- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధ్యతలు కొండంత.. వేతనం అంతంత!
చిన్నారుల విద్య, పోషణ, గర్భిణులు, బాలింతల సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలు తీవ్ర పని భారం మధ్య తక్కువ వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక శిశువు జీవితానికి తల్లి తర్వాత తొలి గురువు అంగన్‌వాడీ టీచరే. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం, పోషకాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడం, పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించడం వంటి ఎన్నో కీలక బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ సర్వేలు, ఆన్‌లైన్ నమోదు, ఇంటింటి సందర్శనలు, టీకా కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర శాఖల విధులు కూడా నిర్వహిస్తూ తీవ్రమైన పని భారాన్ని భరిస్తున్నారు. ఉదయం ఇంటి పనులు పూర్తి చేసి అంగన్ వాడి కేంద్రానికి వెళ్లి పని గంటలకు పరిమితి లేకుండా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ, వారికి అందుతున్న గౌరవ వేతనం మాత్రం పెరుగుతున్న జీవన వ్యయానికి ఏమాత్రం సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు, రవాణా వ్యయాలతో చాలామంది అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇక అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే ఆయమ్మల పరిస్థితి మరింత క్లిష్టం. పిల్లలకు ఆహారం తినిపించడం, కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వంటపాత్రలు శుభ్రం చేయడం, చిన్నారులను తల్లిలా చూసుకోవడం వంటి శారీరకంగా కఠినమైన పనులు చేస్తున్న ప్పటికీ, వారికి లభిస్తున్న వేతనం అత్యంత స్వల్పం. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ సేవకులకు కేవలం ప్రశంసలు సరిపోవు.. ప్రభుత్వం గౌరవప్రదమైన వేతనా లు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత, పెన్షన్, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మల సేవలను గుర్తించి వారికి తగిన గౌరవం, ఆర్థిక భరోసా కల్పించినప్పుడే సమాజం ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన భావితరాన్ని నిర్మించగలదు.
-డాక్టర్. వై. సంజీవ కుమార్,
93936 13555






