ఇదీ సంగతి: అమృత్ కాల్‌లో అమృతం ఏది?

by Disha edit |
ఇదీ సంగతి: అమృత్ కాల్‌లో అమృతం ఏది?
X

దేశంలో అమృత కాలం గురించి ఊదరగొడుతున్నారు. కానీ అమృతం ఏది? ఎన్నికలు,అధికారం ఇదేనా అమృత కాలం? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాయి? ఎంతమందికి న్యాయం జరిగింది? ఇవి ప్రశ్నల మీద ప్రశ్నలు.. ఎన్నో సమస్యల వలయంలో భారత్ కొట్టుమిట్టాడుతోంది. దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్నీ ఎంతో అద్భుతంగా జరుపుకున్నది. ఇదే సందర్భంలో రేపిస్టులను, హంతకులను కూడా విడుదల చేసారు. దేశమంతా ఒక్కటై మద్దతుగా నిలిచిన బిల్కీస్ బానో కేసులో దోషులను శిక్ష పూర్తి కాకుండానే విడుదల చేస్తే, అడిగే వారు లేరు అనే పరిస్థితి వచ్చింది.పెగసిస్, రఫేల్ కుంభకోణాల మీద మాట్లాడనీయరు, రోహింగ్యాల సమస్య లేవదీసి నానా రభస మొదలు పెట్టారు. ఒక్క విషయాన్నీ పార్లమెంట్‌లో చర్చకు విపక్షాల కు అవకాశం ఇవ్వరు, ఏండ్ల తరబడి ఉద్యోగాల భర్తీలను పరీక్ష పేపర్ల లీకేజీల పేరిట జాప్యం చేస్తూ, పరీక్షలను రద్దు చేస్తూ నిరుద్యోగులతో ఆటాడుకుంటున్నారు. ఆందోళనలను ఉక్కు పాదంతో అణిచివేస్తారు. ఎవరికీ జవాబుదారీ లేదు.

ప్రాజెక్టుల్లో జాప్యం.. ఆర్థికభారం

ఈ నేపథ్యంలో అభివృద్ధిని చూస్తే అదీ చక్కగా లేదు. ఆర్డర్లో లేదు.. ఆలస్యం అనర్థం అంటారు. నిజమే దేశంలో.. పలు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల ఆలస్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు దాటింది. గత ఏడేండ్లలో నోట్ల రద్దు నుంచి పాటించిన ఆర్థిక విధానం దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. కేంద్రం మొత్తం ఏడేండ్లలో మొత్తం 1788 ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో 985 ప్రాజెక్ట్స్ ఇంకా మొదలు కాలేదు. 525 ప్రాజెక్ట్స్ పనులు నత్తనడకన కొనసాగుతుండగా 124 మరీ ఆలస్యంగా ప్రారంభించారు.

183 ప్రాజెక్ట్స్ 25 నుంచి 60 నెలలు ఆలస్యంగా, 119 ప్రాజెక్టులు ఐదేండ్లు ఆలస్యంగా ప్రారంభించారు. రూ.22 లక్షల 86 వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా ఆలస్యం వల్ల మెటీరియల్ రేట్లు పెరిగి 27 లక్షల కోట్ల 27 వేల కోట్ల రూపాయలకు పెట్టుబడి అంచనా పెరిగింది. 15వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్‌లో ప్రాజెక్ట్‌ల ఆలస్యం భారం స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. గతంలో ప్రాజెక్టుల విషయంలో ప్రజలను మభ్యపెట్టి తప్పుదారి పట్టించడం.. ఎక్కడికక్కడ ఫైల్స్ నిలిపి ఉంచడం కాంగ్రెస్ హయాంలో జరిగిందనీ, తమ హయాంలో ప్రతి మిషన్ ప్రజామోదంతోనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మాదిరి ప్రస్తుతం క్షేత్ర పరిస్థితి లేదు. ఆచరణకు, మాటలకు... మబ్బుకు, భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఆలస్యం ఎన్ని అనర్థాలకు కారణమో పరిస్థితులు చూస్తుంటే అర్ధం అవుతుంది.

ఆత్మనిర్బర్‍తో అప్పులు దొరకలే..

ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా రుణాలు ఇచ్చినా మార్కెట్.. ఉత్పత్తి.. డిమాండ్ లేకుంటే పరిస్థితులు ఎలా బాగుపడుతాయి? ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిన తర్వాత రుణాలు ఇవ్వడం వల్ల బ్యాంకులపై భారం పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. 2000 కంపెనీలు దివాళా తీశాయి. ఆత్మనిర్బర్ తర్వాత అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంక్‌లలో రుణాలు భారీ స్థాయిలో మాఫీ చేయడం లాంటి విధానాల వల్ల బ్యాంకులు సైతం దివాళా తీసిన పరిస్థితి ఉంది. సీఎంఐఈ ఏప్రిల్ 2020-21 లెక్క ప్రకారం 18 కోట్ల మంది నిరుద్యోగులు దేశంలో ఉన్నారు.

