
గ్రామీణ జీవితానికి దర్పణం..
బిమల్ రాయ్ దర్శకత్వంలో 1953లో వచ్చిన దో బీఘా జమీన్ చిత్రం గొప్ప సినిమా.. ఒక హృదయ విదారకమైన దృశ్యంతో ప్రారంభమవుతుంది. రైతులు ఆకాశం వైపు ఆత్రంగా చూస్తుంటారు. మేఘాలు కమ్ముకుంటూ ఉంటే రైతు లంతా ఒకచోట చేరతారు.. రెండు సంవత్సరాల కరువు అనంతరం, ఎండిన పొలాలపై చివరికి వర్షం కురిసే సూచనలు కనిపిస్తాయి. ఈ ప్రారంభ దృశ్యం ఒక్కటే ఆనాటి గ్రామీణ భారతదేశ జీవితంలో ప్రకృతి మీద ఉన్న ఆధారపాటు, ఆశ, భయం అన్నింటినీ మృదువుగానే కానీ తీవ్రంగా తెలియ జేస్తుంది. ఇందులోనూ ప్రధాన భూమిక బలరాజ్ సహ్నీదే. ఇందులో ఒక రైతు పాత్రలో ఆయన పోషించిన నటన అప్పుడప్పుడే భూమి కోల్పోతున్న రైతుల కథను, అప్పుల భారం, పరిశ్రమల పెరుగుదల వల్ల పడుతున్న కష్టాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ సినిమాకు ఓ గాఢమైన సంఘటనా రూపం ఇచ్చింది. ఈ సినిమా కోసం బలరాజ్ రైతుల మధ్య జీవిస్తూ, వారి ఇళ్లలో, పంటపొలాల్లో, పనిముట్ల మధ్య గడిపాడు. ఆయన పాత్ర సజీవంగా ఉండేందుకు ఒక రిక్షావాడి జీవితాన్ని అధ్యయనం చేసి, నగర వీధుల్లో రోడ్లపై కాలినడకన రిక్షా లాగుతూ సాధన చేశాడు..
అజరామర దృశ్యకావ్యం 'గరం హవా'
ఇక “గరం హవా” ఒక అజరామర దృశ్య కావ్యం.. భారతదేశం, పాకిస్తాన్ విభజన సమయంలో ప్రజలు ఎదుర్కొన్న భావో ద్వేగ కల్లోలాలు, ఆత్మ సంఘర్షణలను గుండెలని తడిపించేలా చిత్రీకరిస్తుంది. శక్తివంతమైన నటన, ఆకట్టుకునే కథనం, గుర్తుండిపోయే విజువల్స్‌తో కూడిన ఈ చిత్రం, దక్షిణాసియా ఆధునిక చరిత్రలోని అత్యంత ప్రాధాన్యమైన సంఘటనలలో ఒకటి. విభజన ప్రజలపై వేసిన మానవీయ వ్యథను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా.. గరం హవాలో బాలరాజ్ సహ్నీది ప్రధాన పాత్ర.. తన మాతృదేశాన్ని ప్రేమించేవాడు, కుటుంబ బాధ్యతల మధ్య తికమక పడే తండ్రి, భర్తగా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఈ మూడు సినిమాలు బలరాజ్ సాహ్నీ నటనా ప్రతిభను తారాస్థాయిలో చూపిస్తాయి.
నటనకు మారుపేరు ఈ సినిమాలు..
బలరాజ్ సహ్నీ తన సినీ ప్రయాణాన్ని ఇన్సాఫ్ (1946), దూర్ చలేన్ (1946) వంటి చిత్రాల్లో చిన్నపాటి పాత్రలతో ప్రారంభించారు. బలరాజ్ సహ్నీ ఆపై చేసిన చిత్రాల్లో ఫిల్మిస్తాన్ సంస్థకు చెందిన బద్నామ్ (1952), మన్మోహన్ ఫిల్మ్స్‌కి చెందిన ఆకాశ్ (1953), కె.ఎ. అబ్బాస్ రాహీ (1953), ఆశా బిస్వాస్ నిర్మించిన బాజూబంద్ (1954) వంటి సినిమాలు ఉన్నాయి.. అనంతరం, ఔలాద్ (1954), సీమా (1955), గర్మ్ కోట్ (1955) వంటి సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారు. అలాగే కఠ్‌పుత్లీ (1957), పర్దేసీ (1957), భావి (1957), లజ్వంతి (1958), చిన్న చెల్లి (1959), సత్తా బజార్ (1959), హీరా మోతి (1959), నయీ మాం (1960), అనురాధ (1960), భావి కీ చూఢియన్ (1961) వంటి సినిమాలు కూడా ఆయన ప్రతిభను చూపించాయి..
కాబూలీ వాలాలో పఠాన్ పాత్ర
1961లో హేమెన్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘కాబూలీవాలా’ చిత్రంలో ఆయన ఒక పఠాన్ పాత్ర పోషించాడు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 1892 కథ ఆధారంగా తీసిన చిత్రం. ఇందులో మన్నాడే పాడిన ఐ మేరే ప్యారే వతన్, హేమంత్ కుమార్ పాడిన గంగా ఆయే కహాన్ సే వంటి గొప్ప పాటలు ఉన్నాయి.. దీనికి సంగీతాన్ని సలీల్ చౌధురీ అందించారు. 1960 తరువాత, బలరాజ్ సహ్నీ ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్‌నే పోషించాడు. బలరాజ్ సహ్నీ నట జీవితాన్ని చూస్తే, తనకు నటన పట్ల ఉన్న అవిశ్రాంతమైన నిబద్ధత కనిపిస్తుంది. గరం హవా డబ్బింగ్ పూర్తయిన కొద్ది రోజులకే, 1973 ఏప్రిల్ 13న, బలరాజ్ సహ్నీ గుండెపోటుతో మరణించాడు.. అప్పటికి ఆయన వయసు 59 ఏళ్లు. గరం హవాలోని ఆయన నటనకు విశేష ప్రశంసలు వచ్చాయి.. ఇది ఆయనకు ఒక స్వాన్ సాంగ్‌గా నిలిచిపోయింది.
- వారాల ఆనంద్
94405 01281






