కుల రాక్షసత్వంపై మోగిన దండోరా..

by Ravi |   (  Updated:2026-01-24 01:15:36  IST  )

కులం.. ఈ రెండు అక్షరాల మాట భారతదేశంలో ఇప్పటికీ మనిషి విలువను నిర్ణయించే కొలమానం. బాబాసాహేబ్ అంబేద్కర్ ఎన్నో దశాబ్దాల క్రితమే ‘కుల పునాదుల మీద నీతిని గానీ, జాతిని గానీ నిర్మించలేం’ అని హెచ్చరించారు..

కుల రాక్షసత్వంపై మోగిన దండోరా..
X

కులం.. ఈ రెండు అక్షరాల మాట భారతదేశంలో ఇప్పటికీ మనిషి విలువను నిర్ణయించే కొలమానం. బాబాసాహేబ్ అంబేద్కర్ ఎన్నో దశాబ్దాల క్రితమే ‘కుల పునాదుల మీద నీతిని గానీ, జాతిని గానీ నిర్మించలేం’ అని హెచ్చరించారు.. కానీ వందేళ్లకు దగ్గరవుతున్నా , ప్రపంచం అంతా ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. మన దేశంలో మాత్రం కులం ఇంకా అవకాశాలను కాదు, ప్రాణాలనే తీసే స్థాయికి చేరింది.. పుట్టుకే శిక్షగా మారి, ప్రేమ నేరంగా ముద్రపడి, చావుకైనా కులం అనుమతి కావాల్సిన క్రూరమైన వాస్తవం నేటికీ కొనసాగుతూనే ఉంది.

అటువంటి కుల రాక్షసత్వంపై గట్టిగా దండోరా మోగిస్తూ, పల్లె జీవనంలోని నిగూఢమైన నిజాలనూ, దగాపడ్డ గుండెల ఆవేదనలనూ కళ్లకు కట్టినట్లుగా చూపించిన సినిమా ‘దండోరా’. కులం పేరుతో జరిగే దాడులు, హత్యలు, అవమానాల వెనుక దాగి ఉన్న మనుషుల కథను సాహసంగా తెరపైకి తీసుకొచ్చిన ఈ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.

ప్రతిభ ఉన్నా.. కులమే కొలమానం

‘కులం’, ఇది రెండు అక్షరాలే కానీ దాని వెనుక అంతులేని ఆవేదనలు ఉంటాయి.. అయితే ఆ ఆవేదనలు బయటకు కన్పించకుండా ఎలా కనుమరుగు చేస్తున్నారో.. పల్లె మనుషుల్లో కులం ఎంత చిచ్చు రేపుతోందో దండోరా సినిమాలో దర్శకుడు మురళీకాంత్ స్పష్టంగా చూపగలి గారు.. నేటికీ ఈ సమాజంలో ప్రతిభ ఎంత ఉన్నా.. చివరికి దానికి కొలమానం కులం అవుతుంది. ఎంత గొప్ప మనసు ఉన్నా.. గొప్ప చదువు ఉన్నా కులం రాక్షసత్వంపై అవేమి పనిచేయవు. ప్రతీ మనిషి జీవితంలో పుట్టుక, మరణం సాధారణం. అయితే తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన తరతరాలుగా చీదరించుకునే పరిస్థితిని, తక్కువ కులంలో పుట్టి గొప్ప కొలువు, గౌరవం ఉన్నా.. ఆ మనిషికి గౌరవించబడకపోవడానికి కారణం చూపగలిగారు. సమాజానికి తరతరాల ఆచారాలే తప్పా.. కింది కులం వారి ఆలోచనలకు విలువనీయని పరిస్థితిని సైతం చక్కగా వివరించారు. ఓ కింది కులం వారికి తమ స్మశానంలో దహనం చేసే అవకాశం లేకపోగా, శవాన్ని గుడి ముందరి నుండి తీసు కుపోతే మైలపడిపోతదని భావించి అవతలి వైపు నుంచి తిప్పి పంపడం లాంటి సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయి. ఇలా పల్లెల్లో నిత్యం జరిగే సంఘటనలనూ, దగా పడ్డ గుండెల ఆవేదనలనూ కులం పేరుతో జరిగే గాయాలను... కులం ఆధిపత్యం దాడిలో బలయ్యే జీవితాల వ్యథలను కళ్లారా చూపగలిగారు.

ఇంకా తాతల నాటి బానిసత్వాన్ని చూస్తారా?

