- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరవై దాటిందా.. మీ కోసం బతకండి!
వ్యాపారస్తులైనా సరే, ఉద్యోగాలు నిర్వహించే వాళ్లయినా సరే.. పెరుగుతున్న వయస్సుకు విలువ ఇవ్వాలి. శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులైనా సరే, ఉద్యోగాలు నిర్వహించే వాళ్లయినా సరే.. పెరుగుతున్న వయస్సుకు విలువ ఇవ్వాలి. శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఒకరిమీద ఆధారపడకుండా జీవించే అవకాశం ఉంటుంది. కష్టపడేంత వరకు కష్టపడ్డారు, ఇక చాలు అరవై దాటిందా.. మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు! ఎందుకంటే టెన్షన్ పెట్టుకుంటే సాధించే విషయాలు తర్వాత.. ముందుగా అర్యోగం పాడవుతుంది, లేనిపోని ఖర్చులు ఎదురవుతాయి, కుటుంబానికి భారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నో సాధించాలని కలలు కని ఉంటారు.. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు సహకరించనప్పుడు మీరు చేసేది ఏమీ లేదు.. ఉన్నంతలో సర్దుకుపోవడం, అత్యాశలకు లోనవకుండా ఉండడమే... కాలం అన్నింటికి సమాధానం ఇస్తుంది..
మీకు మీరుగా బతికేయడమే..
ప్రభుత్వ ఉద్యోగులకైతే రిటైర్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది.. వ్యాపారస్తులకు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ఉండదు. అందుకే మీకు అరవై దాటిందా మీకు మీరుగా రిటైర్మెంట్ ప్రకటించుకోండి.. మీ బరువు బాధ్యతలు వచ్చే తరాలకు అప్పగించండి, వాళ్లు ఏం చేస్తారో, ఎలా చూస్తారో అనే దిగులు అవసరం లేదు, ఉన్న కష్టాలు, బాధలు అన్నింటినీ తీసేయండి.. మీకు మీరుగా బతకండి.. .తర్వాత జీవితం ఆనందంగా గడిపేయవచ్చు. మీ స్వంత పనులు చేసుకుంటూ ఉండి.. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బతకండి.. ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు మీకు సమయం అనేది తెలియకుండా పోతుంది.. ఆ సమయంలోనే హడావుడిగా జీవితాన్ని గడిపేశారు.. ఇంకా మీ పనులు ప్రశాంతంగా నిదానంగా సాగించండి.. మరో ప్రపంచంలోకి అడుగు వేయండి..
మనకోసం జీవించే గొప్ప అవకాశం..
కుటుంబం కోసం, సమాజం కోసం కాకుండా మన కోసం మనం జీవించే గొప్ప అవకాశం రిటైర్మెంట్. మనుమలు, మనుమరాళ్లతో సరదాగా ఉండండి, వాళ్లలో ఉండే లోపాలను గ్రహించండి, వారికి మంచి నడవడికను అలవాటు చేయండి, బంధుమిత్రులతో కలివిడిగా ఉండండి, ఆర్థికపరమైన వాటి విషయాలలో దూరంగా ఉండండి, ఆర్థికపరమైన లావాదేవీలు, మంచి చెడు అన్ని విషయాలను భావితరాలకు అప్పగించేసేయండి, ఆర్థిక లావాదేవీలు ఎదురైతే కొడుకులు, కోడళ్లను లేదా కూతుర్లకు, అల్లుండ్లను అడగండి. కొన్ని విషయాలలో చూసి చూడనట్టు వదిలేయండి. అప్పుడే మీ పెద్దరికాన్ని మరింత వన్నె తెచ్చిన వాళ్లు అవుతారు, మీ మనస్సు లో అశాంతి చేరకుండా ఉంటుంది.
పరిమితులు విధించుకోవాల్సిందే...
ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు చూడని, చూడలేని ప్రపంచాన్ని నింపాదిగా చూడండి, ఆస్వాదించండి. పార్కుల్లో మొక్కలు నాటండి, వాటిని పరిరక్షించండి, మీరు పెంచే చెట్ల వలన పూలు, కాయలు, పండ్లు వస్తే అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి, ఇతరులకు ఉపయోగపడుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు అవసరాలన్నీ కూర్చున్న చోటికి రావాలనుకోకండి. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి ఎదుటివారి మీద ఆధారపడకండి, దాహం వేస్తే వెళ్లి తాగండి. నీరు ఒలికితే తుడవండి. కళ్లజోడు కనపడక పోతే వెతుక్కోండి. ఏదైనా వస్తువు కావాలంటే వెళ్లి తెచ్చుకోండి. చేతనైతే, చేయనిస్తే, చిన్నపాటి ఇంటి పనులు చేయండి. ఇకపోతే, ఖర్చుతో కూడుకున్న కాలయాపన అంటారా ..పెండింగ్ పెట్టిన సొంత పనులు, ఇంటి పనులు, తీర్థయాత్రలు, దేశ, విదేశీ యాత్రలు లాంటివి కోకొల్లలు.. మీకు ఆకాశమే హద్దు. జీవితం చాలా అందమైంది. అంతకన్నా ఎంతో విలువైంది. బతకడం కాదు, జీవించాలి. జీవిస్తూ బ్రతకాలి.... ఉన్నది ఒక్కే ఒక్క జిందగీ...
డాక్టర్. వై. సంజీవ కుమార్,
93936 13555






