ఒక ఉప ఎన్నిక నేర్పిన పాఠాలెన్నో!

by Disha edit |
ఒక ఉప ఎన్నిక నేర్పిన పాఠాలెన్నో!
X

మునుగోడులో లభించింది సాంతం శక్తిని బీజేపీ వ్యవస్థాగత బలంగా లెక్కించలేం. గత ఎన్నికలలో నెగ్గిన రాజగోపాలరెడ్డి వ్యక్తిగత బలం, బలగం తోడవడం వలన వారికి ఈపాటి ఓటింగ్‌ లభించిందనడమే సమంజసం. కానీ, గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఏమీ లేదు అనుకోవడం, మరెలా, సాధారణ ఎన్నికలలో పాలక టీఆర్‌ఎస్‌తో వారు పోటీ పడతారు?' అన్నది కేవలం భావపరమైన సందేహం మాత్రమే! మునుగోడు మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ, టీఆర్‌ఎస్‌తో నువ్వానేనా అన్నట్టు బీజేపీ సాగటమే ఈ వాదనను తిప్పికొట్టే సమాధానం. ఒక పార్టీని అధికారంలోంచి దించేయాలని ప్రజలు అనుకుంటే, ప్రత్యామ్నాయం ఎవరున్నారు? అన్న సందేహమో, లేరు అన్న ధీమానో పాలకపక్షాలకు కూడదు. అంతటా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు, ప్రజలే ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తారని ఈ దేశంలో ఎన్నోమార్లు రుజువైంది.

ర్మరాజు తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా?' అని ద్రౌపది ఒక ధర్మ సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. జూదక్రీడ ముగించిన కురుసభకు తీసుకురమ్మన్నారన్న పిలుపును తిరస్కరించడానికి ముందు, దూతతో ద్రౌపది ఈ ప్రశ్న లేవనెత్తింది. ఆమె ధర్మ సందేహానికి రాచరికపు అరాచక పదఘట్టణలలో సమాధానమే దొరకలేదు. గెలుపెవరిది? ఓటమి ఎవరిది? అంటూ, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై ఇప్పుడు రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఎవరికి వారు తమదైన రీతిలో జయాపజయాలను, అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. మహాభారతం పోలిక ఎందుకూ? అంటే, ఈ పోటీని రాజకీయ పక్షాల వాళ్లు కురుక్షేత్ర యుద్దంతో పోల్చారు కనుకే! ఎందరు నెత్తీనోరూ మొత్తుకున్నా ఎన్నికలలో నిరాఘాటంగా సాగిన అవ్యవస్థది గెలుపు. క్రమఅక్రమ పద్ధతులలో సర్వశక్తులూ ఒడ్డినా సంతృప్తికర ఫలితాలు దక్కించుకోలేకపోయిన ప్రధాన ప్రత్యర్థి రాజకీయ పార్టీలది ఓటమి. అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి జరిపించిన ఈ ఎన్నికలలో అసలు పరాభవం ప్రజలది ప్రజాస్వామ్యానిది.

ఇక, సంఖ్యాపరంగా, ఆచరణాత్మకంగా చూసినపుడు, పాలక తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె.ప్రభాకరరెడ్డి, సమీప బీజేపీ ప్రత్యర్థి కె.రాజగోపాలరెడ్డిపై పదివేల ఓట్ల వ్యత్యాసంతో గెలిచారు. ఏ విశ్లేషణ ఎలా ఉన్నా... గెలిచినవారు అసెంబ్లీకి, ఓడినవారు ఇంటికి పోతారు కనుక ఇదే అసలు ఫలితం. ఇది ఒకరకంగా, రాజగోపాలరెడ్డి, బీజేపీకి రెండో ఓటమి. ప్రజలను ఒప్పించగలిగిన బలమైన కారణం లేకుండానే రాజీనామా చేసి, ఉప ఎన్నిక తీసుకురావడం, సమయం ఉన్నా సరైన భూమిక సిద్దం చేయకుండానే, తొందరతో ఎన్నికల షెడ్యూల్‌ వెనువెంటనే తెప్పించడం తొలి ఓటమి. ఆదివారం నాటి ఓటింగ్‌ ఫలితాలతో వారి ఓటమి సంపూర్ణమైంది. అసలు ఓటమి ఎదుర్కొన్నవారితో పాటు, చావు తప్పి కన్ను లట్టపోయిందన్నట్టు ఇప్పుడు తాము ఎదుర్కొన్న నైతిక ఓటమిని తగిన ఆత్మవిమర్శతో బేరీజు వేసుకోవాల్సింది రాష్ట్రంలో అధికారపక్షమైన టీఆర్‌ఎస్. రాబోయే సాధారణ ఎన్నికలలో పోటీ ప్రధాన పరుగులో అసలు తాము ఉంటామా? ఉండమా? తేల్చుకోవాల్సింది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం అధికారంలో ఉండి, ఇప్పుడు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ పడక మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.

