- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

పలనాటి సీమ అంటేనే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది బ్రహ్మనాయుడు, నాగమ్మ, కన్నమ దాసు, బాలచంద్రుడు, మాంచాల, సహఫంక్తి భోజనం, కోడిపందాలు తదితరాలు.. అలనాటి పలనాటి సీమ చారిత్రక సామాజిక అంశాలను కొత్త దృష్టితో, మరికొంత పరిశోధన కోణంలో అద్భుతంగా రాసిన నవల ఇది.
అపురూపమైన నవలాకారుడు..
విశ్వం అనువాద రచన ‘కాదంబరి’ని చదివినప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో.. అంతకు మించిన అనుభూతిని కలిగించిందీ నవల. ఇంతకు మునుపు ఎన్నడూ వర్ధెల్లి వెంకటేశ్వర్లు పేరు వినటం గానీ, అతని రచనలు చదవడం గాని లేదు. ‘ఈ నవల తప్పక చదువు భూమన్’ అని బండి నారాయణస్వామి అంటే ఏమో అనుకున్నాను. ‘కడపటి యుద్ధం’ తరువాత వెంటనే ఇంతటి అద్వితీయమైన నవలను చదువుతానని ఊహించనూ లేదు. ఎవరి గురించి చెప్పాల్నో.. ఎవరి గొంతుకై నినదించాల్నో.. సరిగ్గా దాన్ని అందుకున్న అపురూపమైన నవలాకారుడు వెంకటేశ్వర్లు.
పందెపు కోళ్ల యుద్ధాన్ని చూపుతూ..
చెంచు పెద్ద పగ, ప్రతీకారం ఒక రాజ్యాన్ని అడవిపాలు చేయటం ఎంత గొప్పగా కథనీకరించాడో చెప్పలేను. అడవి, అక్కడి జీవాలు చెట్లు, చేమలు, పుట్టలు ప్రతిదీ పేరు పేరునా పలకరిస్తూ.. అడవినంత సాదృశ్యం చేస్తూ చెంచుల జీవన విధానాన్ని కన్నుల పండుగ గావిస్తూ పరుగులెత్తిస్తున్నది నవల. చెంచుల మీదికి బ్రహ్మనాయుడు దండెత్తడం, రాజధాని లేని మాచర్లను వారి గూడాలకు విస్తరించాలని అనుకోవడంతో కథ ఆరంభం అవుతుంది. దెబ్బతిన్న చెంచు పెద్ద బయ్యన్న ఒక కారుకోడిని పట్టుకొని, దాన్ని కొండమల్లుగా తీర్చిదిద్ది ప్రతీకారం తీర్చుకోవడమే కథ. వేంగి చాళుక్యులు తమ మీద దాడి చేసినప్పుడు చెంచు బయన్న చేసిన మేలును బ్రహ్మనాయుడు మరిచి నాడు. కాపెట్టుకున్న బయన్న ఒక మంచి కోడి కొండమల్లును ఎట్లా పెంచినాడు? ఎటువంటి శిక్షణ ఇచ్చినాడు? పులినైన ఎదుర్కోగలిగే తీరును ఎట్లా నేర్పించాడు? ఇవన్నీ అక్షరం పొల్లు పోకుండా చదివితేనే ఆ సారం బోధపడుతుంది. కొండమల్లు ప్రత్యర్థి చిట్టిమల్లు. కొండమల్లు నాగమ్మ వైపు. చిట్టిమల్లు బ్రహ్మనాయుడు వైపు. ఆ పందెపు కోళ్ల యుద్ధం తంత్ర నిపుణుతను కళ్లకు కట్టినట్టు చూపుతున్నాడి రచయిత.
ప్రపంచ సాహితీ పటంలో నిలవాలంటే..
కోడిపందెంలో తనను గెలిపించినందున నాగమ్మ కొండవీటి బయ్యన్నను మండలాధీశ్వరుని చేస్తానని ప్రతిపాదిస్తే..! ‘ఆటవికులం.. కొల్లలుగా తిరిగేటోళ్లం. జంతు జాత జీవులం అడవికి మేమే రాజులం, మేమే బంట్లు. మమ్ములను మమ్ములుగానే వదిలేయిరి. మా మానాన మేం బతుకుతాం. పరాయి పెత్తనం వద్దు’ అని దండం పెట్టిండు. రాజధాని ప్రస్తావనలో సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబు చేస్తున్న పనులకు నలిగిపోతున్న రాయలసీమలో బయన్న ఎక్కడో ఒకచోట చదువరికి తగలకపోడు. రాజ్యాధినేతలు తమ పరిధిని మించితే జనం చెంచు కొండవీటి బయన్న రూపంలో ప్రతీకారం తీర్చక మానరని హెచ్చరిక ఈ నవలతో తట్టా తట్టన తగులుతున్నది. చెంచుల భాష ఎక్కడా ఇబ్బంది పెట్టకపోగా ఏదో సంగీత ధ్వనులు వినినట్టుగా, తెలంగాణ నుడికారం గొప్ప నృత్య రూపకంగా అల్లికై నవల ఆధ్యాంతం గొప్పగా రక్తి కట్టిస్తున్నది. తెలుగు నవల కడపటి యుద్ధం, కొండమల్లుతో దేశాంతరాలకు ఎదిగి అగ్రస్థానానికి చేరుకుంటున్న కాలమిది. కొండమల్లు ఇతర భాషలోకి చేరితే గాని గొప్పతనం ప్రపంచ సాహితీ పటంలో నిలదొక్కుంటుంది. మంచి కథనం దాస్తే తాగని చరిత్ర సత్యాన్ని ఒక చెంచు బయన్న రూపంలో కోడిపందాల యుద్ధ తాంత్రిజ్ఞతతో రాసిన ఈ నవల అపురూపమైనది. వెంకటేశ్వర్లు మనకు అందించిన ఒక విశిష్ట నవల రాజసం.
పుస్తకం: కొండమల్లు
రచయిత: వర్ధెల్లి వెంకటేశ్వర్లు
పేజీలు: 234
వెల: రూ.300/
ప్రచురణ: బోధి ఫౌండేషన్
ప్రతులకు: నవోదయ, న్యూ విశాలాంధ్ర హౌస్, లోగిలి
సమీక్షకులు
- భూమన్
90107 44999






