- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అవయవ మార్పిడి’పై అయోమయం
దేశంలో అవయవ మార్పిడి రంగం వైద్యశాస్త్రంలో ఎన్నో మైలురాళ్లను అందుకుంటున్నప్పటికీ, దీన్ని నియంత్రించే చట్టాల్లోని కొన్ని లూప్‌హోల్స్ ఇప్పటికీ సవాల్‌గా మారుతున్నాయి.

‘అవయవ మార్పిడి’పై అయోమయం
- చట్టంలో లూప్‌హోల్స్..
- సజీవ దాతల హక్కులకు రక్షణ ఏది?
- ముప్పై ఏళ్ల ‘తోటా’ చట్టంలో స్పష్టత కరువు
- అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా సవరణలు తప్పనిసరి
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో అవయవ మార్పిడి రంగం వైద్యశాస్త్రంలో ఎన్నో మైలురాళ్లను అందుకుంటున్నప్పటికీ, దీన్ని నియంత్రించే చట్టాల్లోని కొన్ని లూప్‌హోల్స్ ఇప్పటికీ సవాల్‌గా మారుతున్నాయి. దేశంలో సజీవ అవయవ దానాన్ని నియంత్రించేందుకు 1994లో తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్’ (తోటా) అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలు గడుస్తున్నా, అందులోని కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత కొరవడిందని వైద్య, చట్టపరమైన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్‌లో ప్రచురితమైన తాజా విశ్లేషణ ప్రకారం.. ఈ చట్టంలో తక్షణమే కొన్ని కీలక సవరణలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
ఏ అవయవాలు దానం చేయవచ్చు?..
చట్టం ప్రకారం సజీవంగా ఉన్న ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా అవయవ దానం చేయవచ్చు. అయితే, ఏయే అవయవాలను సురక్షితంగా దానం చేయవచ్చనే దానిపై చట్టంలో స్పష్టమైన శాస్త్రీయ మార్గదర్శకాలు లేవు. ప్రస్తుతం కిడ్నీ, లివర్‌లో కొంతభాగం, ప్యాంక్రియాస్ లేదా చిన్నపేగులోని కొంత భాగాన్ని దానం చేయడానికి వైద్యులు అనుమతిస్తున్నారు. కానీ, ఏయే అవయవాలు దానం చేయవచ్చనే తుది నిర్ణయాన్ని పూర్తిగా వైద్యుల విచక్షణకే వదిలేశారు. దీనిపై ఐసీఎంఆర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదించి, చట్టబద్ధమైన శాస్త్రీయ మార్గదర్శకాలను క్రమానుగతంగా విడుదల చేసేలా చట్టాన్ని సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
‘అభిమానం, ప్రత్యేక కారణాలు’..
చట్టంలోని సెక్షన్ 9(3) ప్రకారం.. బంధువులు కాని వారు కూడా కేవలం ‘అభిమానం లేదా ప్రత్యేక కారణాల’ (స్పెషల్ రీజన్స్) రీత్యా అవయవ దానం చేయడానికి చట్టం అంగీకరిస్తుంది. అయితే, ఈ ‘ప్రత్యేక కారణాలు’ అంటే ఏమిటనే దానికి చట్టంలో ఎలాంటి స్పష్టమైన నిర్వచనం లేదు. దీనివల్ల ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, చట్టసభలు దీనిపై పునరాలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, బంధువుల మధ్య జరిగే అవయవ దానానికి ఏ అథారిటీ ఆమోదం తెలపాలనే దానిపై కూడా చట్టంలో ఒకింత గందరగోళం నెలకొంది.
తమిళనాడు జీవో వివాదం..
ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేస్తూ.. బంధువులు లేదా బంధువులు కాని వారి సజీవ అవయవ దానాలన్నింటినీ ‘ఆథరైజేషన్ కమిటీ’ పరిధిలోకి తెచ్చింది. ఇది నిబంధనల్లోని ‘కాంపిటెంట్ అథారిటీ’ పాత్రను నిర్వీర్యం చేయడమేనని, చట్ట నిబంధనలను ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఎలా అధిగమిస్తుందనే చర్చకు దారితీసింది. అంతేకాకుండా, ఇలాంటి కేంద్రీకృత నిర్ణయాల వల్ల రోగులు, దాతలు అనుమతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. ఏడాదికి 25 కంటే ఎక్కువ అవయవ మార్పిడి సర్జరీలు చేసే ఆస్పత్రుల్లోనే ‘హాస్పిటల్ బేస్డ్ ఆథరైజేషన్ కమిటీలను’ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, చాలా రాష్ట్రాలు దీన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. రోగుల ఇబ్బందులను తగ్గించడానికి ఈ కమిటీలను వికేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘డోనర్ అడ్వకేట్’ వ్యవస్థే శరణ్యం..
అవయవ దానం చేసే వ్యక్తి ఎలాంటి ఒత్తిళ్లకు లేదా ఆర్థిక ప్రలోభాలకు లోనుకాకుండా, స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నాడా.. లేదా? అని నిర్ధారించడానికి విదేశాల తరహాలో మన దేశంలోనూ స్వతంత్ర ‘డోనర్ అడ్వకేట్’ వ్యవస్థను తీసుకురావాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్లు ఆసుపత్రి వైద్య బృందంలో భాగం కావడం వల్ల ప్రయోజనాల ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, దాత ప్రయోజనాలను మాత్రమే కాపాడే స్వతంత్ర అడ్వకేట్ నివేదికను తప్పనిసరి చేయాలని నిపుణులు కోరుతున్నారు. చట్టం వచ్చి 30 ఏళ్లు దాటిన తరుణంలో తదుపరి సవరణలోనైనా ఈ లోపాలన్నింటినీ సరిదిద్ది చట్టాన్ని మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు.






