అమరావతి... ఆంధ్రుల వారసత్వ సంపద

by Disha edit |
అమరావతి...  ఆంధ్రుల వారసత్వ సంపద
X

ఆంధ్రుల రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతులు, మహిళలు ఉద్యమాన్ని ప్రారంభించి 1500 రోజులు పూర్తయింది. రైతులు ఉదారంగా ఇచ్చిన 34 వేల ఎకరాల్లో నిర్మితమైన శాసనసభలోనే 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులు ప్రకటించి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలను సజీవ సమాధి చేశారు. ఇప్పటివరకు 275 మందికి పైగా ఆ ప్రాంత రైతులు మరణించారు. రాజధాని రైతులను, మహిళలను అనేక రూపాల్లో వేధింపులకు గురిచేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో వెన్ను చూపకుండా రాష్ట్ర భవిత కోసం, తమ న్యాయమైన హక్కుల సాధన కోసం నినదిస్తున్నారు.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

సాంస్కృతిక వారసత్వానికి, ఆంధ్రుల అస్తిత్వానికి అమరావతి ప్రతీకగా నిలిచింది. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం జగన్ రెడ్డి రాజకీయ వికృత క్రీడకు బలైపోయింది. అమరావతి గుండెలపై నిప్పుల కుంపటి పెట్టి జగన్ రెడ్డి నిత్యం ఆజ్యం పోస్తూనే ఉన్నారు. దేవతలు పాలించిన అమరావతిలో రాక్షస సంహారం జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి, పాలనపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మూడు రాజధానులు అంటూ వివాదం సృష్టించారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏనాడూ చొరవ చూపలేదు. రైతుల ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు 144 సెక్షన్, పోలీస్ చట్టం 30 లాంటివి పెట్టి వారిని స్వేచ్ఛగా తిరగనీయకుండా నిర్బంధాలకు గురిచేశారు. వారి పాదయాత్రలకు సైతం అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. భూమిని నమ్ముకున్న రైతులు జీవనాధారం కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో ఒకవైపు ప్రభుత్వ దమనకాండపై పోరాడుతూ.. మరోవైపు రెచ్చగొట్టే పోటీ ఉద్యమాలను నిలువరించారు. తాజాగా భూసేకరణ ప్రాంతాల్లో కేటాయించిన ప్లాట్లను మార్చి వేరే చోట ఇచ్చేందుకు సీఆర్డీయే రంగం సిద్ధం చేసింది. తద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసే కుట్రకు జగన్ సర్కార్ తెరతీసింది.

మాటిచ్చి కూడా వంచించారు

'13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రాజధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాలు కావాల'ని అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి చెప్పిన మాటలు. అమరావతే రాజధాని అని అధికార, ప్రతిపక్షాలు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. వారి మాటలు విశ్వసించి రైతులు ఉదారంగా తమ భూములు ఇచ్చారు. సీడ్ యాక్సిస్ రోడ్లతో పాటు 34 రోడ్ల నిర్మాణం జరిగింది. రూ.15వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. మరో రూ.30 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. చట్టసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల గృహ సముదాయాలు 70 శాతం పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలో 10 ప్రధానమైన రహదారులను పర్యవేక్షిస్తున్న లీ అసోసియేట్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం తరిమేసింది.

పాలన మొత్తంగా ధ్వంసరచనే

అమరావతి రాజధానిని కడతామని నమ్మబలికి బ్యాంకుల నుంచి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. ఆ అప్పులకు వడ్డీలు కూడా కట్టలేదు. సీఆర్డీయేను సైతం రుణాల ఊబిలోకి నెట్టారు. హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,060 కోట్లు అప్పు తీసుకున్నారు. 2019 నుంచి పనులు నిలిచిపోయాయి. అప్పటికి ఈ ప్రాజెక్టు కోసం రూ.1,300 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.500 కోట్లు కట్టకపోగా లోన్ తాలుకా ఉన్న రూ.500 కోట్లు దిగమింగారు. రాజధానిలో ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ధ్వంసరచన.. రోడ్లు, మట్టి, కంకర తవ్వి అమ్మడంతో ముగించారు. ఆర్-5 జోన్ పేరుతో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతంతో సంబంధం లేని 50 వేల మందికి పట్టాలు పంచారు. కానీ వాటిని న్యాయస్థానాలు నిలిపివేశాయి.

అటకెక్కించిన అద్భుతాల రాజధాని

ప్రపంచంలోనే ఆరు అద్భుత భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతికి చోటు దక్కింది. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో అనేదానికి అమరావతి అద్దం పడుతుందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే న్యూయార్క్ కేంద్రంగా ఉండే పత్రిక ప్రచురించింది. అమరావతిని తరలిస్తామని చెప్పడం ప్రభుత్వ మతిలేని చర్యగాక మరేమిటని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పడే అవకాశాలను కాలరాస్తూ మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్యగా ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అభివర్ణించారు. రాజధాని అమరావతిని నిలిపివేయడం జాతీయ విషాదమని వ్యాఖ్యానించారు. మరోవైపు విశాఖపై సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను జగన్ అండ్ కో కబ్జా చేయగా.. మిగిలిన ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇక కబ్జా చేయడానికి, అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి అక్కడ మిగిలిందేమీ లేదు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు అదానీకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. రైల్వే జోన్‌ను నిర్లక్ష్యం చేశారు, గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు.

ప్రజల ఆశలను, ఆనందాన్ని ఆవిరి చేశారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకున్నారు. గెలుపుపై నమ్మకం పోవడంతో మతిభ్రమించి జగన్ రెడ్డి తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడో తెలియకుండానే పాలన పూర్తైంది. చివరకు రాజధాని లేకుండానే పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాజధానిని మార్చాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి చేయాలనే సంకల్పం బలంగా ఉండాలి. ఆ చిత్తశుద్ధి లేమితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజధానిపై జగన్ రెడ్డి మాటలను ఎవరూ విశ్వసించరు. అమరావతి రైతుల ఆగ్రహ జ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయి. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

(రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా)

మన్నవ సుబ్బారావు

99497 77727



Next Story

Most Viewed