జీవితమే నాటకమై.. నాటకమే జీవితమైన బబ్బన్ ఖాన్

by Ravi |   (  Updated:2026-05-02 01:00:51  IST  )

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు బబ్బన్ ఖాన్ జీవిత గాధ, ఆయన సృష్టించిన ‘అద్రక్ కే పంజే’ నాటకం విశ్వవ్యాప్తంగా సాధించిన విజయాలు, సమాజాన్ని నవ్వుల్లో ముంచెత్తిన ఆయన కళా ప్రయాణం గురించి..

జీవితమే నాటకమై.. నాటకమే జీవితమైన బబ్బన్ ఖాన్
X

ఇరవై రెండేళ్ల వయసులో వీధి దీపం కింద కూచుని మూడు గంటల వ్యవధిలో తాను అనుభవించిన కష్టాలు, కన్నీళ్లను నాటకంగా మలచినవాడు బబ్బన్ ఖాన్. ఆ నాటకం పేరు 'అద్రక్ కే పంజే'. 1965 నుండి 2001 వరకు ఈ నాటకం విశ్వ రంగస్థలంపై అలరించి పది వేలకు పైగా ప్రదర్శనలతో లక్షలాది ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలా అరుదైన కళాకారుడు ఏప్రిల్ 17న 83వ ఏట హైదరా బాద్‌ లోని శాంతి‌నగర్‌లో కన్ను మూశారు.

పాతికేళ్ల క్రితమే ఆ నాటక ప్రదర్శన ఆగిపోవడం వల్ల ఈ తరానికి ఆయన గురించి తెలిసే అవకాశం తక్కువే. హైదరాబాద్‌లోని పేద ముస్లిం కుటుంబంలో బబ్బన్ ఖాన్ 1943లో పుట్టాడు. ఆయన కన్నా ముందు పుట్టిన ఆరుగురు పిల్లలు పౌష్టికాహార లోపంతో పసివాళ్లుగానే చనిపోయారు. ఇతను కూడా బతుకుతాడనే నమ్మకం లేక ఆయనకు పేరు పెట్టలేదు.. ముద్దుగా బబ్బన్ అని పిలుచుకొనేవారు. పదేళ్లు బతికాక అదే పేరు ఖాయం అయింది.

చుట్టూ ఉన్న సందర్భాలను ఎంచుకుని..

పోస్టాఫీసులో పని చేసే తండ్రి, బబ్బన్‌కు ఆరేళ్లు ఉన్నపుడే చనిపోయాడు. చదువు ముందుకు సాగని దశలో బబ్బన్ చిన్న చిన్న పనులు చేస్తూ సమాజాన్ని పరిశీ‌లించేవాడు. తమాషా మాటలతో నలుగురిని నవ్వించే‌వాడు. చివరకు తన హాస్యం వెనుక ఉన్న విషాదాన్నే హైదరాబాదీ ఉర్దూలో నాటకంగా మలిచాడు. తన చుట్టూ ఉన్న జీవితాల్లోంచి, పరిసరాల్లోంచి సందర్భాలను ఎంచుకొని నాటక సన్నివేశాలను కూర్చుకున్నాడు. ఆనాటి సామాజిక వ్యంగ్యమే 'అద్రక్ కే పంజే' విజయానికి ఆయువు పట్టు. అల్లం కొమ్ములు అడ్డదిడ్డంగా పెరగడాన్ని నేటి సమాజపు పోకడకు అన్వయించేలా నాటకానికి ఆ పేరు పెట్టాడు.. బ్యాంక్ క్లర్క్ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ నాటకంలో బబ్బన్ ప్రధాన పాత్రధారి. భార్య, పిల్లల, ఇంటికి వచ్చి పోయేవాళ్ల పాత్రలను ఆయన కుటుంబ సభ్యులే వేసేవారు.. బబ్బన్ ఖాన్ సమకాలీన సమాజంపై వేసే సెటైర్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవి. ఆయన ఆ రోజుల్లో వాడిన వ్యంగ్య సంభాషణలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు..

జీవితాన్ని మార్చిన నాటకం..

ఆయన స్థిరమైన స్క్రిప్ట్ లేకుండా ఏ రోజుకారోజు కొత్త విషయాలను చేర్చుకుంటూ నాటకాన్ని నిత్య నూతనంగా మలిచేవాడు.. షోకు ముందే పాత్రధారులందరిని కూచోబెట్టి ఆ రోజు చేయబోయే మార్పుల గురించి వివరిం‌చేవాడు. రోజుకో కొత్త రూపంలో వచ్చే నాటకాన్ని చూసినవారే మళ్లీ చూసేవారు. ఈ నాటకం తొలి ప్రదర్శన కోసం బబ్బన్ ఖాన్ తన తల్లి మెడలో ఉన్న చిన్నపాటి బంగారు నగని అమ్మేయవలసి వచ్చింది. అలా చేతికొచ్చిన 275 రూపాయలు హాల్ కిరాయి, నటుల ఆహార్యం, టికెట్ల ముద్రణలకే సరిపోలేదు.. కొంత ఉద్దెరలు పెట్టి సెప్టెంబర్ 1965లో నాటకాన్ని రవీంద్ర భారతిలో తొలి ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఒకే రోజు వరుసగా రెండు షోలతో 'అద్రక్ కే పంజే' ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అలా రెండు నెలల పాటు ప్రదర్శన కొనసాగింది. ఆ రోజు నుంచి బబ్బన్ ఖాన్ దశ తిరిగిపోయింది. ఆయన జీవితమే నాటకమై సుమారు 35 ఏళ్ల పాటు ప్రపంచ నాటక ప్రియులను నవ్వుల్లో ముంచెత్తింది.

మన చార్లీ చాప్లిన్..

అప్పటికే ఈ నాటక ప్రదర్శనలు 60 దేశాల్లో 14 భాషల్లో 10 వేలకు పైగా కొనసాగాయి. 1984లోనే అయిదు వేలకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఆనాటి సినిమా హీరోలకు సమానంగా మీడియాలో బబ్బన్‌కు గౌరవం లభించేది. 'అద్రక్ కే పంజే' సినిమా హక్కుల కోసం వచ్చిన వారిని ఆయన వెనక్కి పంపారు. కోరినప్పుడు తన డైలాగులు వినేందుకు వీలుగా నాటకాన్ని ఆడియో క్యాసెట్ల రూపంలో తెచ్చాడు. 2001లో ప్రదర్శనలు ఆపేశాక హైదరాబాద్‌లో ఇంట్లోనే తన పేరిట యాక్టింగ్ అకాడమీని ఆరంభించి నటనలో శిక్షణ ఇస్తూ వచ్చారు.. సింగిల్ హ్యాండ్‌తో ఓ నాటకాన్ని దిగ్విజయ బాటలో నడిపించిన బబ్బన్ నిజంగా ఓ లెజెండ్. పేదరికంలోని వేదనని, సమాజంలోని చెడును నవ్వుల గుళికలో అందించిన బబ్బన్ ఖాన్ మన 'చార్లీ చాప్లిన్'.

- బద్రి నర్సన్

94401 28169

Next Story