హక్కుల నేత అంబేద్కర్

by Disha edit |
హక్కుల నేత అంబేద్కర్
X

వివక్షాపూరిత సమాజంలో సామాజిక బహిష్కరణకు గురైన జాతిలో పుట్టిన ధ్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని జన్మించాడు. అంటరాని మహర్ కులంలో పుట్టి బాల్యం దశలో అనేక అవమానాలకు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ పట్టుదలతో ఉన్నత చదువులు చదివాడు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో విదేశాల్లో ఉన్నత విద్యను సైతం అభ్యసించాడు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఆస్థానంలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ నౌకర్లు అంబేద్కర్‌ను అస్పృశ్యుడుగా చూడడంతో పెద్ద అవమానంగా భావించాడు. దీంతో సామాజిక వివక్షతపై అలుపెరగని పోరాటం చేశాడు. దళిత జాతులను పీడిస్తున్న అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో చేసిన మహాద్ చెరువు పోరాటం అందరి దృష్టిని ఆకర్షించించింది. ఆలయాల ప్రవేశాలు, పాఠశాలలో చదువు, తాగునీరు బలహీన వర్గాలకు అందాలని పట్టుపట్టాడు. 1927లో సైమన్ కమిషన్ నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం భారతదేశాన్ని సందర్శించినప్పుడు కమిషన్‌కు దళిత జాతి సమస్యలను నివేదించాడు. అంబేడ్కర్ ‘అఖిల భారత దిగువ కులాల సమాఖ్య’ను స్థాపించి వారి ఉన్నతికై పోరాటం చేశాడు. ఇంగ్లాండులో మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దళిత జాతి సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకెళ్లాడు. దళితజాతులు సమాజంలో విస్మరించబడ్డారని గుర్తించి వీరికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని డిమాండ్ చేశాడు. ఆచరణలో అవి సాధ్యం కానప్పటికీ నేటి రిజర్వేషన్ వ్యవస్థకు మూలమైనవి.

అందుకే రాజ్యాంగంలో హక్కులు..

1927లో అంబేడ్కర్ ‘బహిష్కృత భారతీ’ అనే పత్రికలో తిలక్ గనక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అనేవాడు కాదు, అస్పృశ్యతా నివారణ నా ధ్యేయం, నా జన్మ హక్కు అని నినదించేవాడని రాశాడు. అంటే ఆనాడు భారతీయ సమాజంలో అంబేడ్కర్ కులతత్వ వాదులచే ఎంత బాధ అనుభవించాడో తెలుస్తుంది. యువతలో వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పిస్తూ అగ్రకుల దాడులను ఎదుర్కొంటూ సమానత్వ సాధనకై 1924లో ‘సమతా సైనిక్ దళ్’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ‘మూక్ నాయక్’ అనే పత్రికను నడిపి దేశ మూలవాసుల చరిత్రను వెలికి తీశాడు. అంబేద్కర్ రాకతో సామాజిక అసమానతలపై దిగువ కులాల పోరాట ఉద్యమాలు ప్రాంతీయ పరిధిని దాటి జాతీయస్థాయి ఉద్యమాలుగా రూపాంతరం చెందాయి. అవి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలతో దళిత జాతిని సంఘటితం చేశాయి. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేద్కర్ విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడనిదే వారి సమస్యలకు పరిష్కారం దొరకదని భావించాడు. అందుకే వీరికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను ఆపాదించాడు. రాజ్యాంగ రచన కమిటీలో అత్యంత అర్హత కలిగిన వ్యక్తిగా ఆ కమిటీకి అధ్యక్షత వహించాడు. ప్రపంచంలోని చాలా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాశాడు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను రాజ్యాంగంలో చేర్చి ‘భారత రాజ్యాంగ పిత’గా వెలుగొందాడు. అణచివేయబడిన స్థితిని మార్చడానికి రాజ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్స్ చేర్చాడు.

ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలి!

దేశంలో ఓటు హక్కు ద్వారా రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. నేడు ప్రతి పౌరునికి అమ్మ జన్మనిస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం జీవితాన్ని ఇస్తుందనేది కాదనలేని సత్యం. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కు కొరకు పోరాడినాడు. ఈ విధంగా ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్పృశించాడు. జీవిత చరమాంకంలో అంబేడ్కర్ ‘నా పుట్టుక నా చేతిలో లేదు కానీ, నా చావు నా చేతిలో ఉంద'ని ప్రకటించి హిందూ మతాన్ని వీడి మానవీయ విలువలతో కూడిన బౌద్ధాన్ని స్వీకరించాడు. సామాజిక ఆసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన ఆయన 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచాడు. భారతీయ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై లక్ష పేజీల సాహిత్యాన్ని మనకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నిత్య చైతన్యం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. అందుకే ఐక్యరాజ్య సమితి ‘అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన జయంతిని ‘ప్రపంచ విజ్ఞాన దినోత్సవం’గా ప్రకటించినది. ఇది భారత ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి ఆయన పేరును పెట్టడం కూడా ఆయన సేవలకు నిదర్శనం. ఈ స్ఫూర్తి దేశవ్యాప్తంగా చాటుతూ ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అంబేద్కర్ పట్ల సంకుచిత భావజాలాన్ని విడనాడి మానవ హక్కుల నేతగా గుర్తించాలి. ఇదే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి.

(నేడు అంబేద్కర్ వర్ధంతి)

-ఎస్. శ్యామల

80085 39905


Next Story

Most Viewed