ఏఐ సైన్స్ ఫిక్షన్ కాదు.. దాని చుట్టూనే యావత్ ప్రపంచం

by Ravi |   (  Updated:2025-05-29 01:01:04  IST  )

“ఏఐ(AI)ని పిలవడం అంటే పిశాచాన్ని పిలిచినట్టే” అని ఎలాన్ మస్క్ అన్నప్పుడు, అతని హెచ్చరిక మన భవిష్యత్తుపై

ఏఐ సైన్స్ ఫిక్షన్ కాదు.. దాని చుట్టూనే యావత్ ప్రపంచం
X

“ఏఐ(AI)ని పిలవడం అంటే పిశాచాన్ని పిలిచినట్టే” అని ఎలాన్ మస్క్ అన్నప్పుడు, అతని హెచ్చరిక మన భవిష్యత్తుపై ఒక తీవ్ర మైన ప్రభావాన్ని చూపింది. కానీ ఈ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా ఏఐ అనే శక్తి ఇప్పటికీ మానవాళిని ఆకర్షిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మన ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్ల నుంచి, డ్రైవర్ లేకుండా నడిచే కార్ల వరకూ, ఈ ఏఐ సైన్స్ ఫిక్షన్ కాదని స్పష్ట మైంది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి "డేటా ఆధారిత" దిగ్గజ సంస్థలు ఈ రంగంలో మరింత వేగంగా దూసుకుపోతున్నాయి.

ఈ వేగవంతమైన మార్పును అర్థం చేసుకోవడానికి మనం కొత్త రకమైన అక్షరాస్యతను, అంటే “AI లిటరసీ”ని మన పాఠశాలల్లో, ఉన్నత విద్యాసంస్థల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఏఐని ఉపయోగించని రంగం అంటూ ఏదీ లేదు. విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, క్రీడలు, సంగీతం, వినోదం, రవాణా, ఆటోమొబైల్, యుద్ధ రంగం ఇలా అన్ని చోట్లా కృత్రిమ మేధ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇకపై ఏఐ వాడకం గురించి తెలియని వారు అనాగరిక జనాభాలో చేరిపోతారు.

ఏఐ లిటరసీ అత్యవసరం!

ఏఐ అంటే కేవలం యంత్రాలు పని చేయడమే కాదు. అవి మానవ బుద్ధిని అనుకరిస్తూ, నేర్చుకుంటూ, సమస్యలను పరిష్కరిస్తూ పని చేస్తాయి. ఎలాన్ ట్యూరింగ్ నమూనాలో మానవులతో సమానంగా మాట్లాడగల చాట్‌బాట్లు, సమర్థంగా లక్ష్యాలను చేరుకునే రేషనల్ ఏజెంట్లు మొదలైనవి అన్నీ ఏఐ పరిమితులను విస్తరించాయి. కానీ ఈ శక్తి అనేక సవాళ్లను కూడా తీసుకొచ్చింది. ఓపెన్ ఏఐ 03, గూగుల్ జెమిని - 2.5 వంటి తాజా మోడల్స్ నూతన దిశగా దూసుకుపోతున్నాయి. వెబ్‌లో తాము శోధించి, కోడ్ రాసి, గ్రాఫ్‌లు రూపొందించి, వివిధ మాధ్యమాలను కలిపి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ లిటరసీ మనకు అత్యవసరం. ఇది కేవలం టెక్నాలజీని ఉపయోగించడమే కాదు. దాని వెనుకున్న విధానాలను కూడా అర్థం చేసుకోవడం. వాటి పరిమితులను గుర్తించడం కూడా అవసరమే. కనుక, ఏఐ సామాజిక ప్రభావాలను, మానవ హక్కులపై దాని ప్రభావాన్ని విశ్లేషించ గలగడం కూడా ముఖ్యమే. వ్యక్తిగత డేటా భద్రత, సమాచారం వాస్తవికత, నైతికత ఇవి అన్నీ ఈ అక్షరాస్యతలో ఇమిడి ఉన్న భాగాలే..

ఏఐ చుట్టూ యావత్ ప్రపంచం

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అమెరికా, చైనా మొదలైన అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ జాతీయ విద్యా విధానంలో ఏఐ నైపుణ్యాలను తమ విద్యార్థులకు నేర్పించే పనిలో పడ్డారు. భవిష్యత్త్ విద్యా వ్యూహాల్లో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. యునెస్కో, ఐ.ఎఫ్.ఎల్.ఏ వంటి సంస్థలు కూడా ఏఐని అర్థం చేసుకునే సామర్థ్యాలను తమ దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు వేస్తున్నాయి. మూడవ ప్రపంచ దేశాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాలు కూడా ఈ మార్గాలను వేగంగా అనుసరించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాలలో లైబ్రరీలు కీలక పాత్ర పోషిస్తాయి. డేటా నిర్వహణలో, సమాచార సేకరణ పరిజ్ఞానంలో నిపుణులైన లైబ్రేరియన్లు సామాజికంగా బాధ్యతగల ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడంలో మార్గనిర్దేశకులవుతారు. ఫేక్ న్యూస్‌‌ను నివారించటం, "ఆల్గోరిథమిక్ బైయాస్‌" వంటి సమస్యలను ప్రజలకు వివరించి, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంలో గ్రంథాలయాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి.

ఏఐ శాపం కాదు.. శ్రేయోమార్గం

ఇప్పుడు ఏఐ మానవునికి నమ్మదగిన సహచరిగా మారుతోంది. ఇది సాధారణ పరికరంగా కాకుండా, సమాచారాన్ని విశ్లేషించి, దాని ఆధారంగా చర్యలు తీసుకునే శక్తిగా రూపాంతరం చెందుతోంది. ఇలాంటి శక్తిని సమర్థవంతంగా, నైతికంగా ఉపయోగించాలంటే, మనం కృత్రిమ మేధ అక్ష రాస్యతను కొత్త తరానికి మూలాధారంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఈ శక్తిని శాపంగా కాక, శ్రేయస్కర మార్గంగా మార్చగలుగుతాం.

డా. రాధికా రాణి,

అసిస్టెంట్ ప్రొఫెసర్,కేయూ

80743 17172

Next Story