- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వవిద్యాలయం.. మా ప్రాథమిక హక్కు!
గిరిజన, గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు చేరువ చేసేందుకు ఆదిలాబాద్‌లో ప్రత్యేక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఈ కథనం విశ్లేషిస్తుంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా ఉన్నత విద్యా అవకాశాల్లో ప్రాంతీయ అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు. రాష్ట్రంలోని అనేక ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటికీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేవు. భౌగోళికంగా విస్తారమైన, గిరిజన జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం–ఆసిఫాబాద్ జిల్లాలుగా విభజించబడింది. ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ విద్య పూర్తిచేస్తున్నప్పటికీ, పీజీ, పరిశోధన, వృత్తి నైపుణ్య కోర్సుల కోసం హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఉన్నత విద్య కేవలం ఉద్యోగ అవకాశాలకే కాదు.. జ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం, పరిశోధనా సంస్కృతిని పెంపొందించే సాధనం. ఒక ప్రాంతంలో విశ్వ విద్యాలయం ఏర్పాటు అయితే స్థానిక విద్యార్థులకు విద్య అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి, పరిశోధన, ఆర్థికాభివృద్ధికి కూడా ఊతమిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మెదక్, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేక ప్రభుత్వ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. గిరిజన అధ్య యనాలు, అటవీ వనరులు, వ్యవసాయం, పర్యావరణ శాస్త్రం, ప్రజా ఆరోగ్యం వంటి ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యా విభాగాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలను బలోపేతం చేసి, గిరిజన, గ్రామీణ విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్ షిప్‌లు, పరిశోధన కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు అందుబాటులోకి తేవాలి. ఈ 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఈ జిల్లాల్లో ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా అసమానతలను తగ్గించి, ప్రాంతీయ సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా హక్కుల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చారి త్రాత్మక అడుగు వేయాల్సిన అవసరం ఉంది.
-పుల్లెంల గణేష్
95530 41549