Also read: ఈసీ చేతులెవరు కట్టేశారు? మునుగోడులో జరుగుతుందేంటి?

వ్యూహపరంగా వైఫల్యం

ఏడాది వ్యవధిలో సాధారణ ఎన్నికలు ఉండగా ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలు తీసుకురావడం బీజేపీ, రాజగోపాలరెడ్డి వ్యూహపర తప్పిదం. పైగా, సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా ప్రచారం చేస్తున్నప్పుడు, ఇక్కడ గెలుపోటములు రాబోయే ఎన్నికలకు సంకేతం అవుతాయి గనుక రిస్క్‌ తీసుకునే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సింది. ఈ ఓటమితో దుబ్బాక, హుజూరాబాద్‌, నగరపాలక సంస్థ ఎన్నికలలో లభించిన సానుకూలతను సందేహంలో పడేసిన ఫలితం దక్కింది. మూడున్నర యేళ్లుగా ఏమీ అభివృద్ధి జరుగలేదు, సర్కారు తనపై వివక్షతోనే ఇలా చేస్తోందని, అందుకు ప్రతిగా రాజీనామా చేస్తున్నానన్న ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి వివరణ ప్రజలకు నమ్మకాన్ని కలిగించలేదు. పైగా, తాను ఎన్నికైన కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి పార్టీ మారడం, కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంతో కూడుకున్న ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చిందని చెప్పుకోవడం మైనస్‌ అయింది. ప్రత్యర్థి పక్షాలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దాన్ని ప్రచారం చేసుకునేందుకు అస్త్రం అప్పగించినట్టయింది. నియోజకర్గం స్వరూప, స్వభావాలపై లోతైన అధ్యయనం కానీ, కొత్తగా పార్టీలోకి వస్తున్న అభ్యర్థిగా రాజగోపాలరెడ్డి సొంత అనుయాయులకు, బీజేపీ, అంటే పాత,కొత్త శ్రేణులకు మధ్య సమన్వయ సాధనకు తగినంత కృషి గానీ జరుగలేదు.

రాజగోపాలరెడ్డి వెంట రాకుండా కాంగ్రెస్‌లో మిగిలిపోయిన కార్యకర్తలు కాంగ్రెస్‌లోనే ఉండేలానో, టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లకుండానో నియంత్రించే ఏ వ్యూహాన్నీ అమలు చేయలేదు. కాంగ్రెస్‌ను బలహీనపరుస్తూ వారి కార్యకర్తలను, సానుభూతిపరులను తమ వైపు తిప్పుకున్న పాలకపక్షం తీరును గానీ, ఆ రెండు పార్టీల మధ్య జరిగిందంటున్న 'అవగాహన'ను గానీ ఎత్తిచూపడంలో బీజేపీ విఫలమైంది. కమ్యూనిస్టుల బలాన్ని సరిగా అంచనా వేయలేదు. బీజేపీని గెలవనీయవద్దనే ఒకే అంశం ఆధారంగా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన కమ్యూనిస్టులు, వారి సొంత అభ్యర్థి పోటీలో ఉన్నంతగా నిబద్దతతో పనిచేయడం టీఆర్‌ఎస్‌కు ఎంతో మేలు చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు కొన్ని, చర్యలే లేకపోవడం కొన్నిమార్లు తమకు ప్రతికూలంగా ఉన్నా ఏమీ చేయలేకపోవడం బీజేపీ అవకాశాలను దెబ్బతీసింది. బీజేపీలో కీలకపాత్ర పోషించే కార్యనిర్వాహక కార్యదర్శిని పోలింగ్‌ తేదీ సమీపించాక మార్చడం కూడా తప్పుడు నిర్ణయమే! రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులను రెచ్చగొట్టేలా చేసిన కొన్ని వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేయకపోగా కాంగ్రెస్‌ కసితో పని చేసేలా, మరింత జాగ్రత్తపడేలా చేయడం ఆ మేర నష్టమే కలిగించింది.

Also read: మరోకోణం: మునుగోడు ఫలితం వెనకాల మోడీ-షాల వ్యూహం!

గెలుపు సరే, సంకేతమేంటి?

