ధర్మస్థానంలో అనైతిక తీర్మానం..

by Ravi |   (  Updated:2026-01-21 01:00:47  IST  )

ప్రజాహితానికి, ధర్మ పరిరక్షణకు మాత్రమే వినియోగించబడాల్సిన దేవస్థానాల ఆస్తులు, భూములు అన్యాక్రాంతం కావడం, దుర్వినియోగమవడం పాత కథే.‌ ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండడం అందరూ ఎరిగినదే.

ధర్మస్థానంలో అనైతిక తీర్మానం..
X

ప్రజాహితానికి, ధర్మ పరిరక్షణకు మాత్రమే వినియోగించబడాల్సిన దేవస్థానాల ఆస్తులు, భూములు అన్యాక్రాంతం కావడం, దుర్వినియోగమవడం పాత కథే.‌ ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండడం అందరూ ఎరిగినదే. కానీ, అంతా సవ్యంగానే జరిగినట్లు, అపసవ్యంగా జరపడం వింత.

గత ప్రభుత్వ పాలనలో భక్తుల మనోభావాలు దెబ్బతినే అనేక చర్యలకు, అవినీతికి తిరుమల తిరుపతి దేవస్థానం పాల్పడిందని నిత్యం ఘోషిస్తూ, ప్రత్యేక పరిశోధన బృందాలు ఏర్పరచి, న్యాయస్థానాలలో క్రిమినల్ కేసులు వేస్తున్న కూటమి పాలనలో, వైసీపీ హయాంలోనే తోసి పుచ్చిన అభ్యర్థనను తిరగదోడడం, వెనక అనుకున్న కోటి రూపాయల విరాళానికే భూమి ఇవ్వనుండడం విడ్డూరం. దీని వెనుక ఒక చరిత్ర ఉంది. దాన్ని తవ్వి తీద్దాం.

దేవస్థాన సభ్యుడికి లబ్ధి..

నిజానికి తి.తి.దే. సభ్యుడు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని తనకు లబ్ధి చేకూర్చే ప్రతిపాదనలు చేయరాదు.‌ పాలకమండలి ఆమోదించరాదు. అలా చేస్తే సభ్యత్వం రద్దు కావచ్చు. కానీ తి.తి.దే. ‘కాటేజ్ డొనేషన్ స్కీమ్’ కింద ఆ సంస్థ సభ్యు డొకరు 2005లో చేసిన అభ్యర్థన మేరకు, ఆయనకు తిరుమల బాలాజీ నగర్‌లోని ప్లాట్ నం.2 ను కేటాయించినట్లు, అందుకుగాను ₹10 లక్షల నుంచి ₹50 లక్షలకు పెంచిన విరాళాన్ని చెల్లించమని అదే ఏడాది సెప్టెంబర్ 17న, 2006 జూన్ 07వ తేదీల్లో తెలియజేశారు. అలా చెల్లించకపోవడంతో, 2006 జూన్ 27న ఆమోదించిన తీర్మానం ప్రకారం ప్లాట్ కేటాయింపును రద్దు చేసారు. ఐతే, ఈ వ్యవహారాన్ని ప్రత్యేక కేసుగా పరిగణి‌స్తూ 2008 అక్టోబర్ 21న జారీచేసిన ఉత్తర్వు ద్వారా, ప్రభుత్వం తి.తి.దే.‌కి వెనకటి కేటాయింపుకు అనుమతి ఇచ్చింది.

నిబంధనలకు విరుద్ధమైనా..

