- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా సృష్టిలో ఏఐ కొత్త పాఠం.. సృజనాత్మకతకు రెక్కలా లేక సంకెళ్లా?
సినిమా నిర్మాణంలో ఏఐ ఒక కొత్త శకాన్ని ఆరంభిస్తోంది. బడ్జెట్ అడ్డంకులను తొలగిస్తూ స్వతంత్ర ఫిల్మ్ మేకర్లకు వరంగా మారుతున్న ఏఐ. అదే సమయంలో ఉపాధి సవాళ్లను, నైతిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్ దిశగా సాగుతున్న సినిమా ప్రయాణంపై ఒక ప్రత్యేక విశ్లేషణ.

చలనచిత్ర చరిత్రలో ప్రతి శతాబ్దం ఒక మహా పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తుంది. మూకీ నుంచి టాకీకి, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌కు, ఫిలిం రీల్ నుంచి డిజిటల్ సెన్సార్లకు మారిన ప్రయాణంలో సాంకేతికత ఎప్పుడూ ఒక సాధనంగానే ఉంది. కానీ, నేడు మనం చూస్తున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' విప్లవం కేవలం ఒక పరికరం మార్పు కాదు, అది సినిమా సృష్టి మూలాలనే పునర్నిర్వచిస్తోంది. కెమెరా అవసరం లేకుండా, కేవలం కంప్యూటేషనల్ ఆల్గారిథమ్స్ ఆధారంగా సాగే ‘సింథటిక్ సినిమా’ యుగం ఇప్పుడు ఒక ఊహ కాదు, కళ్లముందున్న వాస్తవం.. ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద సానుకూల అంశం.. సినిమా నిర్మాణ రంగంలో ఉన్న 'ప్రవేశ అడ్డంకులను' తొలగించడం.
ఇలాంటి వారికి ఏఐ వరప్రసాదం
ఒకప్పుడు అద్భుతమైన కథాబలం ఉండి, భారీ బడ్జెట్ లేదా స్టూడియోల మద్దతు లేక ఆగిపోయిన ఎంతోమంది స్వతంత్ర ఫిల్మ్ మేకర్లకు ఏఐ ఒక వర ప్రసాదం. ఏఐ వల్ల భారీ బడ్జెట్ లేకుండానే, నటులు లేకుండానే ఒక ల్యాప్‌టాప్‌తో గొప్ప కథలను విజువల్స్‌గా మార్చడం సాధ్యమవుతోంది. ఇక సోరా, రన్‌వే, క్లింగ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు భారీ సెట్లు, లొకేషన్లు అవసరం తగ్గాయి.. పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా ఏఐ ఖర్చులు గణనీయంగా తగ్గిస్తోంది. నటుల వయస్సు తగ్గించడం, 3D స్కాన్‌లతో సన్నివేశాలు పూర్తి చేయడం, సహజమైన డబ్బింగ్‌తో ఇది సాధ్యమవుతోంది. దీంతో తెలుగు వంటి ప్రాంతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తమ మాతృభాషలోనే ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. అయితే సాంకేతికత మన ఊహలను తెరపైకి తెచ్చే ఒక వాహనం మాత్రమే. అది సేవకుడిలా ఉండాలి తప్ప యజమానిలా మారకూడదు.
నైతిక సంక్షోభం, ఉపాధి సవాళ్లు..
ఏ నాణేనికైనా రెండో పక్క ఉన్నట్లు, ఏఐ విప్లవం వెనుక తీవ్రమైన ఆందోళనలు దాగి ఉన్నాయి. ఏఐ మోడళ్లు ఇంటర్నెట్‌లోని కోట్లాది మంది కళాకారుల డేటాపై శిక్షణ పొందుతాయి. వారి అనుమతి లేకుండానే వారి శైలిని అనుకరించడం మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే సినిమాటోగ్రాఫర్లు, వీఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్లు, డబ్బింగ్ కళాకారులు తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.. సృజనాత్మక రంగంలో 'ఆటోమేషన్' అనేది మానవ శ్రమను నిరుపయోగం చేసే ప్రమాదం ఉంది. నటుల అనుమతి లేకుండా వారి రూపాన్ని, గొంతును వాడటం వల్ల నైతిక, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక భారతీయ సినిమాపై ఏఐ ప్రయోగాలు ఊపందుకున్నాయి.. ఇప్పటికే కొన్ని చిత్రాలు కొంత వరకు డిజిటల్ టూల్స్ సాయంతో తెరకెక్కించారు. కొన్ని చిత్రాలు పూర్తిస్థాయిలో ఏఐ చిత్రాలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇక కొన్ని పాత చిత్రాల ముగింపును ఏఐతో మార్చడం వంటి ప్రయోగాలు ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి.
హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్ దిశగా..
చివరగా, ఏఐ ఎంత అద్భుతమైన విజువల్స్ ఇవ్వగలిగినా, మనిషి ఇచ్చే ‘హృదయపూర్వక అనుభూతిని’ అది రీప్లేస్ చేయలేదు. కళ అనేది కేవలం దృశ్యం కాదు, అది భావోద్వేగాల కలబోత. భవి ష్యత్తులో మనం ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’ను చూడబోతున్నాం. అంటే మనిషి సృజనాత్మక దృష్టికి, ఏఐ వేగం, ఖచ్చితత్వం తోడవుతాయి. దర్శకుడు ఆలోచిస్తాడు, ఏఐ ఆ ఆలోచనను వేగంగా విజువల్‌గా మార్చుతుంది. రచయిత కథ చెబుతాడు, ఏఐ దానికి ప్రపంచ స్థాయి దృశ్యరూపం ఇస్తుంది. ఇది పోటీ కాదు, సహకారం. అందుకే ఇప్పుడు అవసరమైనది ఒక సమతుల్య దృక్పథం. ఏఐను పూర్తిగా వ్యతిరేకించడం సరైంది కాదు.. అలాగే పూర్తిగా ఆధారపడటం కూడా ప్రమాదకరం. చట్టపరమైన నియంత్రణలు, నైతిక మార్గదర్శకాలు, కళాకారుల హక్కుల పరిరక్షణ.. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఈ సాంకేతిక విప్లవం నిజమైన ప్రయోజనం అందిస్తుంది.
సినిమా మారినా..
మొత్తానికి సినిమా మారుతోంది. మారాల్సిందే కూడా. కానీ కథ చెప్పే ఆత్మ మాత్రం మారదు.. టెక్నాలజీ ఎంత ఎదిగినా, కథ మనిషి నుంచే పుడుతుంది. ఏఐ సాధనం మాత్రమే. అది కళాకారుడి చేతిలో ఉంటేనే అద్భుతాలు సృష్టిస్తుంది. కాబట్టి భవిష్యత్ సినిమా ప్రపంచం.. ఏఐ ఆధారితమైనదే అయినా, మనిషి హృదయంతోనే నడుస్తుంది. సాంకేతికత సృజనాత్మకతకు సంకెళ్లు వేయకూడదు, దానికి రెక్కలు తొడగాలి. ఏఐని ఒక ‘సృజనాత్మక భాగస్వామి’గా గుర్తించి, తగిన చట్టపరమైన నిబంధనలతో ముందుకు సాగితే, రాబోయే కాలంలో వెండితెరపై మరిన్ని అద్భుత దృశ్యకావ్యాలను మనం చూడవచ్చు.. కథ చెప్పేది మనిషే అయినంత కాలం, సినిమా ఆత్మ సజీవంగానే ఉంటుంది.
- ముద్దం నరసింహ స్వామి,
99498 39699






