జాతీయ విద్యార్థి శక్తికి ప్రతీక..

by Ravi |   (  Updated:2026-07-09 00:45:14  IST  )

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) స్థాపన నుంచి 76 ఏళ్ల ప్రస్థానం, జాతీయ విద్యార్థి దినోత్సవం ప్రాముఖ్యత దేశ నిర్మాణంలో ఏబీవీపీ చేసిన కృషిపై కథనం.

జాతీయ విద్యార్థి శక్తికి ప్రతీక..
X

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భారతదేశంలో క్రియాశీలకమైన విద్యార్థి సంఘంగా కొనసాగుతోంది. స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ వంటి మహనీయులు ఏబీవీపీ సంఘటనాత్మక కార్యపద్ధతికి పునాది వేశారు. విద్యారంగ సమస్యల పరి ష్కారం, భారతీయ సంస్కృతి పరిరక్షణ, విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించడం లక్ష్యంగా 1949 జూలై 9న ఏబీవీపీ స్థాపించబడింది. ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా నిర్వహిస్తారు. విద్యార్థుల ద్వారా దేశం, సమాజం కోసం ఏర్పడిన ఏబీవీపీ నేడు 76 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. "జాతీయత మా ఊపిరి – దేశభక్తి మా ప్రాణం" అనే నినాదంతో దేశ సమైక్యత, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది.

దేశం కోసం ఏబీవీపీ కార్యకర్తల త్యాగాలు..

విద్యార్థి సంఘాల మధ్య జరిగిన సిద్ధాంతపరమైన సంఘర్షణల సమయంలో అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు దేశభక్తి, జాతీయ విలువల కోసం ప్రాణత్యాగాలు చేశారు. 1982 జనవరి 26న కాకతీయ విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను అవమానించిన ఘటనను ఎదిరించి తిరిగి జెండాను ఎగురవేసిన ఏబీవీపీ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు సామ జగన్మోహన్ హత్యకు గురయ్యారు. అలాగే మేరేటి చంద్రారెడ్డి, పరకాల దగ్గు వెంకన్న, భీమన్న, జగిత్యాల రామన్న, గోపన్న, జమ్మికుంట సమ్మిరెడ్డి, నల్లగొండ ఏచూరి శ్రీను తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు దేశం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది సభ్యత్వంతో ఏబీవీపీ ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కాలానుగుణ మార్పులను స్వీకరిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వామి వివేకానంద కలలుగన్న భారత నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. స్టూడెంట్స్ ఫర్ డెవలప్‌మెంట్ (SFD) ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, ‘వృక్ష మిత్ర’ అభియాన్ ద్వారా మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రైతులు, చేనేత కార్మికులు, గల్ఫ్ కార్మికులు, సంచార జాతులు, ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలపై అధ్యయనాలు నిర్వహించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం టెక్నికల్ సెల్ ద్వారా టెక్‌ఫెస్ట్‌లు, వర్కింగ్ మోడల్స్, పేపర్ ప్రెజెంటేషన్స్, క్విజ్‌లు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రబోధన్, అగ్రివిజన్, జిజ్ఞాస, ఆవిష్కార్ వంటి ఫోరమ్‌ల ద్వారా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సాధనకై..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏబీవీపీ ప్రత్యేక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా తీర్మానాలు చేయడంతో పాటు, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించింది. 2009 మలిదశ ఉద్యమంలో ‘నా రక్తం – నా తెలంగాణ’ కార్యక్రమం ద్వారా వేలాది మంది విద్యార్థులతో రక్తదానం చేయించింది. విద్యార్థి పోరు యాత్రలు, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాల ద్వారా ఉద్యమంలో భాగస్వామ్యమైంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘ఆత్మహత్యల తెలంగాణ వద్దు – ఆకుపచ్చని తెలంగాణ ముద్దు’ నినాదంతో మొక్కలు నాటి సంరక్షించింది.

దేశ సమగ్రతకు కృషి..

దేశ సమగ్రత, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ఏబీవీపీ చురుకుగా స్పందిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల భద్రతపై ‘చలో చికెన్ నెక్’ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యతపై అవగాహన కల్పించింది. కళాశాలల్లో హింసాత్మక, విభజనాత్మక భావజాలాలకు వ్యతిరేకంగా విద్యార్థులను సంఘటితం చేస్తూ జాతీయ విలువలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. వివేకా‌నంద, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థుల అభివృద్ధి, దేశ సమగ్రత, జాతీయ పునర్నిర్మాణం కోసం ఏబీవీపీ నిరంతరం పనిచేస్తోంది. 76 ఏళ్ల ప్రయాణంలో సమాజంలోని వివిధ రంగాల్లో సానుకూల మార్పు కోసం కృషి చేస్తూ, మంచి పౌరులను తీర్చిదిద్దే "మ్యాన్ మేకింగ్ మిషన్"గా తన సేవలను కొనసాగిస్తోంది.

(నేడు జాతీయ విద్యార్థి దినోత్సవం)

- మడూరి సందీప్ రావు,

ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్

70136 95037

Next Story