- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానం.. యోగా
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో ఒకటి యోగా.. మానవ మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో ఒకటి యోగా.. మానవ మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఉరుకుల, పరుగుల జీవితంలో పది నిమిషాల పాటు యోగాకు సమయం కేటాయిస్తే వందేళ్లు ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రమబద్ధమైన జీవన శైలికి యోగా ఒక టానిక్‌లా పనిచేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రశాంతతను చేకూరుస్తుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న ఘనంగా జరుపుకోనున్నారు.. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా రోజు గుర్తుచేసుకోవడమే ముఖ్య ఉద్దేశం. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది.
ప్రతిరోజూ యోగా చేస్తే..
పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆరోగ్య విజ్ఞా నమే యోగా.. సాధారణంగా ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించిందని అనుకుంటారు.. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు.. యోగా మనిషి విశ్లేషణ సామర్థ్యాన్ని సృజనాత్మకతను ఉత్పాదకత స్థాయిని పెంచుతుంది. యోగా సాధన ఒత్తిడిని దూరం చేయడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు యోగా చేస్తే వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరాన్ని మనసును బ్యాలెన్స్ చేసే శక్తి యోగాభ్యాసానికి మాత్రమే ఉంటుంది. యోగా మానసిక ప్రశాంతత, మతిమరపు, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి సమస్యలకు మంచి మందులాగా పని చేస్తుంది. యోగా సాధనతో ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది. డిప్రెషన్ లాంటి సమస్యలు దరిచేరవు..
అభ్యసన సామర్థ్యాన్ని పెంచి..
యోగాను ఎంత ఎక్కువగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత అంతగా ఎక్కువ పెరుగుతుంది. యోగా సాధన తర్వాత మనిషి మనస్సు ప్రశాంతంగా మారడంతో పాటు సా నుకూల దృక్పథం పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రశాంతతను చేకూరుస్తుంది. కొన్ని సందర్భాలకు ఒత్తిడి వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. నిజానికి స్ట్రైన్ అనేది తరతరాల నుంచి వారసత్వంగా వస్తుంది. ఒక స్థాయి వరకు ఒత్తిడి మంచిదే అయినా అది నిత్య జీవితంలో భాగం అయిపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఒత్తిడి.. శరీరంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఈ ఒత్తిడిని తట్టుకుని ధైర్యంగా నిలబడిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుతారు.. ఇలాంటి ఒత్తిడిలు అన్నీ యోగాతో మాయం అవుతాయి. ప్రశాంత వాతావరణంలో యోగా టెక్నికలు, మెడిటేషన్ సాధన చేయడం, క్రమబద్ధమైన శారీరక కదలికల వల్ల మెదడు రిలాక్స్ అయి ఒత్తిడి దానంతట అదే దూరం అవుతుంది. అంతేకాక ఈ యోగా సాధన ద్వారా అవయవాలు నాడీ కేంద్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది. నరాల్లో కొత్త ఉత్తేజం నిండి మెదడు, శరీరం మనుసుకు కొత్త శక్తి వస్తుంది. యోగా మనిషి జ్ఞాపక శక్తిని, అభ్యసన సామర్థ్యాన్ని మేధోశక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..
యోగా భారత సాంప్రదాయక విద్యలో తప్పనిసరి.. ఈ యోగా నేడు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. యోగా ద్వారా సంపూర్ణంగా, ఆరోగ్యంగా మనిషి ఉంటాడనే నమ్మకం ఉంది. వివిధ రకాల ఆసనాలు యోగాతో ముడిపడి ఉన్నాయి. యోగా వలన జ్ఞానం, వృద్ధి చెందుతుంది. అవయవాలు సక్ర మంగా పనిచేస్తాయి. ఆందోళన, ఆత్రుత వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభను నాశనం చేస్తుంది. యోగా లాంటి ఒత్తిడిలు, టెన్షన్ లు, ఆలోచనలను దూరం చేసి మనిషిలో దాగి ఉన్న అద్భుతమైన శక్తులని బయటకు తీసుకొస్తుంది. సామాజిక బంధాలు బలోపేతం చేయడంతోపాటు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం ఇతర వ్యాయామాలకు ఉండవు.. శారీరక వ్యాయామం మించిన ప్రయోజనాలు ఉన్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు.. యోగాసనాల వలన రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల శరీరం నుండి విషపదార్థాలు వేగంగా బయ టకు వెళ్లిపోతాయి. మనసును శ్వాస ప్రక్రియపై చేసి ఏకాగ్రత సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చును. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే వైద్య నిపుణుల దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. కళ్లు మూసుకొని ఏ ఆలోచనలు లేకుండా యోగా చేయడం ఉత్తమం. అందుకే మనం ప్రతిరోజు యోగా సాధన చేద్దాం. శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేసుకుందాం.
(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా)
బత్తుల రాజేందర్
యోగా టీచర్
70139 63454






