రాజకీయ భజనపరులు ఉన్నంతవరకు.. మాతృభాషపై శీతకన్నే

by Ravi |   (  Updated:2025-06-08 00:45:49  IST  )

వెల్చేరు నారాయణ రావు గతంలో బెజవాడ వచ్చి ఒక సాహిత్య ప్రసంగం చేసిన తదనంతర౦ జరిగిన చర్చ సమయంలో..

రాజకీయ భజనపరులు ఉన్నంతవరకు.. మాతృభాషపై శీతకన్నే
X

వెల్చేరు నారాయణ రావు గతంలో బెజవాడ వచ్చి ఒక సాహిత్య ప్రసంగం చేసిన తదనంతర౦ జరిగిన చర్చ సమయంలో.. తెలుగు భాషకు తెలుగు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని ప్రస్తావించి మీ లాంటి పెద్దలయినా ప్రభుత్వాలకు కాస్త బుద్ధి వచ్చేట్లు చెప్పండి అని కోరాను.. ఆయన అందుకు ఎలాంటి ప్రతిస్పందనను ప్రకటించలేదు కానీ ప్రభుత్వాల భజనపరులు నాపై గయ్యిమని లేచారు..ప్రాథమిక విద్య నుండి మాతృభాషా మాధ్యమం అవసరం లేదనే పాలకుల నిర్ణయం అజ్ఞానంతో తీసుకున్నది కాదు.. ప్రస్తుతానికి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం మాత్రమే సాగుతుండగా దాన్ని కోట్ల కోట్లకు పెంచటమెలా? అనే వ్యూహాత్మక పథకం లేకుండా అది మొదలు పెడతారని ఎవరమూ అనుకోలేం.

సాంస్కృతిక పరాయీకరణ వల్ల..

ఇంగ్లీష్ మాధ్యమం చదువుల వల్ల తొలిగా నష్ట పోయింది సంపన్న కుటుంబాల వారి సంతానమే. అయితే అంతిమంగా బడుగు వర్గాలే ఎక్కువ నష్ట పోతారు. ఎందుకంటే పని తెలిసిన వాడికి చదువు రాకున్నా బతుకు సమస్య ఉండదు. ఈ రోజు అమెరి కాలోనూ, మనదగ్గరా కొందరు తెలుగు సంపన్న కుటుంబాల భాషా తాపత్రయం వెనకాల వారికి తెలిసినా తెలియకున్నా సాంస్కృతికంగా పరాయీకరించబడిన ఇటీవలి తరాల జీవన సంక్షోభం వుంది. వ్యక్తులుగా ఆ సంక్షోభం నుండి కొందరయినా తప్పించుకోగలుగుతారేమో కానీ వ్యవస్థను పాలకులు పనిగట్టుకు దిగజార్చడం తప్ప మరొక విధంగా మలచలేరు. వాళ్లు కూరుకు పోయిన ధన సంస్కృతి జాతి జాతినే బలి కోరే స్వభావం కలది. ఈ అడ్డగోలు ధన సంపాదనాపరులు తమ సంతానం తమ కళ్ల ముందే పతనమయి పోతున్నా, ఆఖరికి దానికి బలిపశువులయిపోతున్నా వారు దాని నుండి వెనుకకు రాలేరు.. మేధావులు ప్రజలను మేల్కొలపడానికి పూనుకోకపోతే ఇది మరింత వినాశనానికి దారితీస్తుంది.

ఇంగ్లీష్ సరిగా రాని కారణం..

నిజానికి ఏ ఒక్క భాష బాగా వచ్చినా ఇతర భాషలు కూడా సులువుగానే వస్తాయి. అందునా మాతృభాష రావటం మరింత సులువు కదా.. ఇప్పటి పిల్లలకు ఇంగ్లీషు అయినా బాగా వస్తే మనం సంతోషించమా? కానీ ఇంగ్లీష్ సరిగా రాకపోవడానికి గల ఒక ముఖ్య కారణం, మాతృభాషను దూరం చేసుకుని పరాయి భాషను సమగ్రంగా నేర్చుకోకపోవడమే. ఈ సత్యాన్ని పాలకులకు కమ్మిన ధనస్వామ్యపు పొరలు చూడనివ్వవు. ఇప్పటికయినా తిక్కన ప్రబోధించినట్లు దక్షులెవ్వారాలుపేక్షసేతురో వారల చేటగు గాక అన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహిస్తే నూతన చైతన్యానికి నాంది పలికి నట్లవుతుంది. దక్షులందరూ భీష్మ పితామహులుగా మిగిలిపోతే ముందు ముందు ఒక మహా విధ్వంసాన్ని చవి చూడవలసి ఉంటుంది.

తెలుగుకే అగ్రతాంబూలం

'పదవుల కోసం, పురస్కారాల కోసం దేబిరిస్తూ రాజకీయ నాయకుల కొమ్ముకాచే సాహిత్యవేత్తలుఉన్నంతవరకు మనం చేయగలిగింది ఏమిటి? తెలుగు ప్రజలున్న రాష్ట్రంలో తెలుగుకే అగ్రతాంబూలమన్న కనీస జ్ఞానం కూడా లేని వారితో ఎలా వేగాలి.' అని మిత్రులు రాళ్లపల్లి సుందరం గారు వ్యక్తపరిచిన ఆవేదన అందరినీ ఆలోచింప చేయాలి.

- దివికుమార్

94401 67891

Next Story