ప్రపంచాన్ని కబళిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం!

by Ravi |   (  Updated:2026-01-28 01:15:27  IST  )

ప్రపంచంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు అనే పేర్లతో నడుస్తున్నది వాస్తవానికి కార్పొరేట్ సామ్రాజ్యవాదమే. చమురు, సహజ వనరులు, డాలర్ ఆధిపత్యం కోసం అమెరికా అనేక దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ దాడులు, ఆంక్షలు, రాజకీయ జోక్యాలను సాధనాలుగా మార్చుకుంది.

ప్రపంచాన్ని కబళిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం!
X

ప్రపంచంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు అనే పేర్లతో నడుస్తున్నది వాస్తవానికి కార్పొరేట్ సామ్రాజ్యవాదమే. చమురు, సహజ వనరులు, డాలర్ ఆధిపత్యం కోసం అమెరికా అనేక దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ దాడులు, ఆంక్షలు, రాజకీయ జోక్యాలను సాధనాలుగా మార్చుకుంది. వెనిజులా వంటి దేశాలపై జరుగుతున్న పరిణామాలు ఈ సామ్రాజ్యవాద విధానానికి స్పష్టమైన ఉదాహరణలు.. అణ్వాయుధాల యుగంలో ప్రపంచం మౌనం వహిస్తే, రేపటి మానవ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది.

చమురు కోసం, సహజ వనరుల కోసం, ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదా కోసం అమెరికా అగ్రరాజ్యం అనేక దేశాలపై దాడులు దండయాత్రలు చేస్తూ తన సామ్రాజ్యవాదాన్ని కార్పొరేట్ల లాభాల కోసం విచ్చలవిడిగా బరితెగించి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. వలస పాలన కన్నా సామ్రాజ్యవాదం నేడు ప్రపంచ దేశాలను వణికిస్తూ అణ్వాయుధాలతో బెదిరిస్తూ ఉన్నందున ప్రపంచ దేశాలు కొన్ని ఈ సామ్రాజ్యవాదులపై తిరగబడితే ప్రపంచ భవిష్యత్తు ఎటుపోతుందో చెప్పడం కూడా భయమేస్తుంది.

అత్యంత జోక్యందారీ అధ్యక్షుడు..

ఇతర దేశాలపై ఆధారపడి అభివృద్ధి చెందిన అమెరికా, ఇప్పుడు ప్రపంచ దేశాలను తన కనుసనల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యం, వాణిజ్యం, పెట్టుబడులు అన్నీ విదేశాలతో ముడిపడి ఉన్నప్పటికీ, ఆ ఆధారాన్నే సామ్రాజ్యవాదంగా మార్చుకుంటోంది. అమెరికా అభివృద్ధిలో భారతీయుల మేధస్సు, చైనా తయారీ, మెక్సికో వ్యవసాయం, కెనడా ఇంధనం, జర్మనీ యంత్రాలు, జపాన్–దక్షిణ కొరియా సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయినా ఈ ఆర్థిక ఆధిపత్యం ద్వారా ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోంది. ట్రంప్ ప్రకటనలను పరిశీలిస్తే వెనిజులా చమురు సంపదపై నియంత్రణే అసలు లక్ష్యమని స్పష్టమవుతుంది. ఇరాన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనుజులా అధ్యక్షుడు నికలాస్ మధురో అతని భార్యను కూడా అమెరికా బంధించి నార్కో టెర్రరిజం అని ఆరోపించి న్యూయార్క్ తరలించడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలా ఇతర దేశాల్లో జోక్యంతో ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత జోక్యందారి అధ్యక్షుడిగా మారి, సామ్రాజ్యవాద విజృంభనకు దారితీస్తున్నాడు.

పెట్టుబడిదారుడే పాలకుడైనప్పుడు..

సోషలిజం కంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మేలని, స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధి, ప్రపంచ శాంతి వస్తాయని ప్రచారం చేశారు. కానీ వాస్తవంలో పెట్టుబడిదారులు పాలకులతో చేతులు కలిపి దేశాలను దోచుకుంటున్నారు. ప్రభుత్వాలను కూల్చడం, తమకు అనుకూలమైన వారిని అధికారంలో కూర్చోబెట్టడం ద్వారా వనరులను కైవసం చేసుకుని దేశాల భవిష్యత్తును నియంత్రిస్తున్నారు. పాలకులేమో అన్ని రంగాలను కార్పొరేట్లకు అప్పగించి రాజుల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా నిస్సహాయ స్థితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. నిజానికి పెట్టుబడిదారుడే పాలకుడైనప్పుడు దోపిడీ తప్ప మరో లక్ష్యం ఉండదు. ప్రజలకు అవసరం లేని ఉత్పత్తులు కొనసాగిస్తూ దేశ సంపదను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం నిస్సహాయంగా మారి, దాని పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దోపిడీ జరుగుతోంది. ఈ పెట్టుబడిదారులకు పెద్ద దిక్కు అమెరికా.

తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం..

అమెరికా తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ అంతర్జాతీయ చట్టాలకు గానీ కట్టుబడి ఉండదు. మార్కెట్ విస్తరణ కోసం దిగజారుతున్న తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం బలహీన దేశాలపై సైనిక దాడి, రాజ్యాంగం మార్పు పేరుతో ప్రజల రక్షణ కోసం అంటూ రాజకీయ బ్లాక్ మెయిలింగ్ విధానాన్ని అమెరికా అనుసరిస్తున్నది. తన ఆర్థిక ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే దేశాలను అమెరికా సహించదు వాటి మీద ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. ఇది ప్రత్యక్ష యుద్ధానికి మరో రూపం. వెనిజులాపై సైనిక దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మధురో అపహరించడానికి కారణం సామ్రాజ్యవాద ప్రయోజనాలే అని అమెరికా అధ్యక్షుడు తానే వివరించి చెప్పారు.

ప్రపంచం మౌనం వహిస్తే..

నేటి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నిజమైన పోటీ మార్కెట్లు లేవు. ఫైనాన్స్ క్యాపిటల్, స్టాక్ మార్కెట్ల ఆధిపత్యంలో దేశాల ప్రజాస్వామ్య స్వాతంత్ర్యం క్రమంగా నశిస్తోంది. సాంకేతికంగా, సైనికంగా, ఆర్థికంగా అమెరికా అగ్రరాజ్యంగా మారి కార్పొరేట్ రంగానికి పెద్దదిక్కుగా ఉంది. IMF, వరల్డ్ బ్యాంక్, WTO, UN వంటి సంస్థలను తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగిస్తోంది. అణ్వాయుధాల యుగంలో యుద్ధం అంటే మానవజాతి అంతమే. ఈ పరిస్థితిలో ప్రపంచం మౌనం వహిస్తే భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి నేడు ప్రపంచం అగ్రదేశాల ఆయుధ సంపత్తి కింద నడవకూడదు. వీటి నుంచి బయటపడాలంటే డీ గ్లోబలైజేషన్, డీ డాలరైజేషన్, డీ ప్రైవేటైజేషన్ అయితే తప్ప మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు.

-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Next Story