- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశం కంటే.. రాజకీయ లాభం ముఖ్యమా?
ఈ దేశ ఉత్థాన పతనాల ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడం రాజకీయ అవగాహన లేని వారు చేసే పని. కానీ దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న వాళ్లకు మాత్రం ఆ పార్టీ సహజ నైజం బాగా అర్థం అవుతుంది.

ఈ దేశ ఉత్థాన పతనాల ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడం రాజకీయ అవగాహన లేని వారు చేసే పని. కానీ దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న వాళ్లకు మాత్రం ఆ పార్టీ సహజ నైజం బాగా అర్థం అవుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం విషయంలో లోక్‌సభలో ఆ పార్టీ ప్రదర్శించిన తీరును క్షుణ్ణంగా విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, మాట్లాడాలనే జ్ఞానం ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీకి లేక పోవడం ఈ దేశం దురదృష్టంగా భావించాలి. తాను ఈ దేశాన్ని 60 సంవత్సరాలు తిరుగులేని అధికారంతో పాలించిన నెహ్రూ కుటుంబానికి చెందిన రాకుమారు డనని, తాను ఏమి చెప్పినా అది చెల్లుబాటు అవుతుందనే మానసిక స్థితిలో ఆయన ఉన్నట్లు తన ప్రవర్తన తీరును బట్టి తెలుస్తుంది.
పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా కొనసాగిన వాజపేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధా నా లను అనుసరిస్తూ ఎంతో హుందాగా వ్యవహరించారు.. పార్లమెంటులో ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అనే విషయాలను వాళ్లు ఆచరించి చూపారు. సోమనాథ చటర్జీ లాంటి కమ్యూనిస్టు యోధులు సైతం ఇదే మార్గాన్ని అనుసరించారు. కానీ లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తున్న తీరు జుగుప్సకరంగా ఉంది. మాజీ ఆర్మీ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకంలోని విషయాలను ప్రస్తావించేటప్పుడు పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించకూడదు.. ముద్రించని పుస్తకంలోని విషయాలను స్పీకర్ అనుమతి లేకుండా ప్రదర్శించడం తప్పు.. రాహుల్ గాంధీ చేసిన ఈ తప్పు వల్ల పెంగ్విన్ ముద్రణ సంస్థ చట్టపరమైన ఉల్లం ఘనలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఏ దేశంలోనైనా జరిగేది ఇదే!
మోడీ ప్రభుత్వ విధానాలను నిరంతరం ద్వేషించే పత్రిక ‘కార్వాన్’. ఆ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రస్తావించడం వెనుక ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.. చైనాతో గాల్వాన్‌లో సంఘర్షణ ఎదుర్కొంటున్న సమయంలో చైనా యుద్ధ ట్యాంకులను ఎదుర్కోవడానికి సైన్యాధిపతి నరవణే రక్షణ మంత్రిని సలహా అడగడం, ఆయన ప్రధాన మంత్రికి వివరించడం ప్రధానమంత్రి సలహా మేరకు రక్షణ మంత్రి 'నిర్ణయం మీదే' అని చెప్పడం ఇందులో ఉన్న విషయం.. ఏ దేశంలోనైనా ప్రభుత్వం సరిహద్దుల్లో సంఘర్షణలు ఏర్పడిన సమయంలో పూర్తి అధికారాలను సైన్యానికి ఇస్తుంది. యుద్ధంలో ఏ ఆయుధాలు వాడాలి, ఎటువైపు వెళ్లాలి, శత్రువుల కదలికలను బట్టి ఏమి చేయాలి? అనే విషయాలను ప్రభుత్వం సైన్యానికి ప్రత్యేకంగా చెప్పదు.. గాల్వాన్ సంఘర్షణ సమయంలో మోడీ ప్రభుత్వం ఈ పనే చేసింది. దేశ భద్రతకు సంబంధించిన ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి, చైనా పాలకులకు భారతదేశ భద్రత విషయాలను తెలియజేయడంలో రాహుల్ గాంధీ సహకరించినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
తగినంత మద్దతు లేదని తెలిసినా..
ఇక లోక్‌సభలో ప్రధానమంత్రిని మాట్లాడనివ్వకుండా ముట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలను పురమాయించడం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఈ కుట్రను చేదించడంలో స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సమయస్ఫూర్తిని ప్రదర్శించినట్లు అర్థమవుతుంది. ప్రధానమంత్రిని అల్లరి పట్టించాలనీ, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ పక్ష ఎంపీలు భౌతిక దాడికి పాల్పడితే, మార్షల్ రావడం, లోక్‌సభలో గందరగోళం నెలకొనడం వంటి విషయాలు చోటు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆశించారు. కానీ వారి ఆశ నెరవేరలేదు.. అందుకే స్పీకర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు.. స్పీకర్‌ను తొలగించడానికి తమకు తగినంత మద్దతు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు..
అకారణంగా దూషణలకు పాల్పడితే..
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయని విమర్శకులు పేర్కొంటారు.. 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, స్వతంత్ర భారతదేశ ప్రధాని ఎంపిక సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఎక్కువ మద్దతు ఉన్నప్పటికీ జవహర్‌లాల్ నెహ్రూ ఎంపిక కావడం వంటి అంశాలు తరచూ చర్చకు వస్తుంటాయి.. ఇక దేశ విభజనపై కూడా కాంగ్రెస్‌పై అనేక విమర్శలు ఉన్నాయి. దేశంలో ఎవరైనా ఈ విషయంలో నోరు తెరిస్తే హిందూ మతోన్మాద ముద్ర వేసి వేధించడంలో ఆ పార్టీ నాయకులు ఆరితేరారు.. అందుకే ఆ పార్టీని అటు కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లో హిందువులు తిరస్కరించారు.. ఇక చివరగా, 2014 నుండి దేశ ప్రధానిగా మోడీ దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుంటే, ఆయనపై అనవసరంగా, అసంద ర్భంగా, అకారణంగా దూషణలకు పాల్పడే నాయకులకు ప్రజలు కీలెరిగి వాత బెట్టడం మాత్రం ఖాయం.
- ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877






