బలగం.. ఇది తెలంగాణ ‘ఆత్మ’

by Disha Web Desk 17 |
బలగం.. ఇది తెలంగాణ ‘ఆత్మ’
X

సినిమా ఎలా ఉండాలి ముఖ్యంగా తెలుగు సినిమా ఎలా ఉండాలి అంటే దానికి కొన్ని లెక్కలు ఫిక్స్ చేసి పెట్టారు. ఇక్కడ గట్టి డైలాగ్ పడాలి. ఇక్కడ ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇక్కడ హీరో ఇంట్రడక్షన్.. పాటల చిత్రీకరణ ఈ దేశంలో.. క్లైమాక్స్ గ్రాండ్ గా ఇక్కడ ప్లాన్ చేయాలని ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. ఎవరి అభిమానులు వాళ్లకున్నారు. ఎవరి కథలు వాళ్లకు ఫిక్స్ అయిపోయాయి. ఇటువంటి పిచ్చి కథలు చూడలేక.. బలవంతంగా చూస్తున్న తెలుగు ప్రేక్షకుడికి ఎప్పుడైనా ఓ సారి కచ్చితంగా కోపం వస్తుంది. మాకు ఇటువంటి సినిమాలు వద్దురా..! ప్లీజ్.. మాకు మా కథను వినిపించిండి.. మేం అనుభవించే వేదనను చూపించండి.. మా పల్లెటూర్లు, మా సంస్కృతి, మా పద్ధతులు చూపిండ్రా అని ప్రేక్షకుడు మనసులో గట్టిగా ఎన్నో సార్లు అనుకుంటాడేమో.. కానీ ఆ మొర దర్శకుల, కథల చెవులకు ఆనదు.

కానీ మొట్టమొదటి సారి ఓ అద్భుతం జరిగింది. జబర్దస్త్ కామెడీ షోలో నటించే నటుడు.. తనలో దాగున్న ప్రతిభను బయటకు తీశాడు. తెలంగాణ ఆత్మను పట్టుకున్నాడు. ఇక్కడి పల్లెటూర్ల పలవరింతను చిత్రీకరించాడు. మధ్యతరగతి జీవితాల అనుబంధాలను ఒడిసి పట్టాడు. బలగం అనే సినిమా నిజమైన తెలంగాణ పల్లెటూరి జనం చరిత్ర. వందల ఏళ్లు గడిచాక కూడా మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఇలా బతికారని అప్పటి పిల్లలు చెప్పుకునే ఓ గొప్ప అవకాశం ఈ సినిమా ఇచ్చింది.

కొందరు గోదావరి జిల్లాల పేరెన్నికగల దర్శకులు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానాన్ని ఎంత నీచంగా చూపించారో ఇంత కాలం చూశాం. కత్తులు పట్టుకొని వీర విహారం చేసే అసహజ సన్నివేశాలను భరించాం. భారీ క్లైమాక్స్ లు, శ్రుతి మించిన సంభాషణలు వద్దన్నా మన చెవిన పడ్దాయి. కానీ ఇప్పుడు వేణు అనే ఓ దర్శకుడు వచ్చిండు.. ఓ చరిత్ర సృష్టించిండు. గురజాడ కన్యాశుల్కం రాసినట్టు.. శ్రీశ్రీ మహాప్రస్థానం రాసినట్టు.. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసిండు. బలగం చూసి ఏడ్వకండి.. బిగ్గరగా నవ్వండి.. ఇంత గొప్ప సినిమాను మనకు అందించినందుకు వికటాట్టహాసం చేయండి. ఇదో కొత్త చరిత్ర. తెలంగాణ పల్లె పలుకుబడులను గోరటి వెంకన్న ప్రపంచానికి పరిచయం చేస్తే. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చూపించిండు వేణు. బుడగ జంగాల పాటలు, చావు నేపథ్యం, నటీనటుల ఎంపిక అన్నీ అద్భుతమే.. ఆ నేపథ్య సంగీతం అయితే గుండెలను పిండేస్తుంది.

అరవింద్ రెడ్డి మర్యాద

81793 89805






Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed