- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ వ్యతిరేకులకు మంచి మేత దొరికినట్లేనా?
అయోధ్య రామ మందిర నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో భక్తుల విశ్వాసం, ట్రస్ట్ బాధ్యత, రాజకీయ పరిణామాలు, హిందూ సమాజం అప్రమత్తత అవసరంపై ఈ విశ్లేషణాత్మక అభిప్రాయ వ్యాసం చర్చిస్తుంది.

శ్రీరామునిపై భక్తితో, విశ్వాసంతో రామ భక్తులు అయోధ్య రామ మందిర నిర్మాణానికి, నిర్వహణకు సమర్పించిన నిధులు దుర్వినియోగం కావడం దేశంలో పెద్ద చర్చ నీయాంశమైంది. ప్రపంచంలోని యావత్ హిందూ సమాజాన్ని ఈ సంఘటన బాధించిందంటే అతిశయోక్తి కాదేమో! ఈ విషయంలో నిగ్గు తేల్చడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం, నిధులను దారి మళ్లించడానికి కారకులైన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేయడం చక చకా జరిగిపోయింది.
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో సభ్యుడు అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహించి, తమ పదవులకు రాజీనామా చేసి, దర్యాప్తు అధికారులకు సహకరించడం ఒక కొసమెరుపు. రామ భక్తుల నమ్మకం ముందు, విశ్వాసం ముందు ఇది ఒక కంటితుడుపు చర్యే! అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఉద్యోగులుగా ఉంటూ, ఈ దుర్మార్గానికి పాల్పడటాన్ని హిందూ సమాజం జీర్ణించుకోలేకుంది.
నిధుల దుర్వినియోగంపై వ్యతిరేకత మూలాలు..
రామమందిరం కోసం 500 సంవత్సరాలు హిందువులు పోరాటం చేశారు. ఇందుకోసం 72 యుద్ధాలు చేశారు. అనేక మంది హిందువులు అయోధ్య రాముడి కోసం అసువులు బాసిన చారిత్రిక సంఘటనలు దేశంలోని నేటి హిందూ యువతకు తెలియనే తెలియదు. అయోధ్య రామమందిర ఉద్యమం విజయవంతం కావడానికి దేశంలోని అనేక పార్టీల కార్యకర్తలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించారని విషయం మాత్రం వాస్తవం! అయోధ్య రామ మందిర నిధుల దుర్వినియోగంపై రామ భక్తుల కంటే రామున్ని వ్యతిరేకించే వాళ్ల బాధలు, కోపతాపాలు, ఆందోళనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వాస్తవంగా వీళ్లు ఎవరు కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక పైసా కూడా ఇవ్వలేదు.
ఈ పార్టీలు వ్యతిరేకించాయి!
అయోధ్య రామ మందిర నిధి సేకరణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అనేక విధాల నోరు పారేసుకున్నారు. 'భద్రాచల రాముడు మనకుంటే అయోధ్య రాముడు ఎందుకు 'అంటూ వెట కారంగా వ్యాఖ్యలు చేశారు. అయినా హిందువులు వారి మాటలను పట్టించుకోలేదు. అయోధ్య రామ మందిరం ఉద్యమంలో వీళ్ళందరూ హిందూ సమాజానికి వ్యతిరేకంగా నిలిచారు. అయోధ్యలో రామ మందిరాన్ని ధ్వంసం చేసి, దాని స్థానంలో బాబ్రీ కట్టడాన్ని నిర్మించారనే విషయం పురావస్తు శాఖ అధికారులు తేల్చినా, పక్షపాత ధోరణితో వ్యవహరించారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న యూపీఏ ప్రభుత్వం 'రామాయణం ఒక మిథ్య' అంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించి తన హిందూ వ్యతిరేక మానసిక స్థితిని బహిరంగ పరచుకున్నది.
హిందూ సమాజం తప్పులకు అతీతం కాదు..
జెరూసలేంలో తమ తమ ప్రార్థనా మందిరాల కోసం యూదులు, క్రైస్తవులు, ముస్లింలు అనేక యుద్ధాలు చేసు కున్నారు. లక్షల మందిని చంపుకున్నారు. లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ వ్యతిరేక హిందువులు ఈ విషయాన్ని మతోన్మాద కోణంలో చూడరు గాక చూడరు. హిందువులకు శ్రీరాముడిపై ఉండే భక్తిని, నమ్మకాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం వినియోగించుకోవడం క్షమించరాని నేరం. ఇలాంటి దోషులకు న్యాయ సహకారం అందించరాదని, అలాంటి పనికి ఎవరైనా సాహసిస్తే ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించబడుతుందని ఫైజాబాద్ బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం చేయడం ఒక చారిత్రిక పరిణామం. తప్పులు చేసి, చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని, తప్పించుకోవచ్చు అనే భావన ఉన్నవాళ్లకు ఇలాంటి నిర్ణయాలు భయం పుట్టిస్తాయి. దేవుడిపై ఆస్తికులకు ఉండే నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకు కొంతమంది స్వార్థపరులు ప్రణాళికలు అల్లుతారు. అయోధ్య రామ మందిరం నిధుల దుర్వినియోగం ఇలాంటిదే. మానవ సమాజంలో ఇటువంటి పరిణామాలు సహజం. ఇందుకు హిందూ సమాజం అతీతంగా ఉండాలని కోరుకోవడంలోనే అత్యాశ ఉంది. ఇక రాముని పైన, హిందుత్వం పైన హిందూ సంస్కృతిపైన హిందువులు ఏర్పరచుకున్న అచంచల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమే క్షమించరాని నేరం. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని హిందూ సమాజం కోరుకుంటుంది.
మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం...
ఇక చివరగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాష వారీగా విడిపోయిన హిందువులను అయోధ్య రామ మందిరం ఉద్యమం, నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సంఘటితపరిచింది. రాజకీయ క్షేత్రమైన బీజేపీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందిన విషయం కాదనలేని సత్యం. కుహనా లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయకులకు ఈ విషయంలో కడుపు మంటగా ఉంది. హిందూ రాజు జయ చంద్రుడు పృథ్వీరాజ్‌పై ఏర్ప రచుకున్న రాజకీయ కక్షతో విదేశీయుడైన మహమ్మద్ ఘోరీతో చేతులు కలిపి పృథ్వీరాజును అంతం చేసి, ఈ దేశంలో ఇస్లామిక్ పరిపాలనకు నాంది పలికినాడనే చారిత్రక సంఘటనను హిందువులు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని బేస్ చేసుకుని, హిందూ సమాజాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతాయి.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం..
అయోధ్య రామ మందిర నిధుల దుర్వినియోగం విషయంపై సిట్ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే కొంతమంది లాయర్లు సీబీఐ ఎంక్వైరీ జరపాలని సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు ఆలోచనత్మకంగానే వారికి సరైన సమాధానం చెప్పింది. 2027లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు నిధుల దుర్వినియోగ విషయాన్ని హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయకులు హిందువుల ముందుకు తెచ్చి, హిందూ సమాజాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. హిందూ వ్యతిరేక శక్తులను సమీ కరించి, హిందువులకు వ్యతిరేకంగా నిలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయంలో దేశ హితాన్ని కోరే సంస్థలు, ముఖ్యంగా హిందుత్వ సంస్థల ప్రతినిధులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877






