లంబాడీలు వలసవాదులా.. స్థానికులా? బంజారాల వాస్తవ చరిత్ర

by Ravi |   (  Updated:2025-09-21 01:16:10  IST  )

భారతీయ సమాజంలో తరతరాలుగా వివక్షకు, అపోహలకు గురైన వర్గాల్లో బంజారాలది ఒక ప్రత్యేకమైన చరిత్ర. ఒకప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యంలో పోరాడిన వీరులుగా, తర్వాత మొఘలుల దాడులకు అడవులు పట్టిన

లంబాడీలు వలసవాదులా.. స్థానికులా? బంజారాల వాస్తవ చరిత్ర
X

భారతీయ సమాజంలో తరతరాలుగా వివక్షకు, అపోహలకు గురైన వర్గాల్లో బంజారాలది ఒక ప్రత్యేకమైన చరిత్ర. ఒకప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యంలో పోరాడిన వీరులుగా, తర్వాత మొఘలుల దాడులకు అడవులు పట్టిన అభాగ్యులుగా, ఆపై బ్రిటీష్ పాలనలో 'క్రిమినల్ ట్రైబ్స్'గా ముద్ర వేయబడిన దొంగలుగా, నేటి సమాజంలో వలసవాదులుగా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? చట్టం, చరిత్ర ఏం చెబుతున్నాయి? ఈ విషయాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..

ఒకే భాష, ఒకే రకమైన తండా జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, వస్త్రధారణ కలిగి ఉన్న గోర్ బంజారాలను బ్రిటిష్ ఇండియా కాలంలోనే గిరిజనులుగా గుర్తిం చారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారు. అయితే ఈ గోర్ బంజారాలు దేశంలోని వివిధ ప్రదేశాల్లో వేరువేరు తెగ పేరుతో ఉండటం వల్ల వారిని ఒకే వర్గంగా చేర్చడంలో సమస్యలు తలెత్తాయి. అందుకే వీరందరూ దేశంలోని వివిధ ప్రదేశాల్లో గిరిజన తెగగా కాకుండా ఇతర వర్గాల్లో ఉంటూ కటిక దరిద్రాన్ని, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అంతే కాని మొదటి నుండి గోర్ బంజారాలు గిరిజనులు కాదని అనడం సత్యదూరం.

వ్యాపారస్తులను.. దొంగలుగా చిత్రీకరించి

1857 సమయంలో దేశంలోని ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, వేష భాషలు కలిగి ఉన్న బంజారాలు వ్యాపారం చేసేవారు. బ్రిటీష్ వారు భారతదేశ సంపదను వారి దేశానికి తరలించడానికి రైలు మార్గాలు, జాతీయ రహదారులు వేయడానికి పూను కున్నారు. నాడు బంజారాలు ప్రయాణించిన మార్గాలే రైలు మార్గాలుగా, జాతీయ రహదారులుగా ఏర్పడ్డాయి. దీంతో వీరి వ్యాపారం పూర్తిగా దెబ్బతిని వారి జీవనమే కష్ట తరమైంది. అయితే దేశ సంపదను ఆంగ్లేయులు రైళ్లు, జాతీయ రహదారుల ద్వారా తరలించడం మొదలుపెట్టాక బంజారాలు వాటిపై దాడి చేసి ఆ సంపద దేశ సరిహద్దులు దాటకుండా అడ్డగించేవారు. సంపదను తరలించడం కష్టంగా భావించిన ఆంగ్లేయులు, వారిపై కక్షగట్టిన బ్రిటీషులు భారత గోర్ బంజారాల తండా వ్యవస్థను దెబ్బతీసి, తండా నాయక్‌ల మధ్య చిచ్చు పెట్టి, జాతి ఐకమత్యాన్ని దెబ్బతీస్తూ, ఎదిరించిన వారిని కట్టడి చేయడానికి నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం వారిని క్రిమినల్స్‌గా చిత్రీక‌రించి ‘క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఆఫ్ 1871’ జాబితాలో చేర్చి దొంగలుగా చిత్రీకరించి హింసించారు. దీని ద్వారా క్రిమినల్ ట్రైబ్స్‌గా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత లంబాడీలనే కాదు, మొత్తం భారత బంజారాలను నాటి బ్రిటిష్ ప్రభుత్వమే గిరిజనులుగా గుర్తించింది.

