- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐకి అసాధ్యం.. మనిషికి సాధ్యం!
సాహిత్య ప్రపంచంలో ముఖ్యంగా అనువాద రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమితంగా చొచ్చుకొస్తున్నట్టు కనిపిస్తున్నది.

సాహిత్య ప్రపంచంలో ముఖ్యంగా అనువాద రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమితంగా చొచ్చుకొస్తున్నట్టు కనిపిస్తున్నది. అనేక ఏఐ టూల్స్ అనువాదంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకా రాబోతున్నాయి కూడా. అయితే యాంత్రికంగా చేసే ఈ కృత్రిమ మేధానువాదం ఏ మేరకు ఉపయుక్తమయింది, ఎంతమేరకు సరైనది అన్నది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఏఐ అనువాదం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది, కానీ ఇది ఇప్పటికీ అనేక పరిమితుల్ని ఎదుర్కొంటున్నది.
భాష మనిషి భావాలను వ్యక్తపరచే సాధనం మాత్రమే కాదు అది మానవ సంస్కృతి అనుభవం, అనుభూతి, చరిత్ర, అన్వేషణల ప్రతిబింబం. ప్రపంచం ఎన్నో భాషలతో నిండి ఉంది. లిపి ఉన్నవి లేనివి ఎన్నో ఎన్నెన్నో.. ఒక భాషలో పుట్టిన భావాన్ని మరో భాషలోకి తీసుకెళ్లాలంటే కేవలం పదాల మార్పే సరిపోదు. అక్కడే "అనువాదం" అనే ప్రక్రియ మొదలవుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో, భావాన్ని సజీవంగా, ఆత్మతో కూడినట్లుగా పునఃరచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు దోహదపడేది సృజనాత్మక అనువాదం.
శబ్ద గౌరవమే అనువాద విశేషం
నిజానికి భాషలో శబ్దం, అర్థం రెండూ ప్రధానమైన మూలకాలు, వాటిలో శబ్దం అనువాద సులభ సాధ్యం కాదు. అర్థం మాత్రమే అనువాద సాధ్యం. ఒక సాహిత్యంలో ఉన్న శబ్ద చమత్కారం ఇంకో భాషలోకి వెళ్లడం అంత సులభం కాదు. అందుకే అనువాదకుడి పని మూల భాషలోని అర్థాన్ని తీసుకుని ఏ లక్ష్య భాషలోకి అనువాదం చేస్తున్నాడో ఆ భాషలో దానికి శబ్ద గౌరవం కలిగించడమే. అను వాదంలో ఎంతో కొంత నష్టం జరుగుతుందన్నది కొంత నిజమే అయినప్పటికీ అత్తరును ఒక సీసాలోంచి మరో సీసాలోకి వొంపినప్పుడు కొంత అత్తరు పోతుంది కానీ దాని సువాసన పోదు కదా.
అర్థ ప్రపంచం అర్థమైతేనే..
భారతీయ భాషలు ఒకదానితో ఒకటి అనువాదం చెయ్యడానికి ఎక్కువ అవకాశం కల్పించే భాషలు.. భారతీయ భాషల అర్థ ప్రపంచం దాదాపుగా ఒక్కటే. అందువల్ల ఒక భారతీయ భాషలోంచి ఇంకొక భారతీయ భాషలోకి అనువదించడానికి కావలసిన అర్థ ప్రపంచాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యతను అనువాదకులు కొంత తేలికగా నిర్వహించ గలరు. రచన కత్తి మీద సాము లాంటిది అయితే అనువాదకునిది రెండు కత్తుల మీద సాము. తనకి మూల లక్ష్య భాషలు వచ్చి ఉండాలి. అనువాదంలో భాషకు సంబంధించిన మరొక ఇబ్బంది కంఠస్వరం. సమర్ధుడైన రచయిత శైలికి కంఠస్వరం ఉంటుంది. మూల రచయిత కంఠస్వరాన్ని అర్థం చేసుకుని దాని ప్రాధాన్యతను గుర్తించి దాన్ని లక్ష్య భాషలో వ్యక్తం చేయగలిగినప్పుడు ఆ అనువాదం గొప్పగా ఉంటుంది. వస్తువుకు సంబంధించిన మరొక ప్రధానమైన అంశం రచయిత దృక్పధం. దాన్ని కూడా అనువాదకుడు పరిగణించాలి. అనేకానేక భాషలు తెలిసినంత మాత్రాన గొప్ప అనువాదాలు చేయగలను అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అవుతుంది.