ఈ ఏడాది జనవరి నెల ప్రారంభంలో మాత్రమే కోటిన్నర నిరుద్యోగులు పెరిగారు. ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు తప్ప ఇతరులు టాక్స్‌లు చెల్లించే పరిస్థితి లేదు. తమ జీతంలో సగం శాతం టాక్స్‌కే పోతోందని తన ఊరిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అప్పట్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతికి టాక్స్ మినహాయింపు ఉంటుంది... దేశంలో వసూలు అవుతున్న టాక్స్‌లలో 70 శాతం ఉద్యోగులు.. ప్రభుత్వంలో ఉన్నవారిపై, ప్రజా ప్రతినిధులపై ఖర్చు చేస్తున్నారు.

అదే సమయంలో 40 కోట్ల మధ్యతరగతి ప్రజల పరిస్థితి విషమంగా ఉంది. బ్యాంకులలో డిఫాల్టర్లు పెరిగారు. 75 శాతం ప్రభుత్వం గ్యారంటీ కట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా జాబ్స్ వచ్చే అవకాశం లేదు. 70 వరకు పరిశ్రమలు భారీ నష్టాల్లోకి వచ్చేసాయి. రూ.31.635 కోట్లు ప్రభుత్వం వద్ద తీసుకున్న రుణాలను అవి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తంగా దేశంలో 7 లక్షలపై చిలుకు పరిశ్రమలు మూతపడ్డాయి. కాన్ఫిడెన్స్ ఎకానమీ 60 శాతం పడిపోయింది. ట్రావెల్ ఏజెంట్‌లకు ఒక లక్ష చొప్పున రుణం ఇవ్వడానికి ప్రభుత్వం గతంలో సిద్ధం కాగా వాపసు ఇవ్వడం ఉండదంటేనే లోన్ తీసుకుంటామన్నారు మెజారిటీ గైడ్లు.. అంటే ప్రజల జీవన పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో అర్థం అవుతుంది. 37 శాతం సామాన్యుల పరిస్థితి పని లేక సంపాదన దారుణంగా పడిపోయింది.

దేశంలో 80 కోట్ల పేదలు

తాజా రిపోర్టులో 23కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ కిందికి వచ్చేసారు.పేదల సంఖ్య 80 కోట్లు దాటింది. 10మంది పిల్లల్లో ఒకరు చైల్డ్ లేబర్ అయ్యారు. రివైవల్ ప్యాకేజీ ఇవ్వాలి గాని రుణాలు దేనికంటూ కాస్తోకూస్తో ఈ దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న చిన్నా పెద్దా పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం డిమాండ్ లేని సందర్భంలో ఇన్వెస్ట్ మెంట్ దేనికనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. చిత్తశుద్ది లేని పొలిటికల్ పార్టీ నేతల మూలంగా చీకటిలో వెలుగును వెతుక్కునే పరిస్థితికి జనం వచ్చారు. చేతిలో చిల్లి గవ్వలేదు ఏమి కొనే పరిస్థితి లేదు. చిన్న చిన్న వ్యాపారులు దివాళా తీశారు. ప్రాధాన్యత గల ప్రోజెక్టుల నిర్మాణం పూర్తి అయ్యే పరిస్థితి లేదు... కమీషన్లు పుచ్చుకోవడం, ఎన్నికల్లో భారీగా నిధులు సేకరించే అవసరం దృశ్యా ప్రాజెక్టులు పూర్తి కాకున్నా వాటి నిర్మాణ వ్యయాన్ని మాత్రం పెంచుకుంటూ పోవడం షరా మామూలు అయిపోయింది..

అవినీతిలో ప్రజాప్రతినిధులు టాప్

ఇంత దుబారా చేస్తూ ప్రశ్నిస్తున్న వారిపై తీవ్ర నిర్బంధాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి.. అసమానతలను ఇంకా పెంచుకుంటూ పోతున్న పార్టీలకు ప్రజలు చరమ గీతం పాడే రోజుల కోసం ఎదురు చూడాలి. ఓటర్లు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకుంటే ఐదేండ్లు ఇబ్బందులు పడక తప్పదు. గత అనుభవాలను ఓటర్లు కూడ గుణ పాఠాలుగా తీసుకోవాలి. ప్రజా ప్రతినిధుల్లో సగం మంది క్రిమినల్స్ ఉన్నారు. ఇందులో బీజేపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. కేంద్ర మంత్రుల్లోను కేసులు ఉన్నవారు సగం మంది ఉన్నారు. ఇటీవల బీహార్‌లో న్యాయశాఖ మంత్రి క్రిమినల్ కేసులో ఉన్నారని వివాదం చెలరేగింది. అవినీతి కేసులలో వివిధ రాష్ట్రాలలో మంత్రులు అరెస్ట్ అయ్యారు. కొందరు ఇంకా జైళ్లలో ఉన్నారు. నిజానికి కేసులలో లేనివారు, ఆరోపణలు లేని క్లీన్ చిట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉన్నారని వెతకాల్సిన సమయం ఇది! బుద్ధి జీవులారా బి అలర్ట్!

ఎండీ. మునీర్

సీనియర్ జర్నలిస్ట్.. విశ్లేషకులు

9951865223

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

భాషాపండితుల వెతలు తీరేదెప్పుడో?


Next Story

Most Viewed