మద్యపాన నిషేధం.. ఈ మాట మర్చిపోవడమే మంచిది!

by Ravi |   (  Updated:2025-07-13 00:45:48  IST  )

ఏదైనా సాధించడం ఎంత ముఖ్యమో, అందుకు ఎంచుకున్న మార్గం కూడా అంతే ముఖ్యం అన్నాడు మహాత్ముడు. లక్ష్యసాధన

మద్యపాన నిషేధం.. ఈ మాట మర్చిపోవడమే మంచిది!
X

ఏదైనా సాధించడం ఎంత ముఖ్యమో, అందుకు ఎంచుకున్న మార్గం కూడా అంతే ముఖ్యం అన్నాడు మహాత్ముడు. లక్ష్యసాధన ప్రధానం అందుకు ఏ మార్గమైనా పర్వాలేదు అన్నది యూరప్ రాజనీతిజ్ఞుడు నికోలో మాకియవెల్లి భావన. అయితే మద్యపాన నిషేధం అమలు విషయంలో జాతిపిత ఉద్బోధలు ఉపన్యాసాలకు పరిమితం చేసి, మాకియవెల్లి మార్గంలోనే దేశం నడుస్తున్నట్టుంది.

మద్యపాన నిషేధం విషయమై, మన దేశంలో గల 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలలో, కేవలం 4 రాష్ట్రాలు (గుజరాత్, బిహార్, మిజోరం, నాగాలాండ్), ఒక UT (లక్ష ద్వీప్) మాత్రమే మద్యం అమ్మకం నిషేధిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995 జూన్ నుండి అమలులోకి వచ్చిన ఈ చట్టాన్ని, అమలు విజయవంతం కాలేదని, ఆచరణ సాధ్యం కాదని చెప్పి, ఏ రాజకీయ పక్ష ప్రభుత్వం ఆ శాసనాన్ని తెచ్చిందో, వారే 1997లో ఆ చట్టం కథ ముగించారు.

మద్యపాన నిషేధం చేస్తామని..

ఆంధ్రప్రదేశ్‌లో పాలక పక్షాన్ని దెబ్బతీసి, 2019 ఎన్నికలలో ప్రతిపక్షం 151 స్థానాలు గెలవడానికి కారణాలలో ఒకటి దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ. తీరా, అధికారంలోకి రాగానే ఆ మాట దాటవేసి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసే విధానం ప్రవేశ పెట్టింది. దాంతో మద్యం వినియోగం ‘అభివృద్ధి’ చెంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆర్దిక సంవత్సరానికి ₹25,062 కోట్ల ఆదాయం సమకూరింది. ఐతే, ఆప్పటి పాలకపక్షం ప్రజల సొమ్మును మద్యం కంపెనీలకు ‘అదనం’గా చెల్లించి, తద్వారా ఆర్థిక లబ్ధి పొంది, ఆ మొత్తాన్ని ఎన్నికల ఖర్చుకు వినియోగించిందన్న ఆరోపణలపై ఇప్పుడు ‘సిట్’ విచారణ జరుపుతోంది. అది వేరే విషయం.

పర్మిట్ రూమ్స్‌తో అదనపు ఆదాయం

ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే, మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఒక వనరుగా భావించడం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌కి మద్యం పద్దు కింద ఆదాయం ముందటి సంవత్స రం కంటే 14.84 % పెరిగి ₹ 28,842 కోట్లకు చేరు కుంది. ఇందుకు ఒక కారణం దరఖాస్తు ఫీజుల ద్వారా వచ్చిన‌ ₹1908 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ ఆదాయం ఉండదు కాబట్టి, పర్మిట్ రూమ్స్ అనుమతించి, నగరాలలో ₹7.5 లక్షలు, ఇతర ప్రాంతాల్లో ₹5 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయిస్తే, ఏటా అదనంగా వచ్చే ₹ 1,900 కోట్లతో ఆ లోటు చాలా వరకు భర్తీ చేసుకోవచ్చని, ప్రభు త్వ ఉచిత పథకాలకు కొంత ధనం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వ యోచన. ఈ పని ఇది వరకే చేసింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా మహమ్మారి తర్వాత పర్మిట్ రూమ్స్ తిరిగి తెరవడానికి 2021 నుండి అనుమతించింది. అలా తెలంగాణలో ప్రభుత్వం అనుమతి పొందిన పర్మిట్ రూమ్స్ 135 ఉండగా, అనధికారికంగా నిర్వహిస్తున్నవి మరో 1,000 వరకు ఉండొచ్చని ఒక అంచనా‌. పర్మిట్ రూమ్స్‌లో మద్యం ప్రియులు సదుపాయంగా కూర్చొని ఆల్కహాల్ సేవించవచ్చు. లైసెన్స్ ఫీజుల వల్ల, పెరిగిన అమ్మకాల వల్ల, ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది.

గంజాయి నిర్మూలన మంచిదే కానీ...

ఐతే, ఈ నాణేనికి మరోవైపు కూడా ఉంది. కూటమి ప్రభుత్వం గంజాయి సాగు, వినియోగాలను అరికట్టడానికి, నిర్మూలించడానికి కంకణం కట్టుకుంది. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు, గంజాయి తోటల ధ్వంసం, ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు జరుపుతోంది. మరోవైపు అవగాహన కార్యక్రమాలు, 'పరివర్తన’ సమావేశాలు నిర్వహిస్తోంది. ‌గంజాయి పై ఉక్కు పాదం‌ మోపడానికి ఏవైతే కారణాలో, అవే మద్యపానానికి కూడా వర్తిస్తాయి. భర్త చనిపోవడంతో తానే కష్టపడి పెంచి పెద్ద చేసిన‌ కొడుకులు ఇద్దరూ సా రాకు బానిసలవడం, చివరికి వారు మరణించడమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1990 లో 'దూబగుంట' రోశమ్మ సారా వ్యతిరేక పోరాటానికి నాంది పలికింది. ఆ ఉద్యమం ఫలి తమే నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నంద మూరి తారక రామారావు మొదటి సంతకం మద్యపాన నిషేధ దస్త్రంపై చేయడం. వజ్రోత్సవం జరుపుకున్న మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అరకొర ఆచరణకు మాత్రమే నోచుకోవడం దాగని సత్యం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిట్ రూమ్స్‌ని అనుమతించే విషయం పునరాలోచించడం అవశ్య కర్తవ్యం. పర్మిట్ రూములకు అనుమతిస్తే షాపులే బార్‌లుగా మారిపోతాయని గతంలో మంత్రివర్గ ఉప సంఘం కూడా అభిప్రాయపడింది.

- మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story