కరిగిపోతున్న మఖ్మల్ కల!

by Ravi |   (  Updated:2026-07-01 01:00:44  IST  )

ఆరుద్ర కార్తె, తొలి వర్షాలు, మట్టిలోంచి వెలిసే ఎర్రటి మఖ్మల్ పురుగులు, వాటితో ముడిపడిన బాల్య జ్ఞాపకాలు, అలాగే భూతాపం, కాంక్రీట్ నిర్మాణాలు, రసాయనాల ప్రభావంతో వాటి మనుగడ ఎలా ప్రమాదంలో పడిందో చెప్పే కథనం.

కరిగిపోతున్న మఖ్మల్ కల!
X

జూన్ నెల వచ్చిందంటే చాలు, ఆకాశం మబ్బులతో నల్లగా ముసురుకునేది. వేసవి ఎండలకు మలమలలాడి, నెరలు చాలిన నేల తల్లి, తొలి వర్షపు జల్లులకు తడిసి 'ఘుమఘుమ'లాడే మట్టి వాసనను పంచుతుంటే మనసంతా ఏదో తెలియని సంబరం. పెద్దలంతా "ఆరుద్ర కార్తె వచ్చేసింది.. ఇక వానలు గట్టిగా పడతాయి, నాగళ్లు కట్టొచ్చు" అనుకుంటుంటే పిల్లల కళ్లూ, ఆలోచనలూ నేల వైనే ఉండేవి. ఎందుకంటే, ఆరుద్ర కార్తె వచ్చిందంటే చాలు.. మట్టి గర్భంలోంచి ‘మఖ్మల్ పురుగులు’ భూమిపైకి వస్తాయి!

ఏడాది పొడవునా.. దాదాపు పదకొండు నెలల పాటు భూమి పొరల్లో ఎవరికీ కనిపించకుండా నిద్రాణంగా ఉండే ఆ చిన్ని ప్రాణాలకు, తొలి వాన చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఆ ఒకరకమైన ప్రకంపనలే ప్రకృతి ఇచ్చే అలారం. ఆ పిలుపు అందుకోగానే అవి వేలాదిగా ఒకేసారి పైకి వచ్చేవి.

బాల్యంలో వర్షం వస్తే..

ఒకరోజు ఉదయం వాన వెరిసి, లేత ఎండ పొడసూపింది. అంతే, వీధిలోని బాల్యమంతా ఒకరినొకరు కేకలు వేసుకుంటూ చేతిలో ఖాళీ మ్యాచ్ బాక్సులతో (అగ్గిపెట్టెలతో) బయలుదేరేవాళ్లం. తోటల్లో, పొలాల్లో ఉన్న తడిసిన ఎర్రమట్టిపై వాటిని వెతికేవాళ్లం. ఇక్కడ ఒకటి దొరికింది!" అనే కేక వినబడగానే అందరం అటువైపు పరుగెత్తేవాళ్లం. అక్కడ, పచ్చటి గడ్డి పరకల మధ్య, నిగనిగలాడే ఎరుపు రంగులో, మెత్తటి స్పాంజ్ లాంటి చర్మంతో ఒక అందమైన ఆరుద్ర పురుగు మెల్లగా పాకుతూ కనిపించేది. దున్నిన పొలాల్లో అవి నడుస్తుంటే.. పచ్చటి చీరకు ఎర్రటి మఖ్మల్ బుట్టాలు అద్దినట్లు, నేలతల్లి ఎర్రటి తివాచీ పరుచుకున్నట్లు ఉండేది. దాన్ని తాకితే అచ్చం 'మఖ్మల్' (వెల్వెట్) గుడ్డను తాకినట్టే ఉండేది. ప్రకృతి దానికి ఎంత చక్కటి రంగును ఇచ్చిందో కదా అని ఆ వయసులో ఆశ్చర్యపోయేవాళ్లం. దాన్ని చేతిలోకి తీసుకుంటే, అది అరచేతిలో మెల్లగా నడుస్తుంటే కలిగే ఆ గిలిగింతలు.. అదో అద్భుతమైన అనుభూతి!

రోజంతా జేబులో పెట్టుకుని..