రెండు స్వచ్ఛమైన మనసులు కులాలకు అతీతంగా కలిస్తే, ఆ మనసులను మూర్ఖత్వంగా విడగొట్టే ప్రయత్నంలో మనుషులను పొట్టన పెట్టుకోవడానికి వెనుకాడడం లేదు. కులం తక్కువోడికి తమ బిడ్డను ఇస్తే నలుగురిలో ఎలా తిరగగలను అని మనుషులను ద్వేషించడమే కాదు.. హత్య చేయడమే మంచిది అన్నట్లుగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు చూపించారు. మీరు ఎంత గొప్ప చదువులు చదివినా.. ఎంత ఆస్తి ఉన్నా.. పుట్టిన పుట్టుక మారదంటూ తాతల నాటి బానిసత్వాన్ని చూస్తున్నారే తప్పా, కింది కులాల్లోని గొప్ప మనసులను అర్థం చేసుకునే స్థితిలో లేరు.. కుల వివక్ష తీవ్రంగా ఉన్న రోజులను, కుల కట్టుబాట్ల వల్ల విచ్చిన్నం అవుతున్న కుటుంబాలను, పల్లెలను వీడి పట్టణాలకే పరిమితమయ్యేలా కుల రాక్షసత్వాన్ని సైతం వివరించగలిగారు.

ప్రశ్నిస్తే.. కుల కట్టబాట్లు అంటూ..

ఇక కులం కేవలం కింది వర్గాలనే కాదు ఉన్నత వర్గాల్లోనూ కట్టుబాట్ల పేరిట ఎంత భయపెట్టిందో అర్థం అవుతుంది. కులానికి ఎదురు తిరిగితే.. కులం మాట వినకపోతే అంత్యక్రియలకు కూడా షరతులు విధిస్తూ రాక్షస ఆనందాన్ని పొందిన విధానం.. చైతన్యం కలిగిన, సమాజాన్ని ప్రశ్నించే సత్తా కలిగిన వారుంటే కులం కట్టుబాట్ల పేరుతో వారిని వెలేయడం నాటి అనాగరిక కుల రక్కసి కన్పిస్తుంది. కులం అనే గర్వం ఆ మనిషి.. ఆ కుటుంబాన్ని ఎంత చిన్నా భిన్నం చేస్తుందో అద్భుతంగా చూపగలిగారు. కులం సమాజానికి బలం అవ్వాలి.. అంతేగానీ ఆవేదనలకు కారణం కాకూడదు.. అటువంటి అనేక ఆవేదనలకు దండోరా సాక్ష్యంగా నిలిచింది.

మహనీయుల మాటలను చెప్పించి..

ఇక కుల వివక్షపై అవగాహన సమావేశాల్లో అంబేద్కర్‌, పెరియర్, జ్యోతిరావు ఫూలే వంటి సామాజిక శక్తుల పేర్లు తీసుకొని సమసమాజం కోసం ఎలా కొట్లాడాలో నేర్పే ప్రసంగం సినిమాలో ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మహ నీయుల పేర్లను సినిమాలో చాలా అరుదుగా వాడుకుని వారి మాటలను విద్యార్థులకు ప్రసంగాల పేరిట విన్పించి నేటి తరానికి ఓ సందేశాన్ని ఇచ్చినట్లు చేశారు. ‘చదవండి పిచ్చిపట్టినట్లు చదవండి.. ఏది తప్పనిపిస్తే దానిని నిలదీయండి’ అంటూ.. ‘బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే రాజకీయం తెలుస్తది. రాజకీయం తెలిస్తేనే బతుకులు బాగుపడతాయంటూ’ ప్రస్తుత తరానికి సైతం ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు. అలాగే కింది కులాల వారికి గుడిలోకి ప్రవేశానికి వందేళ్లు పట్టిందనే సత్యాన్ని చెప్పారు.

ఇటువంటి సినిమాలు రావాలి!

చివరికి శివాజీ చనిపోతే ఆయన ఆంత్యక్రియలకు అడ్డు పడటంతో కుల రాక్షసత్వం ఎంత ప్రమాదమో తెలిసివచ్చేలా చేయడం, దీంతో పెంచుకున్న బిడ్డ తన పేరు మీద ఉన్న భూమిని ఊరి ప్రజల స్మశానం కోసం రాసి ఇవ్వడంతో కులం పెనుభూతాన్ని తరిమికొట్టినంత పనిచేసి కుల కట్టు బాట్లను ఎదురించగలిగింది.. ఇక కులాల కుంపటిలో తల్లి లాంటి బిడ్డను కోల్పోయిన తండ్రి ఆవేదన, తండ్రి ఆవేశం వల్ల చెల్లిని కోల్పోయాననే ఆవేశంతో కన్న కొడుకు తండ్రిని అసహ్యించుకునే సందర్భం... ఆవేశం, ఆవేదనలకు అంతులేని దుఃఖానికి దండోరా సాక్ష్యంగా కన్పించింది. ప్రేమ, చావు, అంత్యక్రియలు అనే మూడు అంశాలను పట్టుకొని ఆనాటి పరిస్థితులను కళ్లకు అద్దారు. ఇటువంటి సామాజిక, సందేశాత్మక చిత్రాలు మరెన్నో రావాల్సిన అవసరం ఉంది.

-పాలపర్తి సంధ్యారాణి

92473 99272

Next Story