పలు సర్వేలు చెప్పినట్టుగానే టీఆర్‌ఎస్‌ మునుగోడులో గెలిచింది. కానీ, ఏం మిగిల్చింది? దక్కింది ముఖ్యమంత్రితో సహా పార్టీ నాయకత్వం ఆశించిన ఫలితం కాదు. వ్యత్యాసం ఐదు శాతం ఓట్ల లోపే! అయితే, ఎంతతో గెలిచాం, ఎలా గెలిచాం అన్నది కాకుండా ఎన్నికలలో అంతిమంగా గెలుపే ప్రధానం అన్న సూత్రీకరణ రూఢీ అయిపోయింది ఇటీవలి కాలంలో! ఇంత చేసీ, ఈ ఎన్నిక పాలక టీఆర్‌ఎస్‌కు ఏం మిగిల్చింది? అని సమీక్షించుకున్నపుడు, వారికి కొంత నిరాశ తప్పదు. ఏడాదికి రానున్న సాధారణ ఎన్నికలపై ఒక సందేహాన్ని! అంచనాలకు మించి గ్రామీణ ప్రాంతాలలోనూ ఎదుగుతున్న బీజేపీ భయాన్నీ ఈ ఉప ఎన్నిక వారికి మిగిల్చింది. ఎన్ని శక్తులను సమీకరించి, భూమ్యాకాశాల్ని ఏకం చేసినా బొటాబోటి పదివేల మెజారిటీ దక్కింది. ఇది, నిజానికి గెలుపు కాని గెలుపే! మునుగోడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కమ్యూనిస్టుల పోరాటాల గోదా! బీజేపీ గెలవొద్దని కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు కానీ, వారి సహకారం లేకుంటే తుది ఫలితం ఏమయ్యేదో? కమ్యూనిస్టుల బహిరంగ మద్దతు, ఉద్యమ పార్టీ ఇక్కడ తొలి ఎన్నికలలో (2014,18) గెలిచి, గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలున్నాయి. నియోజకవర్గంలో 60 వేల మందికి పైగా ప్రత్యక్ష లబ్ధిదారులున్నారు. పోలీసులతో సహా అధికార యంత్రాంగమంతా పాలకపక్ష వ్యూహకర్తల కనుసన్నలలో పనిచేసినట్టు అభియోగాలున్నాయి. వందల కోట్ల రూపాయల మేర మద్యం, ధన, కనక, వస్తు, వాహనాదులను ఓటర్లకు పంచినట్టు లోకం కోడై కూసింది.

స్వయానా సీఎం రెండు సార్లు ప్రచారానికి రావడమే కాకుండా 14 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా వివిధ స్థాయి నాయకులు నియోజకవర్గంలో తిష్ట వేసి, ఊరూ, వాడా కమ్మేశారు. వివిధ స్థాయి నేతలు దగ్గరుండి, ఎన్నెన్నో పౌరుల వ్యక్తిగత, సామూహిక భవిష్యత్‌ ప్రయోజనాలకు వరాలు, హామీలు గుప్పించి ఓటర్లను మచ్చిక చేసుకున్నారు. ఇంత జరిగాక లభించిన లీడ్‌ పదివేలు అంటే, జబ్బలు చరుచుకునే పరిస్థితి కాదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. ఇంతటి మోహరింపు అన్ని నియోజకవర్గాలకు రేపొచ్చే సాధారణ ఎన్నికలలో సాధ్యమౌతుందా? మరి, అప్పుడేంటి పరిస్థితి? ఇదీ సగటు టీఆర్‌ఎస్‌ కార్యకర్త మెదడును తొలిచే ప్రశ్న! పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఇలాగే జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో, పాలకపక్షం సర్వశక్తులూ ఒడ్డితే లభించింది ఇంతకన్నా మెరుగైన (27 వేల ఆధిక్యత) విజయమే! సాధారణ ఎన్నికలలో అది తిరగబడి (34 వేల మైనస్‌) వెక్కిరించింది. అసలు టీడీపీ ప్రభుత్వమే పోయింది. నంద్యాలలో ఓడిన ప్రతిపక్ష వైసీపీ ఏడాది తర్వాతి ఎన్నికలలో 151/175 స్కోర్‌ కొట్టింది. ఇప్పుడు బీజేపీ ఓడింది, సరే... కానీ, ఏమీ లేని మునుగోడులో బీజేపీ పదివేల సమీపానికి వచ్చిందంటే ఇది దేనికి సంకేతమది? దాన్నించి టీఆర్‌ఎస్‌ ఏం పాఠం గ్రహించాలి? ఇది కోటి రూకల ప్రశ్న!!

