టీచర్లపై పర్యవేక్షణకు.. కొత్త మెషీన్లు అవసరమా?

by Ravi |   (  Updated:2025-06-21 01:00:44  IST  )

ఉద్యోగుల, ఉపాధ్యాయుల నిబద్ధత పనితీరును అంచనా వేయడానికి పర్యవేక్షణ చేయడానికి అనేక ప్రామాణిక అంశాలు ఉన్నాయి..

టీచర్లపై పర్యవేక్షణకు.. కొత్త మెషీన్లు అవసరమా?
X

ఉద్యోగుల, ఉపాధ్యాయుల నిబద్ధత పనితీరును అంచనా వేయడానికి పర్యవేక్షణ చేయడానికి అనేక ప్రామాణిక అంశాలు ఉన్నాయి.. అవి అనేక ఏండ్లుగా అమలులో ఉన్నాయి. అదే సమయంలో సాంకేతికత వినియోగించడం, అధికారుల పనిభారం తగ్గించడం, పూర్తిస్థాయి అక్యూరసీని అమలు చేయడం ఆహ్వానించదగినది. అయితే ఈ సమయంలో అందుబాటులో ఉన్న మెకానిజంను కాదని కొత్త యంత్రాల కోసం పరుగులు పెట్టడం మాత్రం అనుమానాస్పద అంశమే..

ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరీ దొంగలు అన్నంత రీతిలో ఒకదాని వెనుక ఒకటిగా ఇలాంటి ఖర్చుతో కూడుకున్న యంత్రాలను ప్రవేశ పెట్టడం అనేది అర్థం కాని సమస్య. జీతాలు భత్యాలు ఇవ్వడానికే చాలీచాలని బడ్జెట్‌లో పనికిరాని, అవసరం లేని, అక్కరకు రాని యంత్ర భూతాల కొనుగోలు ఎవరి కమీషన్ల కోసం అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. కాపలా పెంచడం మంచిదే.. అయితే పర్యవేక్షణ యంత్రాంగాన్ని భర్తీ చేయడం అనేది కేవలం హాజరు కోసం కాకుండా వ్యవస్థ లోపాలు లేకుండా, సరైన సమన్వయంతో పని చేయడం కోసం ఉపయోగపడాలి..

బయోమెట్రిక్ యంత్రాల నిలుపుదల..

వాస్తవానికి పర్యవేక్షణ అధికారుల కొరత గత ఎన్నో ఏండ్లుగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసే చర్యలు ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు.. గత ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలు ఇచ్చింది. వాటిలో హాజరు సరిగా నమోదు అవుతూనే వచ్చింది. సరిగ్గా ఎన్నికల ముందు ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఇబ్బందులు లేకుండా అకస్మాత్తుగా ఆపే శారు. వాటిని పునరుద్ధరణ చేయలేదు.. ప్రస్తుతం ఆ యంత్రాలు అన్ని ఎక్కడి స్కూల్లో అక్కడే ఉన్నాయి. మళ్లీ ఈ మధ్య జరిగిన ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాల్లో ఎవరి మొబైల్ ఫోన్ నుండి వారే జీపీఎస్ ట్రాక్ అయ్యే మాదిరిగా ఒక అప్లికేషన్ ద్వారా సెకండ్లతో సహా విజయవంతంగా హాజరు నమోదు చేశారు. అదీ కాకుండా విద్యార్థుల కోసం నిర్దేశించిన DRS-FRS అనే అప్లికేషన్ ఎలాగు ఉండనే ఉంది. దానిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని ఏండ్ల నుండి పిల్లల హాజరు నమోదు చేస్తూనే ఉన్నారు.

