- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ మందిర విరాళ వివాదం..
అయోధ్య రామమందిర ట్రస్టుపై వెలువడిన ఆరోపణలు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పాత్ర, విరాళాల నిర్వహణపై తలెత్తిన ప్రశ్నలు, జరుగుతున్న విచారణ, పారదర్శకత అవసరంపై విశ్లేషణాత్మక కథనం.

దాదాపు 500 సంవత్సరాలుగా సాగిన న్యాయపోరాటం.. అయోధ్యలో బాల శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు మార్గం సుగమం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రచారం పొందిన అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు భారతీయులందరూ స్వాగతం పలికారు. కానీ రెండున్నర సంవత్సరాల లోపే ఆలయ ట్రస్టు నిర్వహణలో తీవ్ర లోపాలు బయటపడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. న్యాయస్థానం అక్కడ జరిగిన అవకతవకలను, నగదు, ఆభరణాల చోరీని ఎలా విచారించి తీర్పు చెబుతుందన్నది ఇప్పుడు ప్రశ్న.
వివాదంలో చంపత్ రాయ్ ..
రామ జన్మభూమి ఉద్యమంతో దశాబ్దాలుగా మమేకమైన చంపత్ రాయ్, నేడు విరాళాల అవినీతి ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు. 79 ఏళ్ల వయసున్న ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, సీనియర్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా దశాబ్దాలుగా తెర వెనుక కీలక పాత్ర పోషించారు. 2019 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా నియమితులై, ఆలయ నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు, యాత్రికుల నిర్వహణకు ఆపరేషనల్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. తక్కువ ప్రొఫైల్ ఉన్న నిర్వాహకుడి నుంచి ఆలయ ప్రాజెక్ట్‌కు అత్యంత గుర్తించదగిన ముఖంగా మారిన ఆయన ఇప్పుడు న్యాయస్థానం ముందు, ప్రజల ముందు జవాబుదారీగా నిలబడాల్సి వచ్చింది.
ప్రస్థానం..
ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్ జిల్లా నాగినాలో జన్మించిన రాయ్, రసాయన శాస్త్రం అభ్యసించి లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత పూర్తికాల సంఘ్ ప్రచారక్‌గా మారి VHPలో చేరారు. దశాబ్దాల పాటు సాగిన రామ్ జన్మభూమి ప్రచారంలో సంస్థాగత సమన్వయం, డాక్యుమెంటేషన్, చట్టపరమైన, మతపరమైన, పరిపాలనా భాగస్వాములతో సంప్రదింపుల్లో ఆయన పాత్ర కీలకం. ప్రజాదరణ కంటే నిశితమైన ప్రణాళికకు ఆయన పేరుగాంచారు.
భూ లావాదేవీల వివాదం..
2021లో దేశవ్యాప్త విరాళాల సేకరణ కార్యక్రమం ద్వారా లక్షలాది భక్తుల నుంచి విరాళాలు సమీకరించారు. దీంతో ట్రస్ట్ కు సంబంధించిన వరుస భూ లావాదేవీలపై ప్రతిపక్షాలు, కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తారు. వరుస అమ్మకాల మధ్య భూమి ధరలు విపరీతంగా పెరగడంతో అవకతవకలు జరిగాయని ఆ రోపణలు వచ్చాయి. శ్రీ రాయ్ ట్రస్ట్ ప్రధాన ప్రజా రక్షకుడిగా ఉద్భవించి, లావాదేవీలు చట్టబద్ధమైనవని, స్వతంత్రంగా విలువ కట్టినవని, ఆలయ దీర్ఘకాలిక విస్తరణకు అవసరమని చెబుతూ ట్రస్టుపై వస్తున్న ఆరోపణలను పదేపదే తిరస్కరించారు.
తాజా విరాళాల చోరీ ఆరోపణలు..
ఆలయ ప్రతిష్ఠ జరిగిన రెండున్నర సంవత్సరాలకే, విరాళాల లెక్కింపులో రూ. 7 నుంచి 7.5 కోట్ల నగదు, ఆభరణాలు మాయమైనట్లు వార్తలు వచ్చాయి. కౌంటింగ్ రూమ్‌లో సీసీటీవీలకు అడ్డంగా నిలబడి చోరీ జరిగిందని, దాదాపు 79 లక్షల రూపాయల వరకు డబ్బులు రికార్డు చేయకుండా దొంగిలిం చారని పోలీసు వర్గాలు తెలిపాయి. నియామకాల్లో బ్యాక్‌గ్రౌండ్ చెక్ లేదని, బంధువులే సిబ్బందిగా చేరారని తేలింది. చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ రాకీ శంకర్ యాదవ్ కౌంటింగ్ టీమ్‌లో ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది.
ప్రస్తుత స్థితి..
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అనేక అరెస్టులు చేసింది. అయితే ఏ కోర్టు కూడా ట్రస్ట్ తప్పు చేసినట్లు ఇంకా నిర్ధారించలేదు. రాజీనామా ఊహాగానాలను వీహెచ్‌పీ తోసిపుచ్చగా, చంపత్ రాయ్ ఇప్పటివరకు మౌనం వీడలేదు. విరాళాల గురించిన తాజా ఆరోపణలు ఆయనను అవాంఛనీయ దృష్టిలోకి నెట్టాయి. కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రమైన రామ మందిరంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. నిష్పాక్షిక విచారణ జరిగి నిజాలు తేలితేనే ప్రజల నమ్మకం నిలుస్తుంది.
-ఇరికి మహేష్,
98661 35431