చట్టపరమైన వివక్ష

మద్రాసు ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంత సుగాలీలు/లంబాడీలను ఎస్టీల జాబితాలో చేర్చారు. అయితే, అప్పటి హైదరాబాద్ సంస్థానంలో 13 గిరిజన తెగల్లో లంబాడీలు గిరిజన తెగగా ఉన్నప్పటికీ, భారత యూనియన్‌లో విలీనం కాకపోవడం వల్ల హైదరాబాద్ సంస్థాన ప్రాంత లంబాడీలను భారత యూనియన్‌లో గిరిజన జాబితాలో చేర్చలేదు. అయితే బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్‌గా నోటిఫై చేసిన తెగలను భారత ప్రభుత్వం డి-నోటిఫై చేసి ‘డి-నోటిఫైడ్ ట్రైబ్స్ (DNT)’ అనే కొత్త గిరిజన జాబితాను రూపొందించింది. ఎస్సీ/ఎస్టీలతో సమానం గా అభివృద్ధి చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జాబితాలో లేని లంబాడీలను డీఎన్టీ జాబితాలో చేర్చి విద్య, ఉద్యోగాల్లో హక్కులను కల్పించాయి. ఉమ్మడి రాష్ట్రంలో వీరందరూ ఒకే రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ, ఆంధ్ర ప్రాంత సుగాలీలు/లంబాడీలు గిరిజనులుగా, తెలంగాణ ప్రాంత లంబాడీలు డినోటి‌ఫైడ్ ట్రైబ్స్ (DNT)గా, ఆపై 1975లో వెనుకబడిన తరగతులుగా 20 సంవత్సరాలు వివక్షకు గురయ్యారు. ఈ వివక్షను తొలగించడానికి లూనావత్ నర్సింగ్ నాయక్, వాగ్యా నాయక్, రమణీబాయి, స్వామీ నాయక్ మొదలైన వారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు.

వలసవాదులా.. స్థానికులా?

ఆ ఉద్యమాల ఫలితంగా, భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి కొన్ని కులాలు, జాతులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని, తీసివేయాలని వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించడానికి అనిల్ కే చంద్ర సారథ్యంలో 33 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి జాయింట్ పార్లమెంటు కమిటీని (JPC) నియమించారు. ‘ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్లు-1976’ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత లంబాడీలు డిఎన్టీలుగా, అదే రాష్ట్రంలోని అదే సామాజిక వర్గానికి చెందిన బంజారాలు/ సుగాలీలు గిరిజనులుగా ఉండకూడదని, అలా ఉన్న వారిని ఎస్టీ వర్గంలో ఉండే విధం గా బిల్లు తెచ్చారు. ఈ బిల్లు ద్వారా తెలంగాణలోని లంబాడీలతో పాటు డీఎన్టీలుగా ఉన్న ఎరుకల, యానాదిలను కూడా నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేంద్ర కేబినెట్లో చర్చించి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా భారత రాష్ట్రపతి ఆమోద ముద్రతో గిరిజనులుగా గుర్తింపు పొందారు. ఈ బిల్లు తెలంగాణ లంబాడీలకు కొత్తగా కల్పించిన హక్కు కాదు, వారికి ఉన్న గిరిజన హోదాను పునరుద్ధరించడమే.

కలిసి పోరాడితేనే..

గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కేటాయించిన నిధులు సరిగా ఖర్చు కాకపోవడం, వలసవాదులు అనే ఆరోపణలతో వివిధ గిరిజన వర్గాల మధ్య చిచ్చుపెట్టడం వంటి చర్యలు వారి ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. లంబాడీలు తమ కష్టాలను అధిగమించి చదువుపై దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు ఉన్నత ఉద్యోగాలను, రాజకీయ పదవులను పొందగలుగుతున్నారు. దీనివల్ల వారి మధ్య ఐక్యత పెరిగి తమ హక్కుల కోసం నిలబడతారని భయపడిన పాలకులు 'విభజించు, పాలించు' సూత్రాన్ని పాటిస్తున్నారన్న ఆరో పణలు వస్తున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో గిరిజన సోదరులంతా కలిసి ఉండి, తమ హక్కుల కోసం పోరాడడం తప్ప మరో మార్గం లేదు. అప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుంది. దేశంలోని చివరి గిరిజనుడు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన భారత అభివృద్ధి జరుగుతుందని పాలకులు గుర్తించాలి.

-డాక్టర్ బాణోత్ నెహ్రూ

విశ్రాంత సూపరింటెండెంట్,

95023 61832

Next Story