విస్తృతంగా అనధికారిక పర్యవేక్షణ

ఇక అనేక గూగుల్ ఫార్మ్స్, లింకులు, గూగుల్ షీట్లు, జూమ్ మీటింగులు ఎవరు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ఎరుక చేస్తూనే ఉన్నాయి. కాదు కూడదని అంటే కాంప్లెక్స్ పెద్దలు, మండల విద్యాధికారులు, స్పెషల్ అధికారులు, నోడల్ అధికారులు అన్ని పాఠశాలలను పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు.. కొన్ని జిల్లాల్లో ప్రార్థన సమయంలో ఫోటో తీసి జీపీఎస్ ట్రాక్ అయ్యే మాదిరిగా జిల్లా అధికారులకు గూగుల్ లింక్ ద్వారా పంపిస్తూనే ఉన్నారు.. అమ్మ ఆదర్శ పాఠశాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ వారు, ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాలు, పాత్రికేయులు, అన్నింటికి మించి పిల్లల తల్లిదండ్రులు ఇలా అనేక రకాలుగా అనధికారిక పర్యవేక్షణ జరుగుతూనే ఉన్నది.

పోస్టుల భర్తీనే అసలు పరిష్కారం..

ప్రభుత్వం, మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారి పోస్టులు, జిల్లాలలో అడిషనల్ ఛార్జ్‌గా ఉన్న పోస్టులు, హెడ్ మాస్టర్ పోస్టులు భర్తీ చేస్తే కోట్ల రూపాయల యంత్రాల కొనుగోలు ఆపివేయవచ్చు. వ్యవస్థను గాడిన పెట్టవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఉంటుంది. మనుషుల మీద నమ్మకం లేకపోతే సరే.. ప్రస్తుతం బూజు పెట్టిపోయి బడుల్లో ముసుగేసిన బయోమెట్రిక్ మిషన్లు, లేదా మొన్న ఉపాధ్యాయ శిక్షణకు వినియోగించిన జీపీఎస్ ట్రాక్డ్ మొబైల్ అప్లికేషన్ లేదా పిల్లల కోసం వాడే అప్లికేషన్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కానీ FRS అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పేరుతో కొత్త పనిముట్లు కొనడం అంటే కచ్చితంగా అనుమానంతో ఆలోచించాల్సిన అంశమే..

సంస్కరణలు మొదలు పెట్టాలనుకుంటే..

నిజంగా సరైన విధానంలో అందరితో పని చేయించాలని ప్రభుత్వం కనుక అనుకున్నట్లు అయితే, ఆ విధానం పై నుంచే అమలు చేయాలి. సంస్కరణలు చేస్తున్నట్టు ఊదరగొట్టిన ప్రభుత్వం ఎలాంటి మార్పులు లేకుండా విద్యా సంవత్సరం కేవలం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెంచుతూ, సమాజంలో చులకన చేస్తూ, నిందలకు గురి చేస్తూ ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నది. ఇది అభ్యంతరకరం. నిజంగా విద్యా నాణ్యత మీద, ప్రభుత్వ పాఠశాలల మనుగడ మీద చిత్తశుద్ధి కనుక ప్రభుత్వానికి ఉంటే వెంటనే పర్యావేక్షణకు సంబందించిన అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలి. ఉద్యోగులకు అడ్డంకిగా ఉన్న సర్వీసు నిబంధనలను సవరించి కొత్త వాటిని అమల్లోకి తీసుకురావాలి.

సీఎం తగు చర్యలు తీసుకుంటేనే...!

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి నుండి ఖర్చు ఆదా చేయడం అంటూ కాన్వాయ్ కొనలేదని, ప్రగతి భవన్ వద్దు సొంత ఇంట్లోనే ఉంటాను అని చెప్పినప్పుడు అందరూ ఆయన నిర్ణయాలను సమర్థించారు.. కానీ ఇప్పుడు అనేక ఇతర మార్గాలు ఉండగా ఫేషియల్ రికగ్నిషన్ యంత్రాలకు తెరతీయడం అనేక అనుమానాలకు తావు ఇస్తున్నది. ఈ యంత్రాల కొను’గోల్‌మాల్‌’ని ప్రభుత్వాధినేత సత్వరమే ఆపివేయించి ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక టీచర్లపై నిఘా ఆపివేసి.. పిల్లల విద్యాబుద్ధులు, సౌకర్యాలు, నిధులు, నియామకాల మీద, అడ్డగోలుగా నియమాలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ కార్పొరేటు సెక్టార్ మీద కొరడా ఝళిపిస్తే అప్పుడు దమ్మున్న నాయకుడు అని అనిపించుకుంటారు..

- రావుల రాజేశం

సోషల్ వర్కర్, జర్నలిస్ట్

77801 85674

Next Story