చాలా కాలం తర్వాత 2021 డిసెంబర్‌లో, 2022 సెప్టెంబర్‌లో జరిగిన తీర్మానాల‌ ప్రకారం ఆ ప్లాట్‌ కేటాయింపును పునరుద్ధరిస్తూ, సదరు సభ్యుడిని రూ.1 కోటి విరాళంతో పాటు ప్రారంభ విరాళం రూ.10 లక్షలు వెంటనే చెల్లించి, ప్లాట్ స్వాధీనం చేసుకోవాలని తి.తి.దే. స్పష్టం చేసింది. ఐతే,‌ అందుకు బదులుగా ఆయన రూ.10 లక్షలు మాత్రమే చెల్లించి, ఆ ప్లాట్ కేటాయింపు ‘ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్’ పేరుతో జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిపై తి.తి.దే. అధి కారులు 2023 జనవరి 27న కోటి రూపాయలు చెల్లించాలని, లేకపోతే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు. డబ్బు చెల్లించడానికి గడువు పెంచినా, రూ.50 లక్షలు మాత్రమే ఆయన విరాళంగా చెల్లించారు. అయితే నిర్ణీత సమయంలో పూర్తి విరాళం చెల్లించకపోవడం, ట్రస్ట్ పేరుతో కేటాయింపు తి.తి.దే. విధానాలకు విరుద్ధం కావడం కారణంగా, ప్లాట్ పునరుద్ధరణను రద్దు చేస్తూ 2023 ఏప్రిల్ 15న పాలకమండలి తీర్మానించి, ఆ సభ్యుడు ఇచ్చిన డి.డి.లు వాపసు చేసారు. ఐనా, ఆ వ్యక్తి మళ్లీ ప్లాట్ పునరుద్ధరణ కోరుతూ ఆయన మరో అభ్యర్థన చేశారు. దీనిని పరిశీలించిన అధికారులు, ట్రస్ట్ పేరుతో ప్లాట్ కేటాయింపు విధానాలకు విరుద్ధమని స్పష్టం చేసిన‌ప్పటికీ, అమలులో ఉన్న విధానాన్ని సవరించి, తనది ప్రత్యేక కేసుగా పరిగణించి, తాను ప్రారంభించబోయే ట్రస్ట్ ద్వారా విరాళం చెల్లించే అవకాశమివ్వాలని ఆయన అభ్యర్ధించారు.

మళ్లీ కేటాయించడంతో..

ఈ నేపథ్యంలో, పాలకమండలి 2025 జూలై 22న ఆమోదించిన తీర్మానం మేరకు తి.తి.దే ఆ అభ్యర్థనను ప్రభుత్వ పరిశీలనకు పంపింది. బదులుగా ప్రభుత్వం ఆ అభ్యర్థన తమకు ఆమోదమో కాదో స్పష్టపరచమని తి.తి.దే‌ని ఆదేశించింది. దాంతో ఈ విషయం సదరు సభ్యుడు కూడా ఉన్న అంచనాల కమిటీకి నివేదించగా, ఆ అంశం పరిశీలించి, తగు నిర్ణయం కోసం పాలకమండలి ముందు ఆ విషయం ఉంచాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. పర్యవసానంగా మొత్తం నేపథ్యాన్ని, వ్యక్తిగత ప్రయోజనాల ఘర్షణ, ‘తిరుమల కొండలపై ఇకపై చేపట్టే ఏవైనా కొత్త నిర్మాణాలు పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వాటి ప్రభావాన్ని తి.తి.దే. నిశితంగా పరిగణించాలి’ మొదలైన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు సహా, పరిశీలించిన తి.తి.దే. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో ప్లాట్ నం.2 ను ‘ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్’ పేరుతో మళ్లీ కేటాయించేందుకు తీర్మానించి, ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. విచిత్రంగా ఈ‌ పాలక మండలిలో ఈ అనైతిక తీర్మానాన్ని ఒక్కరే వ్యతిరేకించారు. ఈ నెల 8న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కేటాయింపు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లగా, ఆ కేటాయింపు రద్దు చేయాలని వారు తక్షణమే ఆదేశించడం ఈ తతంగానికి భరతవాక్యం. ఎడమ చెయ్యి తీసి పుర్ర చెయ్యి పెట్టినట్టు తి.తి.దే‌. వ్యవహారాలు మరోసారి సాగవని ఆశిద్దాం.

-మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story