వారికి... దారి దొరికేనా?

ప్రజలు కోరినట్టు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా, 2014 నుంచి రాష్ట్రంలో అన్నీ ఓటములే మూటగట్టుకుంటున్న కాంగ్రెస్‌ కు ఇక్కడా పరాభవమే ఎదురైంది. పైగా, మునుగోడు తన సీటు! పార్టీ అధికారికి అభ్యర్థి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా 2018 లో స్వతంత్రంగా పోరాడి సాధించిన పాటి (27వేల) ఓట్లు కూడా పాల్వాయి స్రవంతి, ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థిగా (24వేలు) సాధించలేదు. పోటీ ప్రధాన రేస్‌లో కాంగ్రెస్‌ లేనేలేదు. పార్టీ సంప్రదాయ ఓటు కూడా ఎటెటో చిత్తిపోయింది తప్ప ఏ మండలం, ఏ మున్సిపాలిటీ (ఏ రౌండ్‌) లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యత రాలేదు. కడకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో ఎదురైన ఓటమే ఇక్కడా మిగిలింది. ఒకపార్టీ ఓడిపోతోంది అని ఖరారు చేసుకున్న తర్వాత, ఓటర్లు ఇక అటువైపు కన్నెత్తి కూడా చూడరు అనడానికి కాంగ్రెస్‌ అనుభవమే నిదర్శనం.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు కొత్త జీవం అని భావిస్తున్న రాహుల్‌‌గాంధీ 'భారత్‌ జోడో యాత్ర' తెలంగాణలో సాగుతున్నపుడు జరిగిన ఉప ఎన్నికలో ఫలితం ఇలా ఉంది. మరి, ఈ పంథాలో సాగితే, 2023 ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న సహజం. నాయకులలో సమన్వయం లేదు, భారత్‌ జోడో యాత్రనో, మరేమైనా కారణమో సీనియర్లెవరూ ఇటు ఫోకస్‌ పెట్టనే లేదు. పీసీసీ నేత రేవంత్‌రెడ్డి కూడా, 'మునుగోడులో ఓడించి, తన నేతృత్వానికి ప్రమాదం తెచ్చే కుట్ర బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి చేస్తున్నాయని పోలింగ్‌ ముందు ప్రకటించారు. దాని వల్ల, అధినాయకుడే కాడి వదిలేసి, ఓటమిని అంగీకరించిన సంకేతం కార్యకర్తల శ్రేణిలోనే కాక జనంలోకీ వెళ్లింది. బీజేపీ కాకుండా, టీఆర్‌ఎస్‌కు తామే పోటీ, రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఇటు పార్టీలో, అటు పౌరులలో కాంగ్రెస్‌ కొత్త నమ్మకాన్ని కలిగించలేకపోతోంది.

చివరగా

మునుగోడులో లభించింది సాంతం శక్తిని బీజేపీ వ్యవస్థాగత బలంగా లెక్కించలేం. గత ఎన్నికలలో నెగ్గిన రాజగోపాలరెడ్డి వ్యక్తిగత బలం, బలగం తోడవడం వలన వారికి ఈపాటి ఓటింగ్‌ లభించిందనడమే సమంజసం. కానీ, గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఏమీ లేదు అనుకోవడం, మరెలా, సాధారణ ఎన్నికలలో పాలక టీఆర్‌ఎస్‌తో వారు పోటీ పడతారు?' అన్నది కేవలం భావపరమైన సందేహం మాత్రమే! మునుగోడు మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ, టీఆర్‌ఎస్‌తో నువ్వానేనా అన్నట్టు బీజేపీ సాగటమే ఈ వాదనను తిప్పికొట్టే సమాధానం. ఒక పార్టీని అధికారంలోంచి దించేయాలని ప్రజలు అనుకుంటే, ప్రత్యామ్నాయం ఎవరున్నారు? అన్న సందేహమో, లేరు అన్న ధీమానో పాలకపక్షాలకు కూడదు. అంతటా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు, ప్రజలే ప్రత్యామ్నాయాన్ని సిద్దం చేస్తారని ఈ దేశంలో ఎన్నోమార్లు రుజువైంది. ఈ వాస్తవాన్ని 'పాలకపక్షాలు' గ్రహించాలని మునుగోడు ఉప ఎన్నికల ఫలితం చెప్పకనే చెప్పింది.


దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ ఆనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ సర్వే సంస్థ,

[email protected]

9949099802


Next Story

Most Viewed