HCUలో ఏబీవీపీ పునరాగమనం.. విద్యార్థి రాజకీయాల్లో కొత్త దిశ

by Ravi |   (  Updated:2025-09-24 00:45:33  IST  )

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏడు సంవత్సరాల తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తిరిగి అధిపత్యాన్ని ప్రదర్శించింది.

HCUలో ఏబీవీపీ పునరాగమనం.. విద్యార్థి రాజకీయాల్లో కొత్త దిశ
X

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏడు సంవత్సరాల తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తిరిగి అధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ పరిణామం కేవలం ఒక విద్యార్థి సంఘ విజయం మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా విద్యార్థి రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న సున్నితమైన మార్పులకూ సంకేతం. ‘జ్ఞానం – శీలం – ఏకత’ అనే తమ స్వభావ నినాదాన్ని ఆచరణలో పెట్టి, వామపక్ష కూటమి కాంగ్రెస్ అనుబంధ NSUIపై గట్టి ఆధిపత్యం సాధించడం ద్వారా ఏబీవీపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలదని నిరూపించింది.

వామపక్ష పట్టుపై దెబ్బ..

గత రెండు దశాబ్దాలుగా HCU వామపక్ష సంఘాల అడ్డాగా భావించబడింది. ముఖ్యంగా సోషల్ సైన్సెస్ విభాగాల్లో ప్రాబల్యం వామపక్షాలవే అని అందరూ నమ్మేవారు. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ ప్రాబల్యం తలకిందులైంది. అన్ని విభాగాల్లోనూ ఏబీవీపీ ఆధిపత్యం కనబరచడమే కాకుండా, వామపక్ష సంఘాల అజేయత అనే భావనను చెరిపేసింది. ఈ ఫలితం ఒక కొత్త వాస్తవాన్ని సూచిస్తుంది – వామపక్ష భావజాలం క్రమంగా బలహీనమవుతుండగా, జాతీయవాద ఆలోచనల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.

పోరాటమే విజయానికి దిక్సూచి..

ఏబీవీపీ సాధించిన విజయానికి మూల కారణం విద్యార్థి సమస్యలను కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, వాటితో మమేకం అవుతూ పోరాటం చేయడమే. హాస్టల్ సమస్యలు, పరీక్షల ఆలస్యం, భూవివాదాలు వంటి అంశాలపై ఈ సంఘం ముందుండి పలు ఉద్యమాలు జరిపింది. విద్యార్థుల మధ్య ఉండి, వారితో ప్రత్యక్ష సంబంధం పెంపొందించడం ద్వారా ఏబీవీపీ విశ్వాసాన్ని గెలుచుకుంది. చివరికి విద్యార్థులు గుర్తించిన సత్యం ఏమిటంటే సిద్ధాంతాలు కాదు, సమస్యల పరిష్కారమే అసలైన విజయ రహస్యం.

జాతీయ ధోరణి వైపు అడుగులు..

ఇప్పటికే పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ వరకు ఏబీవీపీ విజయ పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్ విజయం కూడా అదే వరుసలో చేరింది. ఈ ధోరణి ప్రాంతీయంగా పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఒక జాతీయవాద ప్రవాహం బలపడుతోందని తెలియజేస్తోంది. ‘జాతీయ వాదమే దేశ భవిష్యత్తు’ అన్న నినాదం ఇప్పుడు విద్యార్థి సమాజం ద్వారా మరింత ప్రాచుర్యం పొందుతోంది. ఈ విజయంతో ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మిగతా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?

విస్తృత ప్రజాస్వామ్య శిక్షణ అవసరం ..

విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి శిక్షణ అవసరం. సమాజాన్ని అర్థం చేసుకొని, సమస్యల్ని ఎదుర్కొని, నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థి సంఘాలు ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను పునరుద్ధరించడం, సమాజాన్ని బలోపేతం చేసే దిశగా నిలుస్తుంది. వామపక్షాల మరుగునపడటం, కాంగ్రెస్ పతనం, జాతీయవాదానికి పెరుగుతున్న ఆదరణ ఇవన్నీ కలిపి భారత విద్యార్థి రాజకీయాలను కొత్త దిశగా మలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో తీసుకునే విద్యార్థి నిర్ణయాలు, దేశ రాజకీయ భవిష్యత్తుపై గాఢమైన ప్రభావం చూపే అవకాశముంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వెలువడిన ఈ ఫలితం కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. యువతలో పెరుగుతున్న ఆలోచనా దిశకు, రాజకీయ రూపాంతరానికి ప్రతి బింబం. ఇది భారత విద్యార్థి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది.

-కందుకూరి రాకేష్

91006 42346

Next Story