ఏఐకి మనిషికి ఉన్న తేడా..
ఇక సృజనాత్మక అనువాదం అనేది కేవలం పదాలను మార్చడం కాదు. భావాన్ని, అనుభూతిని, సంస్కృతిని కొత్త భాషలో సజీవంగా పునఃసృష్టించడం. ఈ సృజనాత్మక అనువాదం చేయడానికి రెండు భాషలపై పూర్తి అవగాహన, రెండు సంస్కృతుల గురించి లోతైన అవగాహన, భావాన్ని నాణ్యమైన శైలిలో కొత్త భాషలో రచించగల సృజనాత్మకత, స్థానిక పాఠకుని హృదయానికి తాకేలా కొత్త మాటలు, ప్రయోగాలు రూపొందించే సామర్థ్యం కావాలి. ఇక్కడ అనువాదకుడు కేవలం అనువాదకుడిగా కాక, అనుసృజనకారుడిగా రచయితగా మారతాడు. మూల రచనను పునః రచిస్తూ కొత్త భాషలో తనదైన శైలిలో భావాన్ని పునః సృష్టించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలు భాషల ప్రపంచానికి ఎంతో అవసరం. కానీ భావజాలానికి దగ్గరగా ఉండే ప్రక్రియ సృజ నాత్మక అనువాదమే.. ఈ నేపథ్యంలో ఇవాళ కృత్రిమ మేధస్సు భాషను అర్థం చేసుకోవడంలో, అనువదించడం లో, ప్రయోగించడంలో కొత్త దారులు చూపిస్తోంది.
ఏఐ అనువాదంలో మానవ స్పర్శ లేదు..
ప్రాచీన అనువాదం ప్రధానంగా మానవ నైపుణ్యంపై ఆధారపడింది. కానీ నేడు ఏఐ టూల్స్ వంటి సాధనాల ద్వారా కొన్ని సెకన్లలోనే అనువాదాలు సిద్ధమవుతున్నా యి. ఈ పద్ధతులు వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకుంటాయి, పదాల ప్రయోగాన్ని విశ్లేషిస్తాయి, కొంతవరకూ భావాన్ని గుర్తిస్తాయి. అయితే వేగం సౌకర్యం మాత్రమే. దానివల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మూల భావనల అన్వయం, సంస్కృతి పరమైన సంకేతాల బోధ, శైలి సరళత లాంటివన్నీ మానవ అనువాదకుడి అనుభవంలో మాత్రమే సాధ్యమవుతాయి. ఒకే పదానికి అనేక అర్థాలున్నప్పుడు, సందర్భాన్ని బట్టి ఏది అనువైనదో తేల్చడంలో మానవుడు చూపే వివేచన యంత్రానికి సవాలే. ఏఐ అనువాదం వేగవంతమైనదైనా, ఎప్పటికీ మానవ భావోద్వేగాలకు సమానంగా స్పందించలేదు. పైగా అనువాదం అనేది శబ్దాల బదిలీ కాదు భావాల మార్పిడి. అది వాక్యాల కదలిక కాదు – భావాల ప్రవాహం. దీనికి కావాల్సినది మానవ స్పర్శ.
భాషా భవన నిర్మాత మానవుడే!
ఈ రోజు మెషీన్ ట్రాన్స్‌లేషన్ (MT), కంప్యూటర్-ఆసిస్టెడ్ ట్రాన్స్‌లేషన్ (CAT), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) వంటి అంశాల్లో కృషి జరుగుతోంది. కాబట్టి భవి ష్యత్తులో మానవ నైపుణ్యానికి తోడుగా ఏఐ వేగాన్ని సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ మేధస్సు అనువాద ప్రయత్నాన్ని శీఘ్రతతో నడిపించగలదు. కానీ ఆ ప్రయాణానికి సారధి మాత్రం మానవుడు అతని సృజనా శక్తి మాత్రమే. అతనిలోని భావం, అనుభవం, స్పందన, అభినివేశం అనువాదానికి జీవం. ఎప్పటికయినా ఏఐ ఆధారిత టూల్స్ పునాది కావచ్చు. కానీ భవనాన్ని మానవ అనువాదకుడే నిర్మించాలి.
- వారాల ఆనంద్
94405 01281