ఆ వెంటనే జేబులోంచి ఖాళీ అగ్గిపెట్టె తీసి, దాన్ని జాగ్రత్తగా అందులోకి చేర్చేవాళ్లం. దానికి ఆకలి వేస్తుందనే అమాయకపు ఆలోచనతో, తోటలోంచి పచ్చటి, లేత గడ్డి పరకలను కోసి, ఆ మ్యాచ్ బాక్స్ లోపల బెడ్‌లాగా పరిచే వాళ్లం. ఆ గడ్డిని తింటూ అది హాయిగా ఉంటుందని మా గట్టి నమ్మకం. రోజంతా ఆ అగ్గిపెట్టని జేబులోనే పెట్టుకుని తిరగడం, అప్పుడప్పుడు తెరిచి చూసుకుని మురిసిపోవడం ఆ రోజుల్లో ఒక పెద్ద వ్యాపకం. సాయంత్రం కాగానే వీధి అరుగుల మీద కూర్చుని, అందరూ బాక్సులు తెరిచి, ఎవరి ఆరుద్ర పురుగు పెద్దగా ఉందో, ఎవరిది ఎక్కువ ఎర్రగా ఉందో పోల్చి చూసుకుంటూ సంబరపడి పోయేవాళ్లం. ఆ పురుగులను నేలపై వదిలి, అవి మెల్లగా పాకుతుంటే వాటి వెనకాలే నడవడం ఒక సరదా ఆట. అవి ఎప్పుడూ కుట్టేవి కావు, హాని చేసేవి కావు.. కేవలం అమాయకమైన సంతోషాన్ని పంచేవి.

నిశ్శబ్దంగా మాయమైన మఖ్మల్ ప్రపంచం...

కానీ కాలం గిర్రున తిరిగింది. మనం పెరిగి పెద్దయ్యాం.. మనం పెరిగే కొద్దీ సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ జంగిళ్లు విస్తరించాయి. వానలు పడుతున్నా, ఒకప్పుడు వర్షానికి సంకేతంగా కనిపించే ఆరుద్ర పురుగులు ఇప్పుడు కనిపించడం లేదు. మన బాల్యపు జ్ఞాపకాల్లాగే అవి కూడా నిశ్శబ్దంగా కనుమరుగయ్యాయి. మానవ ప్రగతి ప్రకృతి గొంతును ఎలా నొక్కేసిందో చెప్పడానికి వాటి అంతర్థానమే ఒక నిదర్శనం. కాంక్రీట్ నిర్మాణాల వల్ల ఆ పురుగులు వాన పిలుపును వినలేక, కాంట్రిక్ పొరలను చీల్చుకొని బయటకు రాలేక లోపలే అవి సమాధి అవుతున్నాయి. ఇక రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల ప్రభావంతో అవి నశించిపోతున్నాయి. పైగా అవి తినే చిన్న చిన్న పురుగులు నశించడంతో ఆరుద్ర పురుగులు అంతరించిపోతున్నాయి.

తప్పిన కాలచక్రం..

భూతాపం వల్ల వర్షాల కాలం మారిపోతోంది. కాంక్రీట్ నిర్మాణాలు, కాలుష్యం, రసాయనాల వాడకం వల్ల ఆరుద్ర పురుగుల మనుగడ ప్రమాదంలో పడింది. అభివృద్ధి పేరుతో వాటి నివాసాలను నాశనం చేశాం, ఆహారాన్ని విషపూరితం చేశాం. మనం దీనిని ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విప్లవం, ఆధునికత అని పిలుస్తున్నాం. కానీ ఈ "ప్రగతి" సాధించడానికి మనం చెల్లించిన ధర.. మన బాల్య స్నేహితుల నిశ్శబ్ద వినాశనం! అందుకే ఒకప్పుడు వర్షానికి సంకేతంగా కనిపించిన ఈ ఎర్రటి పురుగులు ఇప్పుడు జ్ఞాపకాలకే పరిమితమయ్యాయి. ఈ రోజుల్లో పిల్లల చేతుల్లో అగ్గిపెట్టెలు లేవు.. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాళ్లకు "మఖ్మల్ పురుగు" అంటే తెలియదు. రేపు వానలు కురిసినా, తడి మట్టి పరిమళించినా, ఆరుద్ర పురుగులు మాత్రం మన బాల్యానికి చెందిన ఓ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతాయి.

- రమణాచారి

99898 63039

Next Story