సీపీఆర్‌పై.. అవగాహన అవసరం!

by Ravi |   (  Updated:2026-01-30 00:46:00  IST  )

నేటి సమాజంలో హార్ట్ అటాక్ అనేది వృద్ధులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. యువత, మధ్య వయసువారు, పిల్లలు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఇది కేవలం వైద్య సమస్య కాదు. ఇది ఒక సామాజిక అత్యవసర సమస్యగా మారింది. వైద్య నిపుణులు చెప్పే దాని ప్రకారం హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే సరైన సమయంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్) చేయగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువ..

సీపీఆర్‌పై.. అవగాహన అవసరం!
X

నేటి సమాజంలో హార్ట్ అటాక్ అనేది వృద్ధులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. యువత, మధ్య వయసువారు, పిల్లలు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఇది కేవలం వైద్య సమస్య కాదు. ఇది ఒక సామాజిక అత్యవసర సమస్యగా మారింది. వైద్య నిపుణులు చెప్పే దాని ప్రకారం హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే సరైన సమయంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్) చేయగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువ..

ఇంత బాధ్యతా రాహిత్యమా?

సీపీఆర్ అనేది గుండెపోటు లేదా శ్వాస ఆగిపోయిన అత్య వసర స్థితిలో ప్రాణాలను రక్షించే ప్రాథమిక వైద్య ప్రక్రియ కానీ దురదృష్టవశాత్తు, మన సమాజంలో సీపీఆర్‌పై అవగాహన చాలా తక్కువగా ఉంది. ఎవరైనా కుప్పకూలినప్పుడు ప్రజలు సహాయం చేయకుండా భయంతో, అయోమయంలో నిలబడిపోతున్నారు. కొందరు వీడియోలు తీయడంలో నిమగ్నమవు తున్నారు. మరికొందరు ‘ఏం చేయాలో తెలియదు’ అంటూ విలువైన నిమిషాలను వృథా చేస్తున్నారు.. ఈ నిర్లక్ష్యమే అనేక ప్రాణ నష్టాలకు కారణమవుతోంది.

గోల్డెన్ అవర్.. ప్రాణరక్షణ సమయం..

హార్ట్ అటాక్ తర్వాత మొదటి ఒక గంటను వైద్యులు “గోల్డెన్ అవర్”గా పేర్కొంటారు. ఈ కీలక సమయంలో సీపీఆర్ ప్రారంభమైతే, వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తే, బాధితుడు మళ్లీ సాధా రణ జీవితానికి చేరుకునే అవకాశముంది. కానీ అవగాహన లేనందున ఆ గోల్డెన్ అవర్ మన చేతుల మధ్యనే జారిపోతోంది. సీపీఆర్ అవసరం కేవలం హార్ట్ అటాక్‌లకే పరిమితం కాదు.. వైద్య నిపుణుల ప్రకారం, కరెంట్ షాక్ తగిలి వ్యక్తి స్పృహ కోల్పోయి శ్వాస ఆగిపోయిన పరిస్థితిలో, పరిసరాలు సురక్షితంగా ఉన్నట్లయితే సీపీఆర్ చేయవచ్చు.. అయితే ముందుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడం అత్యంత ముఖ్యం.

సీపీఆర్ ఎలా చేయాలి..

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్స్. ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలితే ఈ విధంగా చేయాలి. స్పందన ఉందా లేదా చూడాలి. వ్యక్తిని పిలిచి, భుజాన్ని మెల్లగా కదిలించి స్పందిస్తున్నాడా చూడాలి. శ్వాస ఉందా లేదా పరిశీలించాలి. ఛాతీ కదులుతోందా శ్వాస వస్తోందా..? లేకపోతే వెంటనే చర్య తీసుకోవాలి. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి.. ఇది అత్యంత కీలకమైన దశ. ఛాతిపై ఒత్తిడి ఇవ్వాలి. బాధితుడిని సమానంగా ఉన్న నేలపై పడుకోబెట్టాలి. ఛాతి మధ్యభాగంపై రెండు చేతులు ఉంచి నిమిషానికి సుమారు 100–120 సార్లు 5–6 సెం.మీ లోతుగా ఒత్తిడి ఇస్తూ ఆపకుండా కొనసాగించాలి. శ్వాస ఇచ్చే పద్ధతి తెలిసి ఉంటే మాత్రమే ఇవ్వాలి.. తెలియని వారు కేవలం ఛాతి ఒత్తిడినే కొనసాగించినా సరిపోతుంది.

అవగాహన ఉద్యమంగా మారాలి!

ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ బాధ్యత మరింత అవసరం. పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ కలిసి సీపీఆర్‌పై విస్తృత అవగాహన కార్య క్రమాలు చేపట్టాలి.. పాఠశాలలు, కళాశాలలు, గ్రామ సభలు, బస్టాండ్‌లు, కార్యాలయాలు వంటి ప్రజలు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలి. సీపీఆర్ అనేది డాక్టర్లకే కాదు, ప్రతి సాధారణ పౌరుడికీ తెలిసి ఉండాల్సిన మౌలిక జీవన నైపుణ్యంగా మారాలి. ఇది ఖర్చుతో కూడిన కార్యక్రమం కాదు. కానీ దీని వల్ల లభించే ఫలితం అమూల్యమైనది ఒక మనిషి ప్రాణం. ప్రభుత్వం మాత్రమే కాదు.. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి సీపీఆర్ అవగాహనను ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సీపీఆర్ ఒక జీవన రక్షణ విద్య. ఇప్పుడు నేర్చుకోకపోతే తర్వాత పశ్చాత్తాపమే మిగులుతుంది.

-మలిపెద్ది పవన్ కళ్యాణ్

70930 52815

Next Story