- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో పెట్టుబడుల సునామీ.. ఏపీకి కొత్త ఉత్సాహం
ఇండస్ట్రియల్ దిగ్గజాలతో విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుతో ఆంధ్రప్రదేశ్ దశ మారనుంది. రూ.9.76 లక్షల పెట్టుబడులకు సంబంధించి 410 ఒప్పందాలతో

ఇండస్ట్రియల్ దిగ్గజాలతో విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుతో ఆంధ్రప్రదేశ్ దశ మారనుంది. రూ.9.76 లక్షల పెట్టుబడులకు సంబంధించి 410 ఒప్పందాలతో రాష్ట్ర దశను మార్చే చారిత్రక ఘట్టానికి విశాఖపట్నం వేదిక కానుంది. గత 17 నెలలుగా చంద్రబాబు, నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అవిశ్రాంత కృషి నేడు ,రేపు ఆవిష్కృతం కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి చూస్తోంది. దీనిలో భాగంగానే భారీగా పెట్టు బడులను ఆకర్షిస్తోంది.
చారిత్రక వేదికగా విశాఖ సదస్సు
నేడు, రేపు విశాఖలో సీఐఐ భాగస్వామ్యంతో జరగనున్న సదస్సు, రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. ప్రతి కంపెనీతో ముందుగానే నేరుగా చర్చించి, పూర్తి అవగాహనతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. గత మూడు నెలలుగా మంత్రులు వివిధ దేశాల్లో పర్యటించి, దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ పర్యటనలు, రోడ్‌షోలు పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై బలమైన నమ్మకాన్ని కలిగించాయి. రాష్ట్రంలో ఉన్న అవ కాశాలు, మానవ వనరుల గురించి వివరించి వారిని ఏపీకి ఆహ్వానించారు. ఆ ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు విశాఖ సదస్సులో చూడబోతున్నాం. సదస్సు ద్వారా సుమారు రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 410 ఒప్పందాలు కుదరనున్నాయి. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించడం గొప్ప పరిణామం.. సుమారు 20 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరు కానుండటం, ఆంధ్రప్రదేశ్‌పై ప్రపంచ పెట్టుబడిదారులకు తిరిగి విశ్వాసం ఏర్పడిందనడానికి సంకేతమనే చెప్పాలి.
అభివృద్ధి వైపు ప్రయాణం..
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. విశాఖను ఐటీ, ఏఐ హబ్‌గా మారుస్తున్నారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పాలసీతో కొత్త వెలుగులు నింపుతున్నారు. చంద్రబాబు దార్శనికత వల్లే కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాల కన్నా రాయలసీమ జిల్లాల జీడీపీ పెరిగింది. విశాఖ, అనంతపురం, కర్నూలు, గన్నవరం వంటి ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రానికి వస్తున్న భారీ ప్రాజెక్టులను చూస్తే విశాఖలో టీసీఎస్ భవన నిర్మాణం పూర్తికావచ్చింది. గూగుల్ 15 బిలియన్ డాలర్లతో ఏఐ సిటీ నిర్మించనుండగా, 1.80 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ కంపెనీలు రూ.1.35 లక్షల కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్ క్వాంటం వ్యాలీని నెలకొల్పనున్నాయి. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా, పెట్టుబడుల వికేంద్రీ కరణతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనం..
సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీస్ రూ.1,595 కోట్లతో రాష్ట్రంలో పీసీబీ తయారీ యూనిట్ పెట్టడం వల్ల ఈ ప్రాజెక్టుతో 2,170 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులను వేగంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ‘మాకు వేగం కావాలి, అందుకే ఏపీని ఎంచు కున్నాం’ అని సిర్మా ఎండీ జేఎస్ గుజ్రాల్ చెప్పడమే మంత్రి లోకేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నినాదానికి నిదర్శనం. ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేలా కసరత్తు జరుగుతోంది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా విశాఖలో ఐటీ, కోస్తా తీరంలో పారిశ్రామిక వాడలు, తిరుపతి సహా రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది.
పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు..
కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించడంపైనే తన శ్రద్ధ పెట్టింది. అధికారంలోకి వచ్చిన 10 నెలలలోనే చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. తన బృందంతో అమెరికా వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటిస్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు.. భూ కేటాయింపులు కూడా చేస్తోంది.
రెండేళ్లలో ప్రాజెక్టుల పూర్తి..
విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు దీనిలో భాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో పాటు.. కాపులుప్పాడలో డేటా సెంటర్ కోసం ఎకరానికి 50 లక్షలు చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెంబర్ 3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరా భూమి కోటి రూపాయల చొప్పున.. 3.5 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టు అందుబా టులోకి తీసుకురావడానికి రెండేళ్ల గడువు విధించింది. ఇవి అందుబాటులోకి వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కానీ వైసీపీ దీనిపై విష ప్రచారం చేస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి ఏ ప్రభుత్వం అయినా ప్రోత్సాహకాలు అందింస్తుంది. అవి అందిస్తేనే కంపెనీలు వస్తాయని.. దాని వల్ల భవిష్యత్తులో ఆ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని మాత్రం ఆ పార్టీ మరిచిపోతోంది.
-వాసంశెట్టి సుభాష్
కార్మిక శాఖ మంత్రి






