- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశాకిరణంగా మారిన ఆసుపత్రి..
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి సంక్లిష్ట క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్సలు, కీమోథెరపీ సేవలు, గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల రోగులకు అందుతున్న ఆధునిక వైద్యం వేలాది కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది.

ఆదిలాబాద్ వైద్య చరిత్రలో మునుపెన్నడూ చూడని మార్పు నిశ్శబ్దంగా ఆవిష్కృతమవుతోంది. ఒకప్పుడు వైద్య సదు పాయాల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చిన ఈ మారుమూల గిరిజన జిల్లా నేడు సంక్లిష్ట క్యాన్సర్ శస్త్ర చికిత్సలకు ఆశాకిరణంగా మారింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ కేసులను విజయ వంతంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇటీవల మహిళల గర్భాశయం, పొట్ట భాగాల్లో ఏర్పడిన 7 నుంచి 8 కేజీల బరువైన భారీ క్యాన్సర్ గడ్డలను అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విజయవంతంగా తొలగించడం ద్వారా రిమ్స్ వైద్య బృందం తమ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించింది. గత రెండు సంవత్సరాల్లో 450కు పైగా క్లిష్ట క్యాన్సర్ ఆపరేషన్లు నిర్వహించడం ఈ సంస్థ సాధించిన అరుదైన ఘనతగా రిమ్స్ నిలిచింది.
కేన్సర్ పీడిత కుటుంబాల్లో ఆశలు..
మూడో దశకు చేరుకున్న కేన్సర్ రోగులకు శస్త్రచికిత్సలు చేయడం వైద్యరంగంలో అత్యంత సవాలుతో కూడుకున్న అంశంగా భావిస్తారు. అయినప్పటికీ వైద్యులు రొమ్ము కేన్సర్, నోటి కేన్సర్, గర్భాశయ కేన్సర్, అలాగే చిన్న పేగు, పెద్ద పేగు కేన్సర్ బాధితులకు అత్యాధునిక చికిత్సలు అందిస్తూ ఎన్నో కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతున్నారు. ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు నగరాల స్థాయి వైద్యాన్ని స్థానికంగానే అందించడం విశేషం. ప్రభుత్వ ఆసు పత్రిలోనే అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండటం వేలాది కుటుంబాలకు గొప్ప భరోసాగా మారింది.
ఉచిత వైద్యం పేదలకు వరం!
రిమ్స్ సర్జికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ జక్కుల శ్రీకాంత్ నాయకత్వంలో అనేక క్లిష్ట కేసులు సఫలీకృత మయ్యాయి. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే చికిత్సలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించడం పేదలకు వరంగా మారింది. ఈ విజయాల వెనుక కేవలం ఒక విభాగం కృషి మాత్రమే కాదు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ పరిపాలనా నాయకత్వం, మౌలిక సదుపాయాల బలోపేతం, నిపుణుల బృందాలకు అందించిన ప్రోత్సాహం కూడా కీలక పాత్ర పోషించాయి.
ఆపరేషన్ థియేటర్‌లో అద్భుతాలు...
చాలామంది గ్రామీణ ప్రాంత, గిరిజన రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కేజీల బరువున్న భారీ కేన్సర్ గడ్డలను తొలగించడం అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియగా పరిగణించబడుతుంది. తీవ్రమైన రక్తస్రావం, అవయవాలపై ఒత్తిడి, శస్త్రచికిత్స అనంతర సమస్యలు వంటి అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. కానీ రిమ్స్ వైద్య బృందం ఇటువంటి కేసులను విజయవంతంగా నిర్వహించి రోగులను సురక్షితంగా బయటపడేయడం విశేషం. ఇవి కేవలం శస్త్రచికిత్సల విజయాలు మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాలకు తిరిగి జీవితం అందించిన మానవీయ విజయాలు.
కీమోథెరపీ అందుబాటులోనే..
రిమ్స్‌లో ప్రస్తుతం సంక్లిష్ట క్యాన్సర్ శస్త్ర చికిత్సలతో పాటు కీమోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉండటం జిల్లా వాసులకు గొప్ప ఊరటనిస్తోంది. వేలాది మంది రోగులు స్థానికంగానే చికిత్స పొందుతూ ఆర్థిక భారం నుంచి బయటపడుతున్నారు. అయితే శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత అవసరమయ్యే రేడియేషన్ థెరపీ సదుపాయం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో కనిపిస్తున్న మార్పు కేవలం ఒక ఆసుపత్రి అభివృద్ధి కథ మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్న ఒక సానుకూల పరిణామం. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన కేన్సర్ చికిత్సలు నేడు అడవుల జిల్లాలోని నిరుపేదలకు చేరువ కావడం ప్రజారోగ్య రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు. నేడు ఆదిలాబాద్ పెద్ద ఆసుపత్రి (రిమ్స్) ఎన్నో కుటుంబాల దృష్టిలో కేవలం ఒక వైద్య సంస్థ మాత్రమే కాదు, పునర్జన్మకు చిరునామాగా మారుతోంది.
-ఫిరోజ్ ఖాన్
